English | Telugu
చరణ్‌కి రెమ్యునరేషన్ ఇవ్వని నాగబాబు.. ఎప్పటికైనా ఇస్తానంటున్న మెగాబ్రదర్!
Updated : Jun 14, 2024
మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ అనే బేనర్‌ను స్థాపించి ‘రుద్రవీణ’ చిత్రంతో నిర్మాతగా పరిచయమైన విషయం తెలిసిందే. తన బేనర్‌లో నాగబాబు తీసిన అన్ని సినిమాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ బేనర్‌లో నాగబాబు చేసిన చివరి సినిమా 2010లో వచ్చిన ‘ఆరెంజ్’. ఈ సినిమాతో ఆయన అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చిత్ర నిర్మాణం జోలికి వెళ్ళలేదు. ‘ఆరెంజ్’ చిత్రానికి ముందు రామ్‌చరణ్ చేసిన సినిమా ‘మగధీర’. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి చరణ్‌ని ఒక రేంజ్ హీరోని చేసింది. అలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చరణ్ హీరోగా సినిమా నిర్మించే మంచి అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నాగబాబు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శ అప్పట్లో వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన నష్టం వల్ల తను ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు?, తనకి ధైర్యం చెప్పింది, తనని అలాంటి కష్టం నుంచి కాపాడిరది ఎవరు? అనే విషయాల గురించి పలు ఇంటర్వ్యూలలో వివరించారు నాగబాబు.
‘ఆరెంజ్ సినిమా తీసే సమయానికి నేను ఫైనాన్షియల్‌గా కంఫర్టబుల్ జోన్‌లోనే ఉన్నాను. ఆ సినిమా వల్ల నష్టం రావడానికి కారణం.. నేను నమ్మినవాళ్ళే నన్ను మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు. అంతకుముందు నేను చేసిన సినిమాల్లో కొంత నష్టం వచ్చేది. 10 లక్షలు, 20 లక్షలు అంటే పెద్ద అమౌంట్ కాదు. కానీ, ‘ఆరెంజ్’ విషయానికి వస్తే అది చెప్పడానికి వీల్లేనంత పెద్ద ఎమౌంట్. నాకు ఉన్న ఆస్తులన్నీ అమ్మినా సరే 10 పర్సెంట్ కూడా తీర్చలేను. పైన ఇంకా అప్పు చెయ్యాల్సిన పరిస్థితి. ఆ విషయం రేపు సినిమా రిలీజ్ అనగా ఈరోజు తెలిసింది. వాస్తవానికి అది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాదు. బిజినెస్‌పరంగా కూడా ఫెయిల్యూర్ కాదు. సినిమాకి ఓవర్ కాస్ట్ అయిపోవడం, దాన్ని నేను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అంత నష్టం కనిపించింది. దాంతో నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒక దశలో ఉండాలా, పోవాలా అనే నిర్ణయానికి కూడా వచ్చాను. అది ఎలాంటి కష్టం అంటే నా పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని కోరుకుంటాను.
అలాంటి సమయంలో నేను ఎవరిని సహాయం చెయ్యమని అడగాలి? ఒక కోటి, రెండు కోట్లు నష్టం వచ్చిందని అన్నయ్యని అడిగితే సర్దుతాడు. ఇది అలా కాదు కదా. చాలా పెద్ద ఎమౌంట్. సినిమా వల్ల నాకు నష్టం వచ్చిందన్న సంగతి అన్నయ్యకి తెలియడానికి నాలుగు రోజులు పట్టింది. అయితే అంతకుముందే సౌతాఫ్రికాలో ఉన్న పవన్‌కళ్యాణ్ ఫోన్ చేశాడు. ‘అన్నయ్యా.. ఇలా జరిగిందట కదా.. నువ్వు దాని గురించి వదిలేసి రిలాక్స్‌గా ఉండు. నేను చూసుకుంటాను’ అన్నాడు. తర్వాత రెండు రోజులకు అన్నయ్య పిలిచాడు. విషయం తెలుసుకొని ‘వదిలేసెయ్‌రా.. మర్చిపో’ అన్నాడు. వాళ్లిద్దరూ చెప్పిన మాట నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. అన్నదమ్ముల కంటే స్నేహితులే బెటర్ అని అందరూ అంటారు. నా ఉద్దేశం ప్రకారం అన్నదమ్ములు ఎప్పటికీ అన్నదమ్ములే. వాళ్ళు ఎలాంటి వారైనా నా అన్నయ్య, నా తమ్ముడు అని ఫీల్ అవుతారు. అలా మా అన్నయ్యని, తమ్ముడ్ని నేను బాగా ప్రేమిస్తాను. ఎవరూ భరించలేని ఒక భారీ కష్టం నుంచి నుంచి బయటికి తీసుకొచ్చారు.
ఈ సినిమాకి సంబంధించి నన్ను బాధించిన మరో విషయం ఏమిటంటే.. చరణ్‌కి పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేకపోయాను. 50 పర్సెంట్ మాత్రమే ఇచ్చాను. సినిమా రిలీజ్ తర్వాత మిగిలిన ఎమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అది ఇప్పటికీ నేను గిల్టీగా ఫీల్ అవుతాను. అయితే ఎప్పటికైనా చరణ్‌కి ఎమౌంట్ ఇవ్వగలనన్న నమ్మకం ఉంది. ఆ చేదు అనుభవం నుంచి బయటికి వచ్చిన తర్వాత నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టాను. అన్నయ్య, కళ్యాణ్‌బాబు నాకు ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. అంత వరకు ఓకే. తర్వాత నేను బ్రతకడం ఎలా? ఏం చెయ్యాలి?.. అన్నయ్య మీద, కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వకూడదు అనుకున్నాను. సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. టీవీ మీద ఫోకస్ పెట్టాను. కొన్ని సీరియల్స్‌లో నటించాను. ఆ తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ నన్ను నిలబెట్టింది. ఆరేడు సంవత్సరాల్లో నాకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే మా అన్నయ్య, కళ్యాణ్‌బాబే కారణం’ అంటూ వివరించారు నాగబాబు.