English | Telugu
ఒక్క నమస్కారంతో వేలమంది జనాన్ని కంట్రోల్ చేసిన ఎన్.టి.ఆర్!
Updated : Jun 7, 2024
పాత రోజుల్లో సినిమాల షూటింగ్స్ ఎక్కువ శాతం స్టూడియోల్లోనే జరిగేవి. ఇల్లు, గుడి, బడి, ప్యాలెస్, అడవి.. ఇలా ఏ లొకేషన్‌లో తియ్యాలన్నా దానికి సంబంధించిన సెట్స్ వేసి షూటింగ్ చేసేవారు. ఔట్‌డోర్ షూటింగ్స్ చాలా తక్కువగా జరిగేవి. ఎవరన్నా ధైర్యం చేసి ఔట్‌డోర్ షూటింగ్ చెయ్యాలంటే అక్కడికి వచ్చే జనంతో చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి ఓ సంఘటన నటరత్న ఎన్టీఆర్, జమున, ఎల్.విజయలక్ష్మీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘రాముడు భీముడు’ షూటింగ్‌లో జరిగింది. మూవీమొఘల్ డా.డి.రామానాయుడు నిర్మించిన తొలి సినిమా అది.
ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఒకసారి ఎన్టీఆర్ నాగార్జున సాగర్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఇదే విషయాన్ని నిర్మాత రామానాయుడితో చెబుతూ ‘అక్కడ మన సినిమా షూటింగ్ పెట్టుకుంటారా.. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి కదా’ అన్నారు. దానికి రామానాయుడు ‘మీరు చేస్తానంటే.. మేం కూడా సిద్ధమే బ్రదర్’ అన్నారు. సాధారణంగా ఎన్టీఆర్ అందర్నీ బ్రదర్ అని సంభోదించడం మనకు తెలుసు. ఎన్టీఆర్‌ని ఎవరైనా బహువచనంతోనే పిలిచేవారు. కానీ, రామానాయుడు ఒక్కరే మొదటి నుంచీ ఎన్టీఆర్‌ని బ్రదర్ అని పిలిచేవారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ‘రాముడు భీముడు’ చిత్రంలోని ఓ పాటను నాగార్జున సాగర్‌లో తీసేందుకు యూనిట్ మొత్తం ప్రయాణానికి సిద్ధమయ్యారు. అప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణంలో ఉంది. అక్కడ ఎన్టీఆర్, ఎల్.విజయలక్ష్మీ, బృందంపై ‘దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్..’ అనే పాటను చిత్రీకరించారు.
ఎఎన్నార్ నటించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రాన్ని అక్కడ కొంత భాగం తీశారు. అక్కడి జనంతో పడలేక తిరిగి వచ్చేశారని రామానాయుడికి తెలిసింది. పాట అక్కడ తియ్యాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి అక్కడి పోలీసుల్ని కాంటాక్ట్ చేశారు రామానాయుడు. జనాన్ని కంట్రోల్ చెయ్యడం తమ వల్ల కాదని, తాము వేరే పనిమీద ఉన్నామని, రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చెయ్యమని చెప్పారు పోలీసులు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కు చెప్పారు రామానాయుడు. ‘మరేం ఫర్వాలేదు బ్రదర్. అన్నీ మనం చూసుకుందాం. పదండి’ అంటూ ధైర్యం చెప్పడంతో యూనిట్ అంతా అక్కడికి బయల్దేరింది.
నాగార్జునసాగర్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనను నిర్మాత రామానాయుడు ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ ‘ఉదయం షూటింగ్ మొదలు పెట్టే సమయానికి వేల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అంతా గందరగోళంగా ఉండడంతో షూటింగ్ చెయ్యడం కుదరదు అనుకున్నాను. అప్పుడు రామారావుగారు నన్ను, ఎల్.విజయలక్ష్మీని పిలిచారు. వరసగా నిలబడమన్నారు. జనం వైపు తిరిగి ముగ్గురూ చేతులు జోడించి నమస్కరిస్తూ అన్ని వైపులా కవర్ చేశాం. ‘అందరికీ నమస్కారం..మమ్మల్ని చూడాలని వచ్చారు. చూశారు. మీరు, మీ కుటుంబ సభ్యులు అంతా క్షేమమే కదా. మీరు వెనక్కి జరిగి మాకు సహకరిస్తే మా పని చేసుకుంటాం’ అని ఎంతో వినయంగా రామారావుగారు జనాన్ని ఉద్దేశించి అనగానే.. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. అక్కడికి వచ్చిన జనం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాకు సహకరించారు. అలా రెండు రోజులు పోలీసుల సాయం లేకుండా కేవలం రామారావుగారి మాట వల్ల ఆ పాటను పూర్తి చేయగలిగాం’ అంటూ వివరించారు డి.రామానాయుడు.