English | Telugu
ఖుష్‌బూ మర్చిపోలేని రావులపాలెం హోలీ పండగ సందడి!
Updated : Jun 25, 2021
సీనియర్ తార ఖుష్‌బూ.. ఒకప్పుడు గ్లామరస్ హీరోయిన్‌గా ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా పరిచయమైన 'కలియుగ పాండవులు' చిత్రంతోటే ఆమె కూడా టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో ఆమె నటించారు. ఆమె నటించిన వాటిలో రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ హీరోలుగా చేసిన 'చిన్నోడు పెద్దోడు' ఓ వైవిధ్యమైన చిత్రం. పైకి కామెడీ సినిమా అయినా బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న సినిమా అది. రేలంగి నరసింహారావు ఆ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో హోలీ పండగ జరుపుకొనే ఎపిసోడ్ ఒకటుంది. ఆ సన్నివేశాల చిత్రీకరణను ఇప్పటికీ ఖుష్‌బూ మర్చిపోలేదు.
'చిన్నోడు పెద్దోడు' సినిమాని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీశారు. సిటీలో పుట్టిపెరిగిన ఖుష్‌బూకు రాజమండ్రి, గోదావరి నదీతీరం, అక్కడి వాతావరణం ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజానికి పల్లె వాతావరణంలోకి అడుగుపెట్టడం ఆమెకు అదే మొదటిసారి. ఆ సినిమా షూటింగ్‌లో ఆమెకు బాగా నచ్చింది హోలీ ఆడే సన్నివేశాలు. వాటిని రావులపాలెంలో చిత్రీకరించారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ చాలా సరదాగా జరిగింది. మామూలుగానే రాజేంద్రప్రసాద్ చాలా సరదాగా, కలుపుగోలుగా ఉండే వ్యక్తి. అదివరకే ఆయనతో 'కెప్టెన్ నాగార్జున' లాంటి సినిమాల్లో నటించారు ఖుష్‌బూ. ఆయన ఎప్పుడూ జోక్స్ వేసి నవ్విస్తూ ఉండటం అప్పటికే ఆమెకు తెలుసు.
చంద్రమోహన్‌తో మాత్రం ఖుష్‌బూకు ఇదే మొదటి సినిమా. ఆయన తనకన్నా వయసులోనే కాక, అనుభవంలోనూ పెద్దవాడవడంతో ఆయనతో ఆమె ఎక్కువగా మాట్లాడలేకపోయారామె. అయినా చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్.. ఇద్దరూ సరదా మనుషులే. దగ్గరున్న వాళ్లను టీజ్ చేస్తూ, సరదాగా నవ్విస్తూ, నవ్వుతూ ఉంటారు. దాంతో హోలీ పండగ సీన్లలో అంతా రెచ్చిపోయి నటించేశారు. వైట్ అండ్ వైట్ డ్రస్సులో టిప్ టాప్‌గా తయారై ఉండే రాజేంద్రప్రసాద్‌ను చంద్రమోహన్, తాను చెరో బకెట్ రంగునీళ్లతో ముంచేసే ఆ సీన్ ఇప్పటికీ ఖుష్‌బూ కళ్లముందు మెదులుతూనే ఉంటుంది.
వాళ్లను తప్పించుకోవడానికి రాజేంద్రప్రసాద్ పరుగెత్తుతుంటే ఆ ఇద్దరూ వెంటపడి మరీ రంగునీళ్లు పోస్తారు. ఆ తర్వాత వితంతువు అయిన తాళ్లూరి రామేశ్వరి మీద చంద్రమోహన్ రంగునీళ్లు పోయడంతో ఆ సీన్ ఎమోషనల్ కింద మారిపోతుంది. "హోలీ పండగ సన్నివేశ చిత్రీకరణలో రంగుల్లో ముంచెత్తారంతా. నేను మాత్రం తక్కువా! నేనూ వాళ్లందరినీ రంగుల్లో ముంచి తేల్చేశాను. ఈ సంఘటన మాత్రం చాలా తమాషాగా అనిపించింది. ఇదే కాదు, సినిమా షూటింగ్ అంతా ఓ పిక్నిక్‌లా సరదాగా జరిగింది." అని ఓ సందర్భంలో వెల్లడించారు ఖుష్‌బూ.