English | Telugu
12 ఏళ్ళ క్రితం నాగార్జున రిజెక్ట్ చేసిన రాఘవేంద్రరావు సినిమా.. అది ఇప్పటికీ రిలీజ్ కాలేదు!
Updated : Aug 5, 2024
కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. ఆఖరి పోరాటం, జానకి రాముడు, ఘరానాబుల్లోడు వంటి కమర్షియల్ హిట్స్ వీరి ఖాతాలో ఉన్నాయి. ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా వారి కాంబినేషన్‌లో భక్తిరసాత్మక చిత్రం ‘అన్నమయ్య’ రాబోతోందనే ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. కమర్షియల్ సినిమాలు చేసే రాఘవేంద్రరావు ఇలాంటి భక్తి చిత్రం చెయ్యడం ఏమిటి? అందులోనూ నాగార్జున అన్నమయ్య ఏమిటి? అంటూ అందరూ విమర్శలు గుప్పించారు. అవేవీ పట్టించుకోకుండా సిన్సియర్‌గా అన్నమయ్య చిత్రాన్ని తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఎవరూ ఊహించని విధంగానే సినిమా సంచలన విజయం సాధించింది. నాగార్జున, రాఘవేంద్రరావులపై ప్రశంసల వర్షం కురిసింది. విమర్శించిన వారు సైతం అభినందించారు. జాతీయ అవార్డులు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు కొల్లగొట్టింది అన్నమయ్య. దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లోనే రూపొందిన ‘శ్రీరామదాసు’ కూడా ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. అంతేకాదు, నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకుంది.
‘శ్రీరామదాసు’ విడుదలైన ఆరు సంవత్సరాల తర్వాత మరో భక్తి సినిమా చెయ్యాలనుకున్నారు రాఘవేంద్రరావు. ఇదే విషయాన్ని నాగార్జునకు చెబుతూ ‘ఇంటింటా అన్నమయ్య’ పేరుతో ఓ సోషియో ఫాంటసీ సినిమా చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ ప్రతిపాదన నాగార్జునకు నచ్చలేదు. కానీ, ఆ విషయాన్ని పైకి చెప్పలేదు. విని ఊరుకున్నారు. నాగార్జున ఉద్దేశంలో ‘అన్నమయ్య’లాంటి క్లాసిక్‌ను క్యాష్ చేసుకోవడానికి అదే పేరుతో మరో సినిమా చెయ్యడం కరెక్ట్ కాదు. ఆ పేరుతోనే మళ్ళీ సినిమా చేస్తున్నామంటే దాన్ని మించి ఏదో ఉండాలి. ప్రేక్షకులు కూడా ఆ ఊహతోనే థియేటర్‌కి వస్తారు. వారి అంచనాలను అందుకోలేకపోతే అందరం అభాసుపాలవుతాం అనుకున్నారు. రాఘవేంద్రరావు చెప్పిన దాన్ని ఔనని, కాదని అనుకుండా.. ‘మీరు సాయిబాబా భక్తులు కదా.. అలాంటి కథ చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి’ అన్నారు నాగార్జున. ఈ చర్చ జరిగిన కొన్ని రోజుల వరకు మళ్ళీ వారిద్దరి మధ్య ఆ టాపిక్ రాలేదు.
ప్రతి ఆదివారం నాగార్జున ఇంట్లో పార్టీ ఉంటుంది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అంతా సరదాగా ఆరోజు కలుస్తారు. అలా ఓ ఆదివారం పార్టీ జరుగుతున్న టైమ్‌లో సడన్‌గా నాగార్జునకు షిరిడీ వెళ్ళాలనిపించింది. అనుకున్నదే తడవుగా మరుసటిరోజు తన స్నేహితుడు మహేష్‌రెడ్డిని కలిసి షిరిడీ వెళ్లేందుకు రెడీ అయిపోయారు. రాఘవేంద్రరావుకు ఈ విషయం చెప్పకుండానే సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ వచ్చేశారు నాగార్జున. అదేరోజు నాగార్జునను కలిసేందుకు రాఘవేంద్రరావు వచ్చారు. ‘మీరు చెప్పినట్టుగానే మనం షిరిడీ సాయి కథతో సినిమా చేస్తున్నాం. ఈసారి మీరు భక్తుడిగా కాదు, బాబాగా నటిస్తారు’ అని చెప్పడంతో నాగార్జున ఆశ్చర్యపోయారు. తాను అనుకోకుండా షిరిడీ వెళ్ళి రావడం, వచ్చిన వెంటనే ఈ సినిమా ఓకే అవ్వడం విచిత్రంగా అనిపించింది. పైగా ఈ సినిమాకి తన స్నేహితుడు మహేష్‌రెడ్డి నిర్మాత. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో చేసిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ చిత్రాల్లో భక్తుడిగా నటించిన నాగార్జున ‘శిరిడిసాయి’ చిత్రంలో సాయిబాబాగా నటించి మెప్పించారు.
ఇదిలా ఉంటే.. రాఘవేంద్రరావు మొదట ప్రతిపాదించిన ‘ఇంటింటా అన్నమయ్య’ చిత్రాన్ని ‘శ్రీరామరాజ్యం’ చిత్రాన్ని నిర్మించిన యలమంచిలి సాయిబాబు నిర్మించారు. 2012లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో నటించిన నందమూరి బాలకృష్ణ, నయనతార హాజరయ్యారు. నిర్మాత యలమంచిలి సాయిబాబు తనయుడు రేవంత్ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ‘శిరిడిసాయి’ తర్వాత రాఘవేంద్రరావు రూపొందించిన సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఏర్పడలేదు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రిలీజ్ చేసేందుకు నిర్మాత ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రిలీజ్‌ను వాయిదాలు వేస్తూ వచ్చారు. విశేషమేమింటే.. ఫస్ట్ కాపీ రెడీ అయి దాదాపు 10 సంవత్సరాలు దాటిపోతున్నా ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్‌కి నోచుకోలేదు.