English | Telugu

సినీ సంగీతానికి సరికొత్త వన్నె తెచ్చిన సంగీత జ్ఞాని ఇళయరాజా!

 

ఇళయరాజా (Ilaiyaraaja).. ఈ పేరు తెలియని సంగీతాభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన తన పాటలతో సినీ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనం సృష్టించారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు తమ సంగీతంతో ప్రేక్షకుల్ని అలరించారు. అయితే వారు తమ స్వరాలలో వైవిధ్యాన్ని చూపించగలిగారు తప్ప సంగీత వాయిద్యాలతో కొత్త ప్రయోగాలు చెయ్యలేకపోయారు. ఆ సమయంలో సినీ సంగీతంలో ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా సంగీత వాయిద్యాలను ఉపయోగించే తీరులోనూ విప్లవాన్ని తీసుకొచ్చారు ఇళయరాజా. క్లాస్‌, మాస్‌, వెస్ట్రన్‌.. ఇలా ఏ తరహా సంగీతమైనా తన శైలితో, కొత్త మార్పులతో, శ్రోతలను కట్టిపడేసే ఆర్కెస్ట్రాతో అలరించడం ఆయన ప్రత్యేకత. ఒక సాధారణ సంగీత కారుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఇళయరాజా అసాధారణ సంగీత దర్శకుడిగా సంగీత ప్రియుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. జూన్‌ 2 ఇళయరాజా పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

 

ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్‌. స్కూల్‌లో చేర్పించినపుడు ఆయన పేరు పక్కన రాజా అని చేర్చారు తండ్రి. అలా జ్ఞానదేశికన్‌ రాజా అయ్యారు. రాజా ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వ్యయసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలోనే పొలాల్లో పాడుకునే పాటల వల్ల జానపద సంగీతం ఇళయరాజాకు పరిచయమైంది. సంగీతాన్ని వృత్తి చేసుకోవాలంటే శాస్త్రీయ సంగీతం ఎంతో అవసరం అని గ్రహించిన ఆయన మద్రాస్‌లోని ధన్‌రాజ్‌ మాస్టర్‌ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆ తర్వాత మద్రాస్‌లో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం బాలీవుడ్‌ సంగీత దర్శకుడు సలీల్‌ చౌదరి వద్ద గిటారిస్టుగా, కీ బోర్డు ప్లేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్‌ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఆయన దగ్గర దాదాపు 200 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత 1976 అన్నక్కలి అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చారు. ఆయన జ్ఞానదేశికన్‌ను ఇళయ అని పిలిచేవారు. ఇళయ అంటే చిన్నవాడు అని అర్థం. జ్ఞానదేశికన్‌ అనే పేరును ఇళయరాజా అని పంజు అరుణాచలం మార్చారు. 

 

సంగీతం నేర్చుకునే సమయంలోనే పాశ్చాత్య సంగీత కారుల సంగీత శైలులు ఇళయరాజాను ఎంతో ఆకర్షించాయి. సంగీతాన్ని ఓ తపస్సులా భావించి అభ్యసించడం వల్ల సినీ సంగీతంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించగలిగారాయన. ఎవరి సంగీతాన్ని అనుకరించకుండా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకోవడం ఇళయారాజాలోని ప్రత్యేకత. దాదాపు 50 సంవత్సరాల సినీ సంగీత ప్రయాణంలో ఇళయరాజా వివిధ భాషల్లో 1,000 సినిమాలకు సంగీతాన్ని అందించారు. అంతేకాదు, 20,000 మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌లో పాల్గొన్నారు. తమిళ్‌లో ఆయనకు ఇసైజ్ఞాని అనే బిరుదు ఉంది. లండన్‌లోని రాయల్‌ ఆర్కెస్ట్రా వారు ఆయన్ని మేస్ట్రో అని పిలుస్తారు. 

 

1970వ దశకంలో ఇళయరాజా ఇండస్ట్రీకి వచ్చే సమయానికి సినిమా పాటల ధోరణిలో చాలా మార్పు వచ్చింది. అంతకుముందు వినిపించిన మెలోడీ తగ్గి మాస్‌ పాటలు పెరిగాయి. ఆ సమయంలో వచ్చిన ఇళయారాజా సినీ ప్రేమికులకు ఓ కొత్త సంగీతాన్ని పరిచయం చేశారు. ఆయన సంగీతానికి శ్రోతలు, ప్రేక్షకులు పరవశించిపోయారు. ఇప్పటికీ ఆయన స్వరపరచిన పాటలు విరివిగా వినిపిస్తున్నాయంటే సంగీత ప్రపంచంలో ఇళయరాజా వేసిన ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన సంగీతం గురించి, ఆయన స్వరపరిచిన పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 

 

ఇళయరాజా తన కెరీర్‌లో లెక్కలేనన్ని పురస్కారాలు అందుకున్నారు. దేశవిదేశాల్లో ఎన్నో సంస్థలు ఆయన్ని సత్కరించాయి. 2013లో ప్రఖ్యాత ఛానల్‌ సిఎన్‌ఎన్‌ఐబిన్‌ నిర్వహించిన సర్వేలో 49 శాతం మంది ప్రజలు భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇళయరాజాను ఎన్నుకున్నారు. కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులను అందించింది. అలాగే ఐదు సార్లు సంగీత విభాగంలో జాతీయ అవార్డులు అందుకున్నారు ఇళయరాజా. ఇప్పటివరకు తన సంగీతంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసిన ఇళయరాజా ఇక ముందు కూడా తన శ్రావ్యమైన సంగీతంలో ఓలలాడిరచాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.