English | Telugu
"ఆక్సిజన్ అందక ఇంకెవ్వరూ చనిపోకూడదు".. ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభించిన చిరంజీవి!
Updated : May 26, 2021
కొవిడ్-19 పేషెంట్లకు సాయపడే నిమిత్తం ప్రతి జిల్లా కేంద్రంలోను ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పుతున్నట్లు కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. రేపటి నుంచి, అంటే మే 27 నుంచి 7 జిల్లాల్లో అవి అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్ సిలిండర్లతో పాటు, పేషెంట్ల కోసం పలు వైద్య సదుపాయాలకు అవసరమయ్యే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌ను కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందించనున్నది. ఈ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణ బాధ్యతలను రామ్‌చరణ్ చేపడుతున్నారు.
గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా షూటింగ్‌లు లేక ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకోవడానికి కరోనా క్రైసిస్ చారిటీని నెలకొల్పిన చిరంజీవి, దాని ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేశారు.
ఇప్పుడు సెకండ్ వేవ్ మరింత బీభత్సంగా మారి, ఆక్సిజన్ సదుపాయాలు లేక కొవిడ్ పేషెంట్లు నానా అవస్థలు పడుతుండటం, సరైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో కొంతమంది రోగులు చనిపోతుండటంతో చలించిన చిరంజీవి ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటుచేశారు. నేడు (మే 26), అనంతపురం, గుంటూరులోని వైద్య కేంద్రాలకు ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీ అయ్యాయి. రేపు ఖమ్మం, కరీంనర్, మరో ఐదు జిల్లాల్లోని ప్రజలకు అవి అందుబాటులోకి రానున్నాయి.
బుధవారం తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వివరాలను తెలియజేస్తూ ఓ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. "మిషన్ మొదలైంది. ఇక నుంచీ ప్రాణాల్ని కాపాడే ఆక్సిజన్ లోటు కారణంగా ఎలాంటి చావులు లేకుండా చూడండి. #Covid19IndiaHelp #ChiranjeeviOxygenBanks @AlwaysRamCharan (sic)." అని ఆయన ట్వీట్ చేశారు.