English | Telugu

కరుణానిధి కామెంట్‌తో.. జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చేసిన ఎం.జి.ఆర్‌.!

కరుణానిధి కామెంట్‌తో.. జాతీయ అవార్డును వెనక్కి ఇచ్చేసిన ఎం.జి.ఆర్‌.!

కళాకారులకు అభినందనలు, పురస్కారాలే కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మరిన్ని మంచి పాత్రలు చేసేందుకు ఊపిరిని పోస్తాయి. ముఖ్యంగా సినిమా రంగంలోని నటీనటులు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. అందులోనూ జాతీయ అవార్డు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి జాతీయ అవార్డు గురించి కరుణానిధి కామెంట్‌ చేశారన్న కారణంతో తనకు వచ్చిన అవార్డును వెనక్కి ఇచ్చేశారు లెజండరీ హీరో ఎం.జి.రామచంద్రన్‌. పైగా ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడుగా రికార్డు సృష్టించారు ఎం.జి.ఆర్‌. అంతటి అరుదైన అవార్డును వెనక్కి ఇచ్చేయడానికి కారణం ఏమిటి? ఎంజిఆర్‌కి జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన ఆ సినిమా విశేషాల గురించి తెలుసుకుందాం.

1971లో మక్కల్‌ తిలగం ఎం.జి.రామచంద్రన్‌ హీరోగా ఎం.కృష్ణన్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘రిక్షా కారన్‌’. రిక్షా కార్మికుడు ప్రధాన పాత్రలో వచ్చిన తొలి సినిమా ఇదే. పూర్తి మాస్‌ అంశాలతో రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించి 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. దీన్ని పురస్కరించుకొని తమిళనాడులోని 6,000 మంది రిక్షా కార్మికులకు రెయిన్‌ కోట్లు పంచారు ఎం.జి.ఆర్‌. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్‌. నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. చిత్ర యూనిట్‌  ఈ ఆనందంలో ఉండగా కరుణానిధి ఆ అవార్డుపై చేసిన కామెంట్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎంజిఆర్‌కి ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు తనవల్లే వచ్చిందని కరుణానిధి కామెంట్‌ చేయడంతో ఆ అవార్డును వెనక్కి ఇచ్చేశారు ఎంజిఆర్‌. 

ఎన్నో వైవిధ్యమైన జానపద చిత్రాలు రూపొందించి జానపద బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బి.విఠలాచార్య ‘రిక్షాకారన్‌’ చిత్రాన్ని ‘రిక్షారాముడు’ పేరుతో తెలుగులోకి డబ్‌ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధించింది. విఠలాచార్య కెరీర్‌లో చేసిన ఏకైక డబ్బింగ్‌ సినిమా ఇదే. 1972లో ఈ సినిమా విడుదలైంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత ‘రిక్షాకారన్‌’ స్ఫూర్తితో సూపర్‌స్టార్‌ కృష్ణ ‘రిక్షావాలా’ చిత్రం చేశారు. జి.సూర్యనారాయణరాజు నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహించారు. 1989 శాసనసభ ఎన్నికల ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు కృష్ణ. అయితే అదే ఏడాది ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తుండడంతో ‘రిక్షావాలా’ రిలీజ్‌ని వాయిదా వేశారు కృష్ణ. ఈ ఎన్నికల్లో కృష్ణ ఎం.పి.గా విజయం సాధించారు. డిసెంబర్‌ 15న ‘రిక్షావాలా’ విడుదలైంది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ వ్యంగ్య చిత్రాలు చాలా విడుదలయ్యాయి. కృష్ణ సారధ్యంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో ‘రిక్షావాలా’ కూడా ఒకటి. ఈ సినిమాలోని పొలిటికల్‌ సెటైర్స్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి. సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.