English | Telugu
అభిమానిని నిర్మాతగా మార్చిన సూపర్‌స్టార్ కృష్ణ సినిమా 'నాయుడుగారబ్బాయి' కథ!
Updated : Jun 19, 2021
సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా బి.వి. ప్రసాద్ డైరెక్ట్ చేసిన మూవీ 'నాయుడుగారబ్బాయి' (1981). అంబిక హీరోయిన్‌గా నటించగా రావు గోపాలరావు, రంగనాథ్ విలన్లుగా నటించారు. కవిత ఓ కీలక పాత్ర చేసిన ఈ మూవీకి చక్రవర్తి సంగీతం సమకూరిస్తే, లక్ష్మణ్ గోరే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రాజీవి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్. రామలింగేశ్వరరావు, బి.వి.పి.ఎ. గోపీనాథ్ సంయుక్తంగా నిర్మించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే రామలింగేశ్వరరావుకు ఊహ తెలిసినప్పట్నుంచీ కృష్ణ అంటే వీరాభిమానం. అంటే అభిమానికి ఈ సినిమా చేసిచ్చారు కృష్ణ. అప్పుడు రామలింగేశ్వరరావు వయసు కేవలం 22 ఏళ్లు.
కథా రచయితగా దాసరి నారాయణరావు పేరు వేసినా, నిజానికి జితేంద్ర హీరోగా నటించిన హిందీ సినిమా 'కారవాన్' ప్రేరణతో రచయిత రాజశ్రీ ఈ సినిమా కథ తయారుచేసి, సంబాషణలు రాశారు. ఈ సినిమా నుంచి కృష్ణకు రామలింగేశ్వరరావు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అయిపోయారు. కృష్ణ కాల్షీట్లు అడ్జెస్ట్ అవడం లేటైతే చిన్న హీరోలతో సినిమాలు తీశారు కానీ, మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లలేదు రామలింగేశ్వరరావు. ఈ సినిమా కథను బొమ్మలతో పాటు చదువుకుందాం...
ఒక ఊళ్లో రాఘవనాయుడు (కాంతారావు) అనే డబ్బున్నాయన ఉంటాడు. ఆయన పెద్ద బంగళాలో మేనేజర్ కుటుంబరావు (అల్లు రామలింగయ్య), ఆయన భార్య తాయారమ్మ (సూర్యకాంతం) కూడా ఉంటుంటారు. నాయుడుగారి భార్య అప్పటికే చనిపోయింది. అంతులేని సంపద ఉన్న రాఘవనాయుడు తన కుమారుడు రాజశేఖర్‌తో పాటు కుటుంబరావు కొడుకు సూరిబాబును కూడా సమాన ప్రేమతో చూస్తుంటాడు. ఊరి వాళ్లందరికీ ఆయనంటే ఎంతో గౌరవం, అభిమానం.
జైలు నుంచి బయటకు వచ్చిన నాగరాజు (రావు గోపాలరావు) నేరుగా నాయుడుగారింట్లో ఉంటున్న తన అక్క తాయారమ్మను కలుసుకొని, అక్కడ ఆమె కుటుంబం అనుభవిస్తున్న రాజభోగాలు చూసి మతిపోగొట్టుకుంటాడు. నాయుడుగారిని చంపేస్తే ఆ ఆస్తి అంతా తమకే దక్కుతుందని అక్కను ఒప్పించి, తెలివిగా నాయుడుగారిని చంపి, ఆయన సహజంగా చనిపోయినట్లు ఊరిజనాన్ని నమ్మిస్తాడు. ఆయన అస్థికలను అన్ని పుణ్యనదుల్లోనూ కలిపి వస్తానంటూ అక్క తాయారమ్మను, చిన్నపిల్లలైన రాజశేఖర్, సూరిబాబును తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరి, దారిలో శ్రీశైలం అడవుల్లో ఓ పాడుబడ్డ బావిలో నాయుడుగారబ్బాయి రాజశేఖర్‌ను పడేస్తాడు నాగరాజు. సూరిబాబును పట్నంలోని ఓ కాన్వెంట్లో చేర్పించి, ఊరికి వచ్చి సూరిబాబు చనిపోయాడనీ, రాజశేఖర్ క్షేమంగా కాన్వెంట్‌లో చదువుకుంటున్నాడని అందర్నీ నమ్మిస్తాడు.
బావిలో పడిన రాజశేఖర్‌ను నాటకాలు ఆడే శరభయ్య కాపాడి ఆ అబ్బాయికి చంద్రం అని పేరుపెట్టుకొని పెంచుతాడు. చంద్రం (కృష్ణ) పెరిగి పెద్దవాడై, ఆ నాటకాల కంపెనీకి యజమాని అవుతాడు. ఎప్పుడూ ఉత్సాహం ఉరకలు వేస్తుండే చంద్రం అందర్నీ ఆనందింపజేస్తుండటమే కాకుండా, ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ప్రాణాలకు తెగించి న్యాయం వైపు నిలుస్తుంటాడు. చంద్రంతో పాటు ఆడుతూ పాడుతూ "బావా బావా" అంటూ వెంట తిరుగుతుంటుంది గౌరి (కవిత).
ఓసారి శరభయ్యకు జబ్బుచేస్తే డాక్టర్‌ను తీసుకువెళ్లడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అదే రోడ్డులో ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న మాధవి (అంబిక) అనే అమ్మాయి కారును ఆపించి, ఆ కారులో డాక్టర్‌ను తీసుకుపోయి ట్రీట్‌మెంట్ ఇప్పించి శరభయ్యను బతికించుకుంటాడు చంద్రం. అలా చంద్రం, మాధవిల పరిచయం జరుగుతుంది.
అమెరికాలో పైచదువులు ముగించుకున్న సూరిబాబు (రంగనాథ్).. నాయుడుగారబ్బాయి రాజశేఖర్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. ఒకప్పుడు నాలుగురోడ్ల కూడలిలో కల్లుకొట్టు నడుపుకుంటూ బతికిన నాగమ్మ (సుకుమారి) ఇప్పుడు మహిళామండలి ప్రెసిడెంట్ నందివర్ధనంగా మారి, తన కూతురు మాధవిని రాజశేఖర్‌కు ఇచ్చి పెళ్లిచేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నచ్చకపోయినా, ఏమీచేయలేక ఆమె చెప్పినట్లే నడుచుకుంటుంటాడు నందివర్ధనం భర్త (మిక్కిలినేని).
రాజశేఖర్ ఇండియాకు వచ్చిన శుభసందర్భంగా చంద్రం బృందం నాట్యప్రదర్శన ఇస్తారు. ప్రదర్శన అనంతరం చంద్రం మీదకు రాజశేఖర్ మనీ పర్స్ విసిరికొడితే, ఆ పర్సులో ఉన్న డబ్బులో తనకు రావాల్సిన డబ్బు మాత్రమే తీసుకొని, మిగతా డబ్బు ఆ పర్సులోనే ఉంచి, దాన్ని తిరిగి రాజశేఖర్ ముఖంమీదకు విసిరికొడతాడు చంద్రం. ప్రోగ్రాం చూడ్డానికి వచ్చిన మాధవిని చంద్రం నిజాయితీ ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ కోసం నందివర్ధనం ఏర్పాటుచేసిన ఓ పార్టీలో మాధవిని అతడు రేప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. చంద్రం అతడిని చితకబాది మాధవిని క్షేమంగా వాళ్లింట్లో దిగబెడతాడు. చంద్రాన్ని నందివర్ధనం అవమానిస్తుంది. మాధవి అతడిని క్షమించమంటుంది. ఇద్దరి మనసులు ఒక్కటవుతాయి.
మాధవిని చంద్రం ప్రేమిస్తున్న విషయం గమనించి "నాకెందుకు అన్యాయం చేశావ్?" అని చంద్రాన్ని నిలదీస్తుంది గౌరి. "నిన్నెప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు." అని చెప్తాడు చంద్రం. మాధవి-చంద్రం ప్రేమ వ్యవహారం తెలుసుకున్న నాగరాజు, రాజశేఖర్ చంద్రాన్ని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ అతడిని గౌరి కాపాడుతుంది. గౌరి హృదయం చంద్రానికి అర్థమవుతుంది.
మాధవి పెళ్లి రాజశేఖర్‌తో నిశ్చయిస్తుంది నందివర్ధనం. ముహూర్తం సమయానికి చంద్రం, మాధవి తప్పతాగి పాటపాడతారు. దాంతో ఈ తాగుబోతు సంబంధం మాకొద్దంటూ రాజశేఖర్ బంధువులు అతడిని తీసుకొని వెళ్లిపోతారు. చంద్రం చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయి గౌరిని రేప్ చేస్తాడు రాజశేఖర్. గౌరి ఏడుస్తూ ఆ విషయం చంద్రంకు చెబుతుంది. చంద్రం ఆవేశంతో రాజశేఖర్ దగ్గరకు వెళ్లి నీ చేత్తోనే గౌరిమెడలో తాళి కట్టిస్తానని శపథం చేస్తాడు. తన జీవితం బాగుపడాలంటే చంద్రం-మాధవి పెళ్లి జరగాలంటుంది గౌరి. ఆమె ఇష్టప్రకారం గుడిలో పెళ్లి చేసుకోబోతారు చంద్రం, మాధవి.
అంతకుముందే చంద్రానికి పెళ్లయ్యిందని సాక్ష్యాలతో పదిమందినీ నమ్మించి ఆ పెళ్లి చెడగొడతాడు నాగరాజు. అతడి కుట్ర చంద్రానికి అర్థమవుతుంది. కుటుంబరావు ద్వారా తనే నాయుడుగారబ్బాయిననే నిజం తెలుసుకుంటాడు. అక్కడ రాజశేఖర్ తనను ఆయాలాగా, పనిమనిషిలాగా చూస్తుంటే ఆ బాధను భరించలేకపోతుంది కన్నతల్లి అయిన తాయారమ్మ. ఈలోగా తానే సూరిబాబునంటూ ఆ ఇంట్లో మారువేషం వేసుకొని వస్తాడు చంద్రం. మాధవితో పెళ్లి జరిపిస్తానని రాజశేఖర్‌కు మాటయిచ్చి అతడి ఫ్రెండ్ అయిపోతాడు. "అసలు సూరిబాబు.. రాజశేఖర్‌గా చలామణీ అవుతుంటే ఈ నకిలీ సూరిబాబు గాడెవడు?" అని గింజుకుంటాడు నాగరాజు.
మాధవిని రాజశేఖర్‌తో పెళ్లికి ఒప్పుకొమ్మని చెప్పి, ముహూర్తం సమయానికి తాను వచ్చి తాళికడతానని చెప్తాడు చంద్రం. నకిలీ సూరిబాబు, నాటకాల చంద్రమేనని తెలుసుకున్న నాగరాజు దొంగదెబ్బతీసి అతడిని బంధిస్తాడు. తన నేస్తం గుర్రం చేసిన సాయంతో చంద్రం తప్పించుకుని, రాజశేఖర్‌కు బుద్ధివచ్చేలా చేసి, గౌరి మెడలో తాళి కట్టిస్తాడు. తాను మాధవిని పెళ్లిచేసుకొని తనే నాయుడుగారబ్బాయిననే నిజాన్ని ఆధారాలతో సహా నిరూపిస్తాడు.