English | Telugu

జనానికి బీపీ షుగర్ రాకుండా చేసిన ఈవివి..మరి వారసుడు లేనట్టేనా?

నవ్వు నాలుగు విధాలా చేటు అనేది పాత మాట. నవ్వు చాలా విధాలా గ్రేటు అనేది కొత్త మాట. మనిషి ఆరోగ్యానికి చిట్కా ఆరోగ్యకరమైన హాస్యమేనని వైద్యులు సైతం తేల్చేశారు. ఎన్ని సమస్యలు ఉన్నా, అన్నింటినీ మర్చిపోయి హాయిగా నవ్వుకోవాలని వారు సూచిస్తున్నారు. దీని గురించి డాక్టర్లు చెప్పకపోయినా.. మనసు బాగా లేనపుడు మంచి వినోదాన్ని అందించే సినిమా చూడడం ద్వారా మనసు కుదుట పడడం మనమూ గమనిస్తాం. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించి ప్రేక్షకులచేత హాస్యబ్రహ్మ అనిపించుకున్న దర్శకుడు జంధ్యాల. రచయితగా కొన్ని వందల సినిమాలకు పనిచేసిన జంధ్యాల కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే డైరెక్టర్‌ అయ్యారా అన్నట్టు తన ప్రతి సినిమాలోనూ నవ్వులు కురిపించేవారు. అప్పట్లో ఆయన సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి హాస్యబ్రహ్మ దగ్గర శిష్యరికం చేసి ఆయన అడుగుజాడల్లోనే నడిచి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తిన దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ. దాదాపు 20 సంవత్సరాలపాటు హాస్య భరిత చిత్రాలే కాకుండా, మహిళా ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకునే సినిమాలు రూపొందించిన ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి జూన్‌ 10. ఈ సందర్భంగా ఆయన చేసిన హాస్య చిత్రాల గురించి, ఆలోచింపజేసిన మహిళా చిత్రాల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.  

గురువు జంధ్యాల ఆశీస్సులతో హాస్యం అనే ఆయుధాన్ని సిద్ధం చేసుకొని దర్శకుడు అవ్వాలన్న లక్ష్యంతో ఎంతో మంది నిర్మాతలను కలిసి కథలు వినిపించారు. కథ బాగుంది అనే వారే తప్ప సినిమా నిర్మించే ధైర్యం మాత్రం ఎవ్వరూ చెయ్యలేకపోయారు. అదే సమయంలో డి.రామానాయుడు మేనల్లుడైన నటుడు, నిర్మాత కె.అశోక్‌కుమార్‌.. ఇవివికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్‌ హీరోగా ‘చెవిలోపువ్వు’ చిత్రాన్ని రూపొందించారు ఇవివి. ఈ సినిమాలో ఇవివి మార్క్‌ హాస్యం ఉన్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే కొందరు నిర్మాతలు ఇవివితో సినిమాలు చేసేందుకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ‘చెవిలోపువ్వు’ నిరాశపరచడంతో ఆ నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఆ సమయంలో డి.రామానాయుడు వెన్నుతట్టి ఇవివిని ప్రోత్సహించారు. హరీష్‌, మాలాశ్రీ జంటగా ఇవివి దర్శకత్వంలో ‘ప్రేమఖైదీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించి ఇ.వి.వి.సత్యనారాయణ అనే టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఇండస్ట్రీకి వచ్చాడు అని చాటి చెప్పింది. ఈ సినిమా సాధించిన విజయంతో ఇవివి మార్గం సుగమం అయింది. మూడో సినిమాగా ఆయన చేసిన ‘సీతారత్నంగారి అబ్బాయి’తో కామెడీని అద్భుతంగా తియ్యగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇవివి. 

ఆ తర్వాత తన తొలి సినిమా హీరో రాజేంద్రప్రసాద్‌తోనే అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు, ఆలీబాబా అరడజను దొంగలు వంటి సూపర్‌హిట్‌ సినిమాలను వరసగా రూపొందించి కామెడీ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేశారు ఇవివి. ఇవివి కెరీర్‌లో ‘జంబలకిడి పంబ’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇవివి అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ఇది. హాస్యభరిత చిత్రాలు చేస్తూనే మహిళా సమస్యల నేపథ్యంలో కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల్లోనూ తన మార్క్‌ హాస్యాన్ని జోడిరచి నవ్వించేవారు ఇవివి. అలా చేసిన సినిమాల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి ‘ఆమె’, ‘తాళి’, ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘మా ఆవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’. 

కేవలం చిన్న హీరోలు, ఓ మాదిరి హీరోలతోనే కాకుండా స్టార్‌ హీరోలతో కూడా సినిమాలు తీసి సక్సెస్‌ అయ్యారు ఇవివి. చిరంజీవితో ‘అల్లుడా మజాకా’, నాగార్జునతో ‘వారసుడు, హలో బ్రదర్‌, ఆవిడా మా ఆవిడే’ , వెంకటేశ్‌తో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, బాలకృష్ణతో ‘గొప్పింటి అల్లుడు’ వంటి చిత్రాలను రూపొందించి ఆకట్టుకున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ని డైరెక్ట్‌ చేసింది ఇవివినే.

2000లో ఇ.వి.వి. సినిమా పేరుతో బేనర్‌ను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘చాలా బాగుంది’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. తన ఇద్దరు కుమారుల్లో నరేష్‌ను డైరెక్టర్‌గానూ, ఆర్యన్‌ రాజేష్‌ను హీరోగా చూడాలనుకున్నారు ఇవివి. తన డైరెక్షన్‌లోనే ‘హాయ్‌’ అనే సినిమా ద్వారా ఆర్యన్‌ రాజేష్‌ను హీరోగా పరిచయం చేశారు. హీరోగా అంతగా ఆకట్టుకోలేకపోయిన రాజేష్‌ ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. డైరెక్టర్‌ అవుతాడనుకున్న నరేష్‌ ‘అల్లరి’ చిత్రంతో హీరో అయిపోయారు. ఆ తర్వాత కామెడీ హీరోగా దూసుకుపోయారు. తమ సొంత బేనర్‌లోనే అల్లరి నరేష్‌ హీరోగా చాలా సినిమాలు చేశారు ఇవివి.  

ఇవివి డైరెక్టర్‌గా సక్సెస్‌ అవ్వడానికి మొదటి కారణం టైటిల్‌. తన సినిమాకి టైటిల్‌ నిర్ణయించడంలోనే సగం సక్సెస్‌ అయిపోతారు ఇవివి. తన కెరీర్‌లో డైరెక్ట్‌ చేసిన సినిమాలన్నింటికీ డిఫరెంట్‌గా టైటిల్స్‌ పెట్టి ప్రేక్షకుల్ని ఆకర్షించేవారు. ఆ టైటిల్‌తో వారిలో క్యూరియాసిటీ ఏర్పడి థియేటర్లకు తరలి వచ్చేవారు. అంతేకాదు, జంధ్యాల తరహాలోనే సినిమాలోని టైటిల్స్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసేవారు. దాదాపు రెండు దశాబ్దాలు తన సినిమాలతో నవ్వులు పూయించిన ఇవివి మరణం హాస్య ప్రియులందర్నీ బాధించింది. ఇవివి మన నుంచి దూరమై 14 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు మళ్లీ అలాంటి డైరెక్టర్‌ ఇండస్ట్రీకి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచే విషయమే. జూన్‌ 10 ఇ.వి.వి.సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అందిస్తోంది తెలుగువన్‌.