English | Telugu
మోహన్‌బాబు 'రావణబ్రహ్మ', విష్ణు 'కన్నప్ప' సినిమాలు వస్తాయా?
Updated : May 26, 2021
మోహన్‌బాబు కలల ప్రాజెక్ట్ 'రావణబ్రహ్మ', మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించాలనుకున్న 'కన్నప్ప' సినిమాలు తెరకెక్కుతాయా? ఈ ప్రశ్న వారి అభిమానులను వేధిస్తోంది. ఒక దశాబ్దం పై నుంచే రామాయణం కథలో ప్రతినాయకుడైన రావణాసురునిగా నటించాలని మోహన్‌బాబు ఆశిస్తూ వస్తున్నారు. 'రావణబ్రహ్మ' అనే టైటిల్‌తో రూపొందే ఆ సినిమాకు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని కూడా ఆయన గతంలో చెప్పారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో 'అల్లుడుగారు', 'అల్లరి మొగుడు', 'మేజర్ చంద్రకాంత్' లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
దివంగత మహానటుడు ఎన్టీ రామారావు తర్వాత అంత గంభీరంగా డైలాగ్‌ను చెప్పగల నటునిగా మోహన్‌బాబు పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రలకు డిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాజమౌళి సినిమా 'యమదొంగ'లో యమధర్మరాజు పాత్రలో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్స్ అందరినీ అలరించాయి. 'భూకైలాస్'లోనూ, తర్వాత 'సీతారామ కల్యాణం'లోనూ రావణాసురునిగా ఎన్టీఆర్ అద్భుత నటన ప్రదర్శించారు. అలాగే తాను కూడా ఆ పాత్రను పోషించాలని మోహన్‌బాబు కలలు కంటూ వస్తున్నారు. అయితే ఇంతదాకా ఆ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చలేదు.
ఇక నాలుగైదేళ్లుగా భక్త 'కన్నప్ప' సినిమాని మంచు విష్ణు చేయనున్నట్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదివరకు సునీల్‌తో తాను 'కన్నప్ప'ను తీయనున్నట్లు తనికెళ్ల భరణి చెప్పారు. 'కన్నప్ప' స్క్రిప్టును ఆయన ఎంతో ప్రేమగా రాసుకున్నారు. కానీ తర్వాత ఆ స్క్రిప్టును విష్ణుకు అమ్మేశారు భరణి. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా కాళహస్తికి వెళ్లిన మోహన్‌బాబు, అక్కడ రిపోర్టర్లతో మాట్లాడుతూ రూ. 60 కోట్ల బడ్జెట్‌తో విష్ణుతో ఆ సినిమాని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ ఇంతదాకా ఆ సినిమా ఊసు కనిపించలేదు. కరోనా మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమే తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.
ఇటీవల రూ. 50 కోట్లతో విష్ణు స్వయంగా నిర్మించిన 'మోసగాళ్లు' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా దెబ్బతిని, పెట్టిన పెట్టుబడినంతా దెబ్బతీసేసింది. ఈ నేపథ్యంలో రూ. 60 కోట్ల బడ్జెట్‌తో 'కన్నప్ప' సినిమా నిర్మాణానికి ఆయన నడుంబిగిస్తారా? సందేహమే.