English | Telugu
హిందీ సినీ సీమను ఏలిన ఈ తెలుగమ్మాయిని గుర్తుపట్టారా?
Updated : Jun 17, 2021
ఏడో దశకం మొదట్లో సీనియర్ నటి పుష్పవల్లి (జెమినీ గణేశన్ భార్య) భానురేఖ అనే తన కూతుర్ని స్టిల్ ఫొటోగ్రాఫర్ ఆర్.ఎన్. నాగరాజారావు ఇంటికి తీసుకెళ్లారు ఫొటోలు తియ్యమని. అప్పట్లో భానురేఖ చాలా చిలిపిగా, పెంకిగా ఉండేది. అందుచేతనే పుష్పవల్లి ఆమెను నేరుగా నాగరాజారావు దగ్గరకు తీసుకురాకుండా, ఆటోలోనే కూర్చోబెట్టి, ముందుగా తను వెళ్లారు. "మా అమ్మాయి భానురేఖను సినిమాల్లో చేర్పించాలనుకుంటున్నాను. మీతోటే స్టిల్స్ తీయించాలని వచ్చాను" అన్నారు. ఆయన సరే అన్నారు.
ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆయన దగ్గరకు తీసుకువచ్చారు పుష్పవల్లి. రకరకాల భంగిమల్లో కలర్‌లోనూ, బ్లాక్ అండ్ వైట్‌లోనూ ఫొటోలు తీశారు నాగరాజారావు. కలర్‌లో తీసిన ఫొటోలు ఫేడ్ అయిపోవడంతో, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే పుష్పవల్లి చేతికిచ్చారు. ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఓరోజు పుష్పవల్లి మద్రాస్ మౌంట్ రోడ్‌లోని 'స్పెన్సర్స్'లో నాగరాజారావుకు కనిపించారు. ఆమె ఆయనను పలకరించి, "మీరు తీసిన ఫొటోలను తీసుకొని మేం బొంబాయి వెళ్లి అక్కడ నిర్మాతలకు, దర్శకులకు చూపించాం. అమ్మాయి పది హిందీ చిత్రాలలో బుక్ అయ్యింది." అని చెప్పారు.
అలాంటి ఆ భానురేఖ హిందీ చిత్రసీమలో 'రేఖ'గా మారి ఎన్నో చిత్రాల్లో ఇటు గ్లామరస్, అటు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ పోషించి, టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. మొదట ఆమె స్టిల్స్ తీసి, పుష్పవల్లి చేతికి ఇచ్చిన నాగరాజారావు తర్వాత రేఖ హీరోయిన్‌గా నటించిన 'జుదాయి' మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. అప్పుడు ఫొటోలు తీశాక రేఖను ఆయన కలుసుకుంది ఆ సినిమా షూటింగ్‌లోనే.
నిజానికి హిందీ చిత్రసీమను ఏలక ముందు తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా 'ఇంటిగుట్టు', 'రంగుల రాట్నం' చిత్రాల్లో నటించిన రేఖ, 'అమ్మ కోసం' (1970) చిత్రంలో ఓ నాయికగా నటించారు. రేఖ తల్లి పుష్పవల్లిది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెంటపాడు గ్రామం. అంటే రేఖ మన తెలుగమ్మాయే. మద్రాసులో పుట్టి పెరిగినా, బొంబాయి వెళ్లి అక్కడే స్థిరపడిపోయినా, తెలుగు చాలా చక్కగా మాట్లాడతారు. 66 ఏళ్ల వయసులోనూ ఎవర్‌గ్రీన్ బ్యూటీగా మన్ననలు అందుకుంటున్నారు.