English | Telugu
జంధ్యాలకు బాగా నచ్చిన కామెడీ సినిమాలేవో తెలుసా?
Updated : Jul 4, 2021
తెలుగు సినిమా స్వర్ణయుగ కాలంలో ఎన్నో హాస్యభరిత చిత్రాలు ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి, వారిని కడుపుబ్బా నవ్వించాయి. ఆ తర్వాత చాలా కాలం మంచి కామెడీకి గ్రహణం పట్టిందని విశ్లేషకులు అంటారు. దర్శకుడు జంధ్యాల రాకతో కామెడీకి తెలుగు సినిమాల్లో తిరిగి పట్టాభిషేకం జరిగింది. ఆయన రూపొందించిన 'శ్రీవారికి ప్రేమలేఖ' (1984) ప్రేక్షకులను పడీపడీ నవ్వించింది. హాయి కలిగించే వినోదాన్ని అందించింది. ఆ సినిమా స్ఫూర్తితో తిరిగి కామెడీ సినిమాల హవా మొదలైంది. జంధ్యాల 'హాస్యబ్రహ్మ'గా కీర్తి సంపాదించారు. అలాంటి జంధ్యాలకు తను తీసిన సినిమాలు కాకుండా హాస్య సినిమాల్లో ఏవి ఇష్టం?
జంధ్యాలకు వ్యక్తిగతంగా వెనుకటి సినిమాల్లో కామెడీ అంటే చాలా ఇష్టం. ఆయన తీసిన కామెడీ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది.. వాటిలో కొన్ని క్యారెక్టర్స్ కానీ, మాటలు కానీ.. వాటివల్లే ప్రభావితులై చేశారని. షావుకారు (1950), మిస్సమ్మ (1955), కన్యాశుల్కం (1955), మాయాబజార్ (1957) సినిమాల్లో పాత్రల చిత్రణ ఆయనకు చాలా ఇష్టం. 'కన్యాశుల్కం' నాటకం అనుకోండి. సినిమాగా వచ్చింది కాబట్టి మనం సినిమాగా మాట్లాడుకుంటున్నాం. అయినప్పటికీ ఆ సినిమాలోని క్యారెక్టరైజేషన్ కానీ, మాయాబజార్‌లో ఎస్వీ రంగారావు చేసిన ఘటోత్కచుడు పాత్ర దగ్గర ఉండే శిష్యుల క్యారెక్టర్స్, శశిరేఖా పరిణయం సీన్ అంటే జంధ్యాలకు తెగ ఇష్టం.
ఇంకా 'పెళ్లిచేసి చూడు' (1952), 'అప్పుచేసి పప్పుకూడు' (1959), 'ప్రేమించి చూడు' (1965) మంచి కామెడీ సినిమాలనేది ఆయన అభిప్రాయం. ఆయన దృష్టిలో 'ప్రేమించి చూడు' మంచి డెప్త్ ఉన్న కామెడీ. వాటిల్లో మనకు నిజజీవితంలో కనిపించే పాత్రలు కనిపిస్తాయని చెప్పేవారు జంధ్యాల.
"అప్పట్లో మనుషుల్లోని మంచితనం, అమాయకత్వం ఆ పాత్రల్లో ప్రతిబింబిస్తే, ఇవాళ్లి సమాజం సినిమాల్లో ఇవాళ్టికి తగ్గట్లు ప్రతిబింబిస్తోంది. అందుకే గతంలో బూతు అని సెన్సారు అనుమతించని పదాలు ఇవాళ్లి సినిమాల్లో వారి అనుమతితోనే వినిపిస్తున్నాయి. ఇదివరకు అశ్లీలం అనిపించేవి ఇవాళ సినిమా టైటిల్స్ అవుతున్నాయి. ఏది మంచి సినిమా.. ఏది చెడ్డ సినిమా అని చెప్పడం కష్టం కానీ, సినిమా అనేది చెడువైపు వెళ్లకుండా ఉంటే చాలు. అటువైపు వెళ్లకుండా హాయిగా నవ్వించొచ్చు." అని ఒకసారి చెప్పారు జంధ్యాల.