English | Telugu
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'బొబ్బిలిపులి' షూటింగ్ ఎలా జరిగిందంటే..
Updated : Jun 17, 2021
మహానటుడు నందమూరి తారకరామారావు టైటిల్ పాత్రధారిగా దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన 'బొబ్బిలి పులి' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్టయింది. సౌత్ ఇండియాలోనే తొలిసారిగా 70 ప్రింట్లతో 1982 జూలై 9న విడుదలైన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ సినిమా షూటింగ్ ఎలా జరిగిందో.. మచ్చుకు ఒక సీన్...
చుట్టూ విశాలమైన కాంపౌండ్ వాల్. మధ్య రెండు లక్షల రూపాయల వ్యయంతో అత్యద్భుతంగా వేసిన 'బొబ్బిలిపులి' స్థావరం సెట్. రోడ్డు మీద నుంచి కనిపిస్తున్న ఆ సెట్‌ను చూస్తుంటే ఎలాగైనా లోపలికి వెళ్లి, అదెలా ఉంటుందో చూడాలన్న తపన కలుగుతుంది చూసేవాళ్లకు. షూటింగ్‌కు ముందు రెండు రోజులు భోరున వర్షం కురవడంతో, సెట్ లోపల మోకాలి లోతు నీరు నిలిచింది. షూటింగ్ తప్పదు కాబట్టి, 20 కిలో మీటర్ల దూరం నుంచి వంద లారీల ఇసుకను తెచ్చి, సెట్‌లో నిలిచిన నీటిని మాయం చేసేసరికి యూనిట్ వాళ్ల తల ప్రాణం తోకకు వచ్చింది.
సెట్‌లో కల్కి అవతారం దాల్చిన విష్ణుమూర్తి విగ్రహం పదడుగుల పరిమాణం ఎత్తులో ఉంది. విగ్రహం పాదాల వద్ద కుంకుమ, పువ్వులు చెల్లాచెదురుగా పడివున్నాయి. విగ్రహం పక్కనే కుర్చీలో బందిపోటు నాయకుడి వేషంలో ఎన్టీ రామారావు కళ్లు మూసుకొని, గంభీరముద్ర దాల్చి ఉన్నారు. ఆయన గెటప్ సూపర్బ్‌గా ఉంది. బురదగా ఉన్న సెట్‌లో ఒక పక్కగా కుర్చీలో కూర్చొని తీయబోయే సన్నివేశానికి సంభాషణలు రాస్తున్నారు దర్శకుడు దాసరి నారాయణరావు. రాసిన దాన్ని పైకి చదువుతూ అక్కడక్కడా మార్పులు, చేర్పులు చేస్తుండగా సినిమాటోగ్రాఫర్ మణి వచ్చి షాట్ రెడీ అన్నారు.
"వస్తున్నా" అని రాసిన డైలాగ్‌లతో సన్నివేశాన్ని వివరించడం కోసం ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు దాసరి. ఎప్పుడొచ్చారో, ఏమో.. జగ్గయ్య పోలీస్ ఆఫీసర్ వేషంలో ఎన్టీఆర్ దగ్గర కూర్చొని కబుర్లు చెబుతూ ఒకవైపు తన మేకప్ సరిదిద్దుకుంటున్నారు. దాసరి షాట్‌ను ఆ ఇద్దరికీ వివరిస్తుండగా, ఆ వైపు ఎవరినీ రానీయకుండా సెక్యూరిటీ గార్డుల్లా నిల్చున్నారు ఆయన అసిస్టెంట్స్.
విశాలమైన ఆ కొండగుహ సెట్లో దాదాపు 20 మంది బందిపోటు దొంగలు ఖాకీ దుస్తుల్లో తుపాకులు ధరించి ఒక్కొక్కరూ ఒక్కొక్క మెట్టుదగ్గర చేతనైనంత గంభీరంగా నిల్చొని ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఉన్నవి నిజానికి కర్ర తుపాకులు. ఇంతలో ఎన్టీఆర్, జగ్గయ్య, దాసరి ముగ్గురూ కెమెరా దగ్గరకు వచ్చారు. "సైలెన్స్.. సైలెన్స్" అని అరిచారు అసిస్టెంట్స్.
గుహలో ఒక గోడకు జగ్గయ్యను గొలుసులతో బంధించారు. ఎన్టీఆర్ మెట్ల మీదుగా దిగుతూ జగ్గయ్యను చూసి, కట్లు విప్పమని అనుచరులకు పురమాయించి మాట్లాడాలి.. అదీ సీన్.
"ఆల్ లైట్స్".. సినిమాటోగ్రాఫర్ మణి కేక వేశారు. క్షణంలో సెట్ లైట్లతో వెలిగిపోయింది. లైట్లతో పాటు పాతిక కాగడాలు వెలిగాయి. "యస్.. రెడీ" అన్నారు దాసరి. ఎన్టీఆర్ మెట్లపైకి వెళ్లి నిల్చున్నారు. అసిస్టెంట్ క్లాప్ కొట్టాడు.
అంతా నిశ్శబ్దం. బరువుగా అడుగులు వేస్తూ, గంభీరంగా మెట్లు దిగుతున్నారు ఎన్టీఆర్. అనుచరులందరూ ఆయనకేసి ఆత్రుతగా చూస్తున్నారు. ఇంకా మూడు మెట్లు ఉన్నాయనగా ఆగి, గొలుసులతో బంధించి ఉన్న జగ్గయ్యను చూసి, గొలుసుల్ని విప్పమన్నట్లు సైగ చేశారు. అతి కష్టంమీద ఆయన బంధనాల్ని తొలగించాడు అనుచరుడు. వెంటనే జగ్గయ్య ముందుకు ఒక్క దూకు దూకారు.
"బొబ్బిలిపులిని పట్టుకోడానికి వచ్చినవాడివి కట్టుదిట్టాలతో రావాలి కానీ, ఇలా వచ్చి పట్టుబడిపోయావేంటి గోపీనాథ్." అన్నారు ఎన్టీఆర్ హేళనగా.
"నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు. అందుకే వచ్చాను".. ఏమాత్రం తొణక్కుండా చెప్పారు జగ్గయ్య.
"గుడ్.. నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావ్?" చేతులు కట్టుకొని అడిగారు ఎన్టీఆర్.
"నువ్వు చేస్తున్నది అన్యాయం కనుక." జగ్గయ్య ప్రశాంతంగా చెప్పారు.
"నేను చేస్తున్నది అన్యాయం అని ఎలా నిర్ణయించావ్?" ఎన్టీఆర్ ప్రశ్న.
"ఎందరో అమాయకుల్ని చంపావ్ కనుక." స్థిరంగా చెప్పారు జగ్గయ్య.
దాంతో బొబ్బిలిపులి గర్జించింది. ఆ గర్జనకు క్షణకాలం గుహ కంపించింది. "మిస్టర్ గోపీనాథ్.. నీకు తెలిసిన పరిధిలో నేను ఏ ఒక్క.. ఒక్క మనిషిని హత్య చేశానో చెప్పు. నీకు పట్టుబడి, నీ మాటప్రకారం నీ వెంట వస్తాను." అని చెప్పారు ఎన్టీఆర్.
"కట్" అన్నారు దాసరి. ఆ వెంటనే "వెరీ గుడ్" అని కూడా అన్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఆ సీను వచ్చిందని ఆయన అన్నారు.