English | Telugu

కృష్ణారెడ్డి చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న రమ్యకృష్ణ.. అసలేం జరిగింది?

ఎస్‌.వి.కృష్ణారెడ్డి అంటే కేరాఫ్‌ ఫ్యామిలీ మూవీస్‌ అనే పేరు ఉంది. తొలి సినిమా కొబ్బరిబొండాం నుంచి ఆర్గానిమ్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు వరకు అతను చేసిన సినిమాలన్నీ ఆరోగ్యకరమైనవే. తన సినిమాల్లో అశ్లీల దృశ్యాలుగానీ, అసభ్యకరమైన డైలాగులు గానీ లేకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. కృష్ణారెడ్డి సినిమా అంటే ధైర్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చూసేవిగా ఉండేవి. ఇదే పద్ధతిలో ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు తీసి దర్శకుడిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు చాలా వున్నాయి. దర్శకుడిగానే కాదు, రచయితగా, సంగీత దర్శకుడిగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లోని పాటలు కూడా అశ్లీల పదాలు లేకుండా అందరూ పాడుకునేలా ఉండేవి. 

కృష్ణారెడ్డి తన సినిమాల్లోని హీరోయిన్ల పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉండేలా చూసుకునేవారు. అలాంటి కథలతోనే సినిమాలు చేసి సక్సెస్‌ అయ్యారు. ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే పదం తరచూ వినిపిస్తోంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ లైంగిక వేధింపులకు గురి చేశారని కొందరు నటీమణులు ఆరోపించారు. ఈ విషయం గురించి ఎస్‌.వి.కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని వివరించారు. 

‘కొందరు అమ్మాయిలు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురవుతున్నారనే మాట  చాలా కాలంగా వింటున్నాం. అయితే వాటి గురించి నాకు తెలీదు. అలాంటి విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచించను. ఎందుకంటే మొదటి నుంచీ మహిళలను గౌరవంగా చూడడం మాత్రమే నాకు తెలుసు. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఏ నటీమణితోనూ హద్దులు దాటి ప్రవర్తించలేదు. నా సినిమాల్లో మహిళలను ఎంత గౌరవంగా చూపిస్తానో.. నిజజీవితంలో కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తాను. ఉదాహరణగా చెప్పాలంటే.. శ్రీకాంత్‌, రమ్యకృష్ణలతో నేను చేసిన ‘ఆహ్వానం’ ఎంత పెద్ద విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. ఆ సినిమా షూటింగ్‌ చివరి రోజున రమ్యకృష్ణ వెళ్లిపోతున్నప్పుడు.. వెండి పళ్లెంలో పట్టుబట్టలు, పదివేల రూపాయలు పెట్టి, ఆమెకు బొట్టు పెట్టి పంపించాము. ఆ సమయంలో ఆమె ఎంతో ఎమోషనల్‌ అయిపోయారు. ఒక్కసారిగా ఏడ్చేశారు. దాంతో యూనిట్‌లోని మేమంతా ఎమోషనల్‌ అయ్యాము. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా వరకు నేను నటీమణులను అంత గౌరవంగా చూసుకుంటాను’ అన్నారు ఎస్‌.వి.కృష్ణారెడ్డి.