English | Telugu

తను చనిపోతున్నానని తెలిసి కోట్ల ఆస్తిని అందరికీ పంచేసిన హీరోయిన్‌!

సినిమా రంగం గ్లామర్‌ ప్రపంచం.. ఆ ప్రపంచంలో విహరించాలని, సుఖ సౌఖ్యాలు అనుభవించాలని ఎంతో మంది కలలు కంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అది వారి ప్రతిభ కావచ్చు లేదా అదృష్టం కావచ్చు. అవకాశాలు వారిని వరిస్తాయి, ప్రేక్షకులు వారిని ఆదరిస్తారు. అలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అయితే ఆ స్థానాన్ని అందరూ కాపాడుకోలేరు. కొందరు స్వయంకృతాపరాథం వల్ల దీనస్థితికి చేరుకుంటే, మరికొందరు విధి ఆడే వింత నాటకంలో బలిపశువులుగా మారతారు. ఈ విషయంలో నటుల కంటే నటీమణుల జీవితాల్లోనే ఎక్కువ విషాదాన్ని మనం చూస్తుంటాం. అలాంటి వారిలో శ్రీవిద్య ఒకరు. అందర్నీ కట్టిపడేసే అందం ఆమె సొంతం. అన్నింటినీ మించి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి గుణం. అయినా ఎంతో ఉన్నతంగా సాగాల్సిన ఆమె వ్యక్తిగత జీవితం విషాదభరితం కావడం వెనుక జరిగిన ఘటనలు ఏమిటి? ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఎలాంటివి? అనే విషయాలు తెలుసుకుందాం.

తమిళ హాస్యనటుడు కృష్ణమూర్తి, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎం.ఎల్‌.వసంతకుమారిలకు శ్రీవిద్య జన్మించింది. ఆమె పుట్టిన సంవత్సరానికే తండ్రికి పక్షవాతం రావడంతో ఆయన నటనకు స్వస్తి పలికారు. కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లిపైనే పడిరది. కచ్చేరీలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే శ్రీవిద్య సినిమాల్లోకి ప్రవేశించింది. 14 ఏళ్ళ వయసులో శివాజీ గణేషన్‌ హీరోగా నటించిన తిరువరుచెల్వర్‌ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేశారు శ్రీవిద్య. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పేదరాశిపెద్దమ్మ కథ. శ్రీవిద్యను దాసరి నారాయణరావు తన సినిమాల ద్వారా ఎక్కువగా ప్రోత్సహించారు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రంలో కమల్‌హాసన్‌, రజినీకాంత్‌ నటించారు. ఇదే సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు ‘తూర్పు పడమర’ పేరుతో రీమేక్‌ చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించింది. రెండు భాషల్లోనూ శ్రీవిద్య ప్రధాన పాత్ర పోషించారు. 

కమల్‌హాసన్‌, శ్రీవిద్య ఎక్కువ సినిమాల్లో కలిసి నటించారు. ఆ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు కూడా దానికి అంగీకారం తెలిపాయి. కారణం తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు కమల్‌. ఆ తర్వాత మలయాళ దర్శకుడు జార్జ్‌ థామస్‌తో ప్రేమలో పడి 1978లో అతన్ని వివాహం చేసుకున్నారు శ్రీవిద్య. థామస్‌ క్రిస్టియన్‌. శ్రీవిద్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. ఈ పెళ్ళికి శ్రీవిద్య తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వారిని ఎదిరించి థామస్‌ని పెళ్ళి చేసుకున్నారు. అతని కోరిక మేర పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీవిద్య. రెండు సంవత్సరాలు మాత్రమే వారి వైవాహిక జీవితం నడిచింది. థామస్‌ కెరీర్‌ సవ్యంగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. సినిమాల్లో నటించాలని శ్రీవిద్యకు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ నటిగా కొనసాగారు. శ్రీవిద్య సంపాదిస్తుంటే.. దాన్ని ఖర్చు చేసే పనిలో ఉండేవాడు థామస్‌. దానికితోడు వేధింపులు కూడా ఎక్కువ కావడంతో 1980లో అతని నుంచి విడాకులు తీసుకున్నారు శ్రీవిద్య. 

ఆ తర్వాత నటిగా కొనసాగారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. 2003లో శ్రీవిద్య అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు జరిపిన పరీక్షల్లో ఆమెకు రొమ్ము క్యాన్సర్‌ ఉన్నట్టుగా తేలింది. తను ఎంతో కాలం బ్రతకదని తెలుసుకున్న శ్రీవిద్య తన పేరుపై ఎలాంటి ఆస్తి ఉండకూడదని నిర్ణయించుకున్నారు. సంగీత, నృత్య కళాశాలలోని విద్యార్థులకు స్కాలర్‌ షిప్స్‌ అందడం లేదని తెలుసుకొని మలయాళ నటుడు గణేష్‌ ఆధ్వర్యంలో ఒక ట్రస్ట్‌ను రిజిష్టర్‌ చేసారు. దాని ద్వారా అర్హులైనవారికి సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఆరోజుల్లోనే శ్రీవిద్యకు ఉన్న కోట్ల ఆస్తుల్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్‌కి కొంత రాసారు. తన తమ్ముడి పిల్లలకు ఐదేసి లక్షలు చొప్పున, తన దగ్గర పనిచేసిన వారికి లక్ష రూపాయల చొప్పున చెందేలా వీలునామా రాయించారు. మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌కి ట్రీట్‌మెంట్‌  తీసుకున్న శ్రీవిద్య ఆరోగ్యం క్షీణించడంతో 2006 అక్టోబర్‌ 19న 53 ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు.