English | Telugu
మొదటి సినిమాకే విశ్వనాథ్‌ని ఇబ్బంది పెట్టిన అక్కినేని!
Updated : Jun 22, 2024
సినిమా రంగంలో ఉన్నవారికి సెంటిమెంట్స్, దైవభక్తి మెండుగా ఉంటాయి. కొన్ని విషయాల్లో సెంటిమెంట్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని వారు నమ్ముతారు. అలాగే తాము ఈ రంగంలో విజయం సాధించాలంటే దైవానుగ్రహం కూడా ముఖ్యమని వారి అభిప్రాయం. అందుకే ఏ సినిమానైనా శాస్త్రబద్ధంగా జరిగే పూజా కార్యక్రమాలతోనే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ముహూర్తపు షాట్‌ని కొందరు దేవుని పటాలపై చిత్రీకరించడం ద్వారా సినిమాను ప్రారంభిస్తారు. ఒక సినిమాకి సంబంధించి ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చు. కళాతపస్వి కె.విశ్వనాథ్ తొలి సినిమా ప్రారంభోత్సవంలో దీనికి సంబంధించి కొంత ఇబ్బంది పడ్డారు. అదెలాగంటే..
వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు కె.విశ్వనాథ్. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో చేరి కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాతాళభైరవి’ చిత్రానికి సౌండ్ అసిస్టెంట్‌గానూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు వంటి మేటి దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో చాలా సినిమాలకు పనిచేశారు. ఆ సమయంలోనే కె.విశ్వనాథ్‌లోని ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు డైరెక్టర్‌గా అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ‘ఆత్మగౌరవం’ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను విశ్వనాథ్‌కు అప్పగించారు. యద్దనపూడి సులోచనారాణి, గొల్లపూడి మారుతీరావు ఈ సినిమాకు కథను అందించగా, భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి గొల్లపూడి మారుతీరావు మాటలు రాశారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు స్క్రీన్‌ప్లే అందించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బేనర్‌పై ఈ సినిమా ప్రారంభమైంది.
ఆరోజు షూటింగ్ ప్రారంభోత్సవం. సాధారణంగా పూజతో ప్రతి సినిమాను ప్రారంభిస్తారు. అది అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ. అక్కినేని నాగేశ్వరరావు సొంత నిర్మాణ సంస్థ. ఆయనకుగానీ, నిర్మాతగా వ్యవహరిస్తున్న దుక్కిపాటి మధుసూదనరావుగానీ దైవభక్తి అనేది లేదు. కానీ, విశ్వనాథ్ ఆస్తికుడు. దైవభక్తి మెండుగా ఉంది. తన తొలి సినిమా తొలిషాట్‌ను దేవుని పటాలపై చిత్రీకరించాలనేది ఆయన కోరిక. కానీ, అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడంతో ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితుల్లో విశ్వనాథ్‌కి ఒక ఆలోచన వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు అద్దం ముందు నిలబడి దుస్తులు సరిచేసుకుంటున్న సీన్‌ను తొలిషాట్‌గా చిత్రీకరించాలి. ‘అద్దం.. శ్రీమహాలక్ష్మి ప్రతిరూపం’ అని పెద్దలు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకున్న విశ్వనాథ్.. అక్కినేని టై సరిచేసుకుంటుండగా ‘శ్రీనివాస చక్రవర్తిగారూ..’ అని అల్లు రామలింగయ్య పిలుస్తారు. అలా ఆయన చేత ఏడుకొండలవాడి పేరును చెప్పించారు. అప్పుడు అక్కినేని ‘నా పేరు శ్రీనివాసరావేనండీ గుమస్తాగారు’ అంటారు. దానికి అల్లు రామలింగయ్య ‘అయ్యా తమరి పేరు సాక్షాత్తూ ఆ శ్రీనివాసుడిది. భక్తులు సహస్ర నామాలతో స్తోత్రం చేస్తూ ఉంటారు. తమరు పలుకుతూ ఉండాలి’ అంటారు. అలా దేవుడి పేరు చెప్పించడం ద్వారా తన కెరీర్‌కు శుభారంభం పలికారు కళాతపస్వి కె.విశ్వనాథ్.