English | Telugu
జంధ్యాల 'నాలుగు స్తంభాలాట' పాటల రికార్డింగ్ ఎలా జరిగిందంటే...
Updated : Jun 16, 2021
సమయం ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. మద్రాస్ జెమినీ స్టూడియోలో పూజకు తగిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ బట్టల్లో మెరిసిపోతుండే నిర్మాత నవతా కృష్ణంరాజు ఆహ్వానితులందర్నీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇద్దరు పురోహితులు పాతిక కొబ్బరికాయల్ని కొట్టి, మంత్ర పారాయణం మొదలెట్టారు. అయప్పమాల ధరించిన దర్శకుడు జంధ్యాల చేతులు జోడించి పూజ దగ్గర నిల్చొని ఉన్నారు. అప్పటికే 'ముద్ద మందారం' చిత్రంతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసినందుకు కాబోలు ఆయన ముఖం కళకళలాడుతోంది.
హార్మొనీ పెట్టె ముందేసుకొని సంగీత దర్శకుడు రాజన్ (రాజన్-నాగేంద్ర) "సా.. పా.. సా.." అంటూ ట్యూన్ కట్టడంలో నిమగ్నమయ్యారు. "త్యాగరాజ పూజ్యాం కరిష్యే" అంటూ కర్పూరాన్ని వెలిగించి, గంట గణగణలాడించాడు పూజారి. రికార్డింగ్ పూజ ముగిసేలోగా గాయని సుశీల కూడా వచ్చారు. మల్లెమాల సుందరరామిరెడ్డి పూజకు వచ్చి, అది పూర్తికాగానే నిర్మాతకు బెస్ట్ విషెస్ చెప్పి, అర్జంటు పనులున్నాయంటూ హడావిడిగా వెళ్లిపోయారు.
రాజన్-నాగేంద్ర పదిహేనుమంది మ్యుజీషియన్స్‌తో స్వరరచనకు పూనుకున్నారు. సమయం గడిచింది. చక్కటి రాగం ఉదయించింది. వేటూరి అమృత లేఖిని నుంచి అమృతం వొలికింది. రిహార్సల్ పూర్తయింది. రికార్డింగ్‌కు అందరూ సిద్ధమయ్యారు. పి. సుశీల తన కమ్మటి కంఠాన్ని విప్పారు.
"దొరలనీకు కనుల నీరు.. దొరలదీ లోకం మగదొరలదీ లోకం.. కనులలోనే దాచుకోవే కడలిలా శోకం కన్నెపడుచులా శోకం.." అంటూ సుశీల పాడుతుంటే.. ఆ జోలపాటకు మగతగా కళ్లుమూతలు పడుతున్నట్లే అనిపించింది అక్కడివాళ్లకు. (తర్వాత ఈ పాటను హీరోలు నరేశ్, ప్రదీప్, హీరోయిన్లు పూర్ణిమ, తులసి తదితరులపై చిత్రీకరించారు.) మూడు రోజుల్లో (1981 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో) 'నాలుగు స్తంభాలాట' చిత్రంలోని పాటలన్నింటినీ రికార్డు చేశారు.
మొదట హీరోలుగా ప్రదీప్, సురేశ్‌లను అనుకున్నారు. తర్వాత సురేశ్ ప్లేస్‌లో విజయనిర్మల కుమారుడు నరేశ్‌ను హీరోగా పరిచయం చేశారు. 1982 మే 15న విడుదలైన 'నాలుగు స్తంభాలాట' చిత్రం అటు ప్రేక్షకాదరణనూ, ఇటు విమర్శకుల ప్రశంసలనూ పొందింది. తొలి చిత్రంతోటే నరేశ్ ఆకట్టుకున్నాడు.