English | Telugu

యావత్‌ భారతదేశంలోనే ఎవ్వరికీ దక్కని గౌరవం డాక్టర్‌ భానుమతి సొంతం!

సినిమా రంగంలో అప్పటికీ, ఇప్పటికీ ఫైర్‌ బ్రాండ్‌ ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు భానుమతి. చలన చిత్ర పరిశ్రమలో మహామహుల్నే గడగడలాడిరచిన ధీశాలి భానుమతి (Bhanumathi). ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి మహానటులు సైతం ఆమెతో కలిసి నటించడానికి భయపడేవారు. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం భానుమతి నైజం. ఈ తరహా మనస్తత్వంతో సినిమా రంగంలో రాణించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ, దాన్ని కూడా అధిగమించి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న వ్యక్తి భానుమతి. సినిమా రంగంలో బహుముఖ ప్రజ్ఞతో అందర్నీ ఆకట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు.  నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, స్టూడియో ఓనర్‌గా.. ఇలా అన్ని శాఖల్లోనూ ప్రావీణ్యం సంపాదించిన భానుమతి జయంతి సెప్టెంబర్‌ 7. ఈ సందర్భంగా సినిమా రంగంలో అడుగు పెట్టిన రోజు నుంచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకునే వరకు సాగిన ఆమె సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

1925 సెప్టెంబర్‌ 7న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించారు భానుమతి. తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య సంగీత కళాకారుడు. తండ్రి వద్దే సంగీతాన్ని అభ్యసించారు భానుమతి. 1930వ దశకంలో నాటకాల్లో, సినిమాల్లో నటించే మహిళలను ఎంతో చులకనగా చూసేవారు. 14 ఏళ్ళ వయసులోనే భానుమతికి వరవిక్రయం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమాల్లోకి కూతుర్ని పంపాలా, వద్దా అని బాగా ఆలోచించారు వెంకట సుబ్బయ్య. చివరికి కొన్ని కండిషన్స్‌ పెట్టడం ద్వారా భానుమతి ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. అవేమిటంటే.. భానుమతిని మగవారెవరూ తాక కూడదు, కౌగిలింతలు కూడా ఉండకూడదు. కనీసం చెయ్యిని కూడా ముట్టుకోకూడదు. ఈ కండిషన్స్‌తోనే చాలా సినిమాలు చేశారు భానుమతి. 

1943లో వచ్చిన కృష్ణప్రేమ చిత్రం భానుమతి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న పి.ఎస్‌.రామకృష్ణారావును ప్రేమించారు. పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్లి తర్వాత విడుదలైన మొదటి సినిమా స్వర్గసీమ. ఈ సినిమా తర్వాత భానుమతికి లెక్కకు మించిన ఆఫర్లు వచ్చాయి. కానీ, అన్ని సినిమాలూ అంగీకరించేవారు కాదు. తన మనసుకు దగ్గరగా ఉన్న కథలతో వచ్చిన సినిమాలనే ఒప్పుకునేవారు. ఆ తర్వాత తమ కుమారుడు భరణి పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. మొదటి సినిమాగా రత్నమాల నిర్మించారు. భరణి పిక్చర్స్‌ బేనర్‌పై తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను నిర్మించారు. తన 28వ ఏట భరణి స్టూడియోస్‌ను స్థాపించి తొలి చిత్రంగా చండీరాణి చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు భానుమతి. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ హీరోగా నటించారు. ఈ సినిమా మొదలుకొని దాదాపు 16 సినిమాలను డైరెక్ట్‌ చేశారు భానుమతి. భరణి పిక్చర్స్‌ సంస్థలో అక్కినేని నాగేశ్వరరావు ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆ సంస్థను తన మాతృ సంస్థగా భావించేవారు. తమ సంస్థలో నిర్మించిన సినిమాల్లో కొన్నింటిని భానుమతి డైరెక్ట్‌ చేస్తే, మరికొన్ని సినిమాలను రామకృష్ణారావు డైరెక్ట్‌ చేశారు. 

ఇక గాయనిగా భానుమతిది ఓ విభిన్నమైన శైలి. అప్పటివరకు అలాంటి స్వరం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. అలాగే సంగీత దర్శకురాలిగా కూడా కొన్ని సినిమాలు చేసి సంగీతంలో తనకు ఉన్న అభిరుచిని చాటుకున్నారు. తన 19వ ఏటనే రచయిత్రిగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు భానుమతి. ఆమె రచించిన అత్తగారి కథలు రచనకు కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును పొందారు. ఈ విజయాలన్నీ ఒక ఎత్తయితే.. స్వతహాగా ఆమెకు కుటుంబం అన్నా, సంసార జీవితం అన్నా ఎంతో మక్కువ. పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో జీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్నది ఆమె చిన్ననాటి కోరిక. కానీ, అనూహ్యంగా చిత్ర రంగ ప్రవేశం చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు భానుమతి. 

స్వతంత్రమైన భావాలు కలిగిన భానుమతి ఎవరినీ లెక్క చేసేవారు కాదు. తన మనస్తత్వానికి భిన్నంగా ప్రవర్తించేవారిని అస్సలు ఉపేక్షించేవారు కాదు. దీనికి ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొందరు తమిళ దర్శకులు హీరోయిన్లను చులకనగా చూసేవారు. వారితో అవమానకరంగా మాట్లాడేవారు. ఒక సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో దర్శకుడు ఆమెను ఉద్దేశించి ‘భానుమతీ.. ఇలా రావే’ అన్నారు. దాంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చి ఆయన దగ్గరకి వెళ్లి ‘ఏంట్రా పిలిచావు’ అన్నారు. దాంతో ఆ దర్శకుడితోపాటు సెట్‌లో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. ఇక అప్పటి నుంచి ఆ డైరెక్టర్‌ ఏ హీరోయిన్‌తోనూ అలా మాట్లాడలేదు. అందుకే ఆమెకు ఫైర్‌బ్రాండ్‌ అనే పేరు వచ్చింది. హీరోలైనా, దర్శకులైనా ఏ హీరోయిన్‌ దగ్గర ఎలా ఉన్నా భానుమతి దగ్గర మాత్రం అణకువగా నడుచుకునేవారు. 

తన భిన్నమైన మనస్తత్వంతోనే కొన్ని అద్భుతమైన అవకాశాలను కూడా చేజార్చుకున్నారు భానుమతి. తెలుగు సినిమాల్లో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే మిస్సమ్మ చిత్రంలో మొదట భానుమతినే హీరోయిన్‌గా అనుకున్నారు. ఆ సినిమాకి సంబంధించి నాలుగు రీల్స్‌ చిత్రీకరణ కూడా జరిగింది. ఆ తర్వాత ఆమెకు, నిర్మాత చక్రపాణికి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నారు భానుమతి. అప్పుడా అవకాశం సావిత్రిని వరించింది. ఆ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే ఆ సినిమాలో అవకాశం పోగొట్టుకున్నందుకు ఆమె ఏమాత్రం బాధపడలేదు. పైగా తను తప్పుకోవడం వల్ల సావిత్రి వంటి గొప్ప నటి వెలుగులోకి వచ్చింది అని సంతృప్తి చెందారు. అలాగే చెంచులక్ష్మీ చిత్రంలో కూడా మొదట భానుమతినే హీరోయిన్‌గా తీసుకున్నారు. అక్కడ కూడా దర్శకనిర్మాతలతో పేచీ రావడంతో తప్పుకున్నారు. అప్పుడు ఆ సినిమా కోసం అంజలీదేవిని తీసుకున్నారు. 

భానుమతి హీరోయిన్‌గా నటించిన చివరి చిత్రం గృహలక్ష్మీ. ఈ సినిమా తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించలేదు. మట్టిలో మాణిక్యం చిత్రంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన నటనతో అలరించారు. వదిన, తల్లి, అమ్మమ్మ, బామ్మ.. ఇలా ఎన్నో పాత్రల్లో ఆమె ఒదిగిపోయారు. తాతమ్మకల, గడసరి అత్త సొగసరి కోడలు, మంగమ్మగారి మనవడు, అత్తగారూ స్వాగతం, బామ్మమాట బంగారు బాట, పెద్దరికం చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు భానుమతి. సినిమా రంగంలో ఆమె అద్వితీయ ప్రతిభకు వరించిన అవార్డులకు లెక్కే లేదు. మూడు సార్లు జాతీయ అవార్డు, అత్తగారి కథలు అనే హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ అవార్డు, కలైమామణి అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాలు అందించిన డాక్టరేట్లు భానుమతిని వరించాయి. ఆమె నటించిన చివరి చిత్రం 1998లో వచ్చిన పెళ్లికానుక. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. 80 ఏళ్ళ వయసులో 2005 డిసెంబర్‌ 24న చెన్నయ్‌లో తుదిశ్వాస విడిచారు డాక్టర్‌ భానుమతి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, స్టూడియో ఓనర్‌గా.. ఇలా ఇన్ని విభిన్నమైన శాఖల్లో ప్రజ్ఞ చూపించిన నటి యావత్‌ భారతదేశంలోనే లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్‌ భానుమతి జయంతి సెప్టెంబర్‌ 7. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది తెలుగువన్‌.