English | Telugu
ఒకప్పుడు భానుమతి పరిచయం చేసిన ఈ బాలనటిని గుర్తుపట్టారా?
Updated : Jul 3, 2021
బాల తారలతో భానుమతి తమ భరణీ స్టూడియోలో నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా 'భక్త ధ్రువ - మార్కండేయ'. మొదట ఈ చిత్రాన్ని పెద్దవాళ్లతోనే తియ్యాలని ఆమె అనుకున్నారు. కాని, కన్నడంలో ఎవరో తీస్తున్నారని తెలుసుకొని ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తర్వాత పిల్లలతో, హైదరాబాద్‌లో కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. పిల్లలతో సినిమా - అందులోనూ పౌరాణికం తియ్యాలంటే ఎంతో ఉత్సాహం, ఓపిక ఉండాలి. కామేశ్వరరావు గారికి ఇతరత్రా చిత్రాలుండటం వల్లా, పిల్లలతో శ్రమతీసుకొని ఉత్సాహంగా చేయించే వయసు ఆయనది కాదు కనుకా, దర్శకత్వ బాధ్యతలను భానుమతి స్వయంగా చేపట్టారు.
'భక్త ధ్రువ - మార్కండేయ'కు స్క్రిప్టు రాసింది కూడా ఆమే. పౌరాణికం కాబట్టి భాష జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయంతో మంచి రచయితల కోసం ప్రయత్నించారు. ఆ టైమ్‌కు సరైన వాళ్లెవరూ ఆమెకు లభించలేదు. దాంతో రచనా వ్యాసంగంలో తనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రానికి సంభాషణలు కూడా ఆమే రాశారు. నిజానికి ఆమె ఈ సబ్జెక్టును 1974లోనే అనుకున్నారు. ఏడేళ్ల తర్వాత.. అంటే 1981లో ప్రారంభించారు. 'భక్త ధ్రువ - మార్కండేయ' చిత్రంలో ధ్రువునిగా బేబీ వంశీకృష్ణ, మార్కండేయగా బేబీ పింకీ (బొంబాయి) నటించారు.
నారదునిగా రవిశంకర్ (సాయికుమార్ తమ్ముడు), ఈశ్వరునిగా మూర్తి (సంగీత దర్శకుడు సత్యం కుమారుడు), సురుచిగా రోహిణి, సునీతిగా శోభన నటించడం ఈ సినిమాకు సంబంధించిన విశేషం. ఈ చిత్రంలో నటించిన పిల్లలంతా 13 సంవత్సరాల లోపువాళ్లే. సునీతిగా నటించిన శోభనకు ఇదే తొలి చిత్రం. తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్‌గా రాణించడమే కాకుండా నటనలో రెండు జాతీయ అవార్డులు సహా పలు అవార్డులను అందుకున్న శోభన, ఈ బేబి శోభన ఒక్కరే. ఆమె ప్రముఖ తారలు లలిత, పద్మినిల మేనకోడలు. చిత్ర స్వామినాథన్ దగ్గర నాట్యంలో శిక్షణ పొందుతూ ఈ సినిమాలో నటించారు శోభన.
భరణీ సంస్థ నిర్మించే చిత్రాలకు సంగీత దర్శకత్వం ఎవరు వహించినా, అందులో భానుమతిగారి చేయి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. 'భక్త ధ్రువ - మార్కండేయ'కు సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు. రాజేశ్వరరావు-భానుమతి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్‌గా పేరుపొందినవే. ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, మూడు పద్యాలు, రెండు శ్లోకాలు ఉన్నాయి. పాటలను ఆరుద్ర, వేటూరి, కొసరాజు, సి. నారాయణరెడ్డి, శారదా అశోకవర్ధన్ రాశారు. ఈ చిత్రం 1982లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.