English | Telugu
కృష్ణ సినిమాను అడ్డుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అప్పుడు కృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
Updated : Jun 21, 2024
ఒకప్పుడు హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతూ ఉండేది. తమ అభిమాన హీరో సినిమా రిలీజవుతోందంటే దాన్ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకునేవారు అభిమానులు. పెద్ద హీరోల ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరిగేవి. అలా సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘కంచుకాగడా’ సినిమా రిలీజ్‌ను ఎన్.టి.రామారావు ఫ్యాన్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఏం జరిగింది.. కృష్ణ అభిమానులు వారిని ఎలా ఎదుర్కొన్నారు? అనే విషయాలు తెలుసుకుందాం.
నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు సూపర్‌స్టార్ కృష్ణకు వీరాభిమాని. తన అభిమాన నటుడితో ఓ భారీ బడ్జెట్ సినిమా తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ‘నేటి సమాజం ఇలా ఉంటే.. ఎలా ఉంటుంది’ అనే విచిత్రమైన ఆలోచన నందిగం మనసులో ఉండేది. దాన్నే సినిమాగా రూపొందించేందుకు ముందుకొచ్చారు. మహారథి, సత్యానంద్, సత్యమూర్తి కలిసి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ప్లాన్ చేశారు నిర్మాత. అప్పట్లో ‘కంచుకాగడా’ హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా పేరు తెచ్చుకుంది. భారీ తారాగణం, భారీ సెట్స్, భారీ సాంకేతిక విలువలు.. ఇలా సినిమాకు ఒక భారీలుక్ తీసుకు రావడంలో నిర్మాత కృషి ఎంతో ఉంది.
ఈ సినిమాలో కృష్ణ సరసన శ్రీదేవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘మహా సంగ్రామం’ షూటింగ్ జరుగుతోంది. ఈ రెండు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాతలిద్దరూ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. ఈ రెండు సినిమాలకూ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కావడం విశేషం. ‘కంచుకాగడా’ చిత్రాన్ని తన అభిరుచి మేరకు ఎంతో భారీగా నిర్మించారు నిర్మాత రామలింగేశ్వరరావు.
‘కంచు కాగడా’ కంటే ముందు ‘దొంగలు బాబోయ్ దొంగలు’ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత డూండీ. ఆ సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు కృష్ణ. దాంతో ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఊగిపోయాయి. కృష్ణ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రకటించారు. ఆ గొడవల మధ్య తన సినిమాను విడుదల చేసేందుకు భయపడ్డారు నిర్మాత డూండీ. కానీ, ‘కంచుకాగడా’ నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు మాత్రం భయపడలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమా రిలీజ్ కావాల్సిందేనన్న పట్టుదలతో అనుకున్న టైమ్‌కి రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ సినిమా రిలీజ్ అవ్వకుండా థియేటర్లకు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న కృష్ణ అభిమానులు అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన ఎన్టీఆర్ అభిమానులు వెనక్కి తగ్గారు. చిన్న చిన్న వాగ్వాదాలు తప్ప ‘కంచుకాగడా’ చిత్రం విడుదలకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ సినిమా విడుదలైన థియేటర్ల దగ్గర పోలీసులు 144 సెక్షన్‌ను విధించడం విశేషం.