English | Telugu
చిరంజీవి విషయంలో 30 ఏళ్లయినా నెరవేరని దాసరి కోరిక!
Updated : Jun 17, 2021
కారణాలేమైనా మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో ఒకే ఒక్క సినిమా వచ్చింది. అది.. 'లంకేశ్వరుడు' (1989). ఆ సినిమా దాసరికి వందో సినిమా కావడం ఒక విశేషం. చిరంజీవి అంటే దాసరికి ప్రత్యేకాభిమానం. పలు సందర్భాల్లో ఆ అభిమానాన్ని ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు. చిరంజీవిని ఆయన ఏకవచనంతోనే సంబోధించేవారు. చిరంజీవి జాతీయ ఉత్తమనటుడి అవార్డు అందుకుంటే చూడాలని ఆయన కోరుకున్నారు. అవును. 1991లో జ్యోతిచిత్ర సినీ వారపత్రిక కోసం చిరంజీవిని దాసరి ఇంటర్వ్యూ చేశారు. అంటే దాసరి ప్రశ్నలు అడుగుతుంటే చిరంజీవి సమాధానాలు చెప్పారన్న మాట.
ఆ ఇంటర్వ్యూలో దాసరి, "అతి తక్కువ కాలంలో తెలుగు చలనచిత్ర రంగంలో ఏ కథానాయకుడూ పొందనంత స్టార్‌డమ్ పొందావు. కానీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా గుర్తింపును పొందడానికి ప్రయత్నిస్తున్నావా? నువ్వు జాతీయ నటుని అవార్డును తీసుకుంటే చూడాలని ఉంది. నా కోరిక నెరవేరుతుందా?" అని అడిగారు.
దానికి చిరంజీవి, "మీరు ఏమైనా అనుకోండి. అవార్డులు పొందాలి, అవార్డులు సంపాదించుకోవాలి అనే తపన నాలో చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఆ ధ్యాసే నాలో ఉండదు. దానంతట అదిగా అవార్డు వస్తే నిజంగా అది ఆనందంగానూ, గర్వంగాను ఉంటుందన్నమాట వాస్తవం. అయితే అవార్డులకంటూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ప్రత్యేకమైన సినిమాల్లో నటించాలనే ఆలోచన నాకు లేదు. కారణం, అవార్డు కంటే ఎంతో విలువైన ప్రజాభిమానాన్ని ఇంతకు అంత సంపాదించాలని, దానిని ఎలా నిలబెట్టుకోవాలి.. అని మాత్రం ఎల్లవేళలా ఆలోచిస్తూ, దానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను జాతీయ అవార్డు తీసుకోవాలని మీలాంటి పెద్దలు అంత బలమైన కోరికతో ఉన్నందుకు ఏదో ఒకనాటికి, అది ఆశీస్సులై నెరవేరుతుందేమో." అని సమాధానమిచ్చారు.
ఇది జరిగి 30 ఏళ్లవుతోంది. కానీ ఇంతదాకా దాసరి కోరిక నెరవేరలేదు. ఆ ఇంటర్వ్యూ చేసే నాటికే 'ఆరాధన', 'స్వయంకృషి', 'రుద్రవీణ' లాంటి అభినయానికి మంచి స్కోప్ ఉన్న సినిమాలు చేసి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత ఆయన ఆ తరహా పాత్ర చేసింది 'ఆపద్బాంధవుడు' (1992) చిత్రంలోనే. అయినా ఆయనకు జాతీయ అవార్డు దక్కలేదు. 2019లో తొలి స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరిగా పరిగణన పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను ఉన్నత స్థాయిలో పోషించినా జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఆయనను గుర్తించలేదు.
నిజానికి 1967 నుంచి ఉత్తమ నటుడి అవార్డులు ఇస్తుండగా, ఇంతదాకా ఏ ఒక్క తెలుగు సినిమాకూ ఆ అవార్డు రాకపోవడం శోచనీయం. దక్షిణాది మిగతా మూడు ప్రధాన భాషా చిత్ర నటులూ ఆ అవార్డును సగర్వంగా తమ రాష్ట్రాలకు అందించగా, తెలుగు నటులు ఇప్పటికీ వాటికి నోచుకోలేదు. అంటే, జాతీయ అవార్డును అందుకొనే స్థాయిలో మన రచయితలు, దర్శకులు కథానాయకుల పాత్రలను తెరపై ఆవిష్కరించలేకపోయారు. లేదూ.. ఆ స్థాయిలో మననటులు అభినయాన్ని ప్రదర్శించలేకపోయారు. ధనుష్ లాంటి యంగ్ యాక్టర్ సైతం తమిళనాడుకు రెండు జాతీయ ఉత్తమనటుడి అవార్డులు అందించగలిగాడు. తన కెరీర్‌లో చిరంజీవి ఆ అవార్డును సాధించగలరా? దాసరి కోరికను ఆయన మరణానంతరమైనా నెరవేర్చగలరా?