English | Telugu
నటి సీత గురించి చాలామందికి తెలీని విషయాలు!
Updated : Jul 12, 2021
నటి సీత అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన క్యూట్ లుక్స్‌తో, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్‌తో చాలామంది హృదయాల్లో ఆమె చెరగని ముద్రవేశారు. ఆడదే ఆధారం, డబ్బెవరికి చేదు, సగటు మనిషి, చిన్నారి దేవత, బజారు రౌడీ, ముద్దుల మావయ్య, ముత్యమంత ముద్దు, పోలీస్ భార్య, చెవిలో పువ్వు లాంటి సినిమాలు ఆమెను ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఆరేళ్ల పాటు తన నటనతో అలరించిన ఆమె తమిళ నటుడు పార్తీబన్‌ను 1990లో వివాహం చేసుకున్నాక, సినిమాలకు దూరమయ్యారు. వారికి ఇద్దరు కుమార్తెలు.. అభినయ, కీర్తన పుట్టారు. ఆ తర్వాత రాధాకృష్ణన్ అనే అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించారు. పార్తీబన్‌తో తీవ్ర భేదాభిప్రాయలు తలెత్తడంతో 2001లో ఆయన నుంచి విడాకులు పొందారు సీత.
ఆ తర్వాత తిరిగి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2010లో ఆమె టీవీ నటుడు సతీశ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. కానీ ఆరేళ్ల సంసారం తర్వాత ఆయనతోనూ ఆమె విడిపోయారు. అసలు సీత ఎవరు? ఆమె సినిమాల్లోకి ఎలా వచ్చారనే విషయాలు చాలా మందికి తెలీదు. ఆమె కథేమిటంటే...
సీత తండ్రి తమిళియన్ కాగా తల్లి తెలుగు వనిత. చెన్నైలోనే పుట్టి పెరిగారు సీత. చదువుకునే రోజుల్లో ఆమెకు సినిమాలపై అంత ఆసక్తి ఉండేది కాదు. ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్తే, తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి రావడం, ఆ తర్వాత ఎక్కడకీ వెళ్లకుండా ఇంటిదగ్గర చదువుకుంటూ ఉండటం.. ఇదే పని. పిల్లల పెంపకం విషయంలో ఆమె అమ్మానాన్నలు చాలా స్ట్రిక్టుగా ఉండేవారు.
సీత పదవ తరగతి చదువుతున్న కాలంలో ఓ రోజు సీత వాళ్ల నాన్నగారి స్నేహితుడు ఒకాయన వాళ్లింటికి వచ్చాడు. వాళ్ల నాన్నతో మాట్లాడుతూ, "పాండ్యరాజాగారు (తమిళ డైరెక్టర్) తీస్తున్న చిత్రంలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మనమ్మాయి కన్ను ముక్కు తీరుగా ఉంటుంది. సినిమాల్లోకి వస్తే రాణించే అవకాశాలు కనిపిస్తాయి. మీకు ఇష్టమైతే ఆయనకు పరిచయం చేస్తాను." అన్నాడు.
సీత వాళ్ల నాన్న మోహన్‌బాబు కూడా నటులే. స్టేజిమీద ఎన్నో నాటకాలు వేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. అందుకని, "సినిమాల్లో నటించడంలో ఏమీ తప్పులేదు." అని సీతను ప్రోత్సహించారు. అలా పాండ్యరాజాను కలవడం, అప్పుడు ఆయన తీస్తున్న 'ఆణ్‌పావమ్' సినిమాలో నటించడం తలవని తలంపుగా జరిగిపోయాయి. ఆ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.
అలా తమిళ చిత్రాలతో బిజీగా ఉండగానే రాజాచంద్ర డైరెక్షన్‌లో శోభన్‌బాబు హీరోగా నటించిన 'విజృంభణ' (1986) సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు సీత. ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. అయితే రెండో చిత్రం 'డబ్బెవరికి చేదు' సక్సెస్ అవడంతో, తెలుగులోనూ ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. తొలినాళ్లలో ఆమె మేకప్ లేకుండానే కొన్ని చిత్రాలు చేశారు. 'ఆడదే ఆధారం', 'అగ్నిపుష్పం', 'పెళ్లికొడుకులొస్తున్నారు' సినిమాల్లో ఆమె కేవలం పౌడర్ రాసుకొని నటించేశారు.
నటనలో ఆమెకు ఇన్‌స్పిరేషన్ వాళ్ల నాన్న మోహన్‌బాబు గారే. సావిత్రి, బి. సరోజాదేవి ఆమె ఆరాధ్య తారలు. 'పెళ్లికొడుకులొస్తున్నారు' చిత్రంలో ఆమె గతంలో సావిత్రి చేసిన పాత్రను పోషించారు. ఆ సినిమా క్లాసిక్ ఫిల్మ్ 'గుండమ్మ కథ' ఆధారంగా రూపొందింది. 'గుండమ్మ కథ'లో సావిత్రి చేసిన పాత్రను 'పెళ్లికొడుకులొస్తున్నారు'లో ఆమె చేశారు. ముద్దుల మావయ్య (1989) చిత్రంలో బాలకృష్ణ చెల్లెలిగా చేసిన పాత్రలో సీతను ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేదు.