English | Telugu
బాలకృష్ణతో సినిమా వివాదం.. కొడుకు కోసం కోర్టుకెక్కిన సూపర్‌స్టార్ కృష్ణ!
Updated : Jul 23, 2024
అవి టాలీవుడ్ ప్రముఖులు తమ వారసుల్ని సినిమా రంగంలో పరిచయం చేస్తున్న రోజులు. అప్పటికే నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కుమారుడు కళ్యాణచక్రర్తి హీరోలుగా పరిచయమయ్యారు. అదే సమయంలో తన పెద్ద కుమారుడు రమేష్‌బాబుని కూడా హీరోగా తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేసేందుకు సూపర్‌స్టార్ కృష్ణ సిద్ధమయ్యారు. దాని కోసం రమేష్‌కి నటనలో, డాన్సుల్లో, ఫైట్స్‌లో మంచి శిక్షణ ఇప్పించారు. హిందీలో సూపర్‌హిట్ అయిన ‘బేతాబ్’ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్‌తో రచన చేయించారు. బాలీవుడ్ నుంచి బప్పిలహిరి రప్పించి పాటలు రికార్డ్ చేశారు. హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్‌ను ఎంపిక చేశారు. తన కుమారుడి మొదటి సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీగా నిర్మించాలన్న ఉద్దేశంతో సొంతంగా పద్మాలయా స్టూడియోస్ బేనర్‌లోనే సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకి ‘సామ్రాట్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా టైమ్‌లో ఎన్టీఆర్, కృష్ణల మధ్య ఒక విషయంలో వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మాటలు లేవు. దీంతో రమేష్ తొలి సినిమా ప్రారంభోత్సవానికి అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించారు కృష్ణ. నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నారు. అతనికి పోటీగానే కృష్ణ తన కుమారుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నారనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. దీంతో ఈ సినిమా గురించి సాధారణ ప్రేక్షకులు సైతం చర్చించుకున్నారు. ఆ కారణంగానే ఈ సినిమా ప్రారంభోత్సవానికి బాలకృష్ణ నిర్మాతలు ఎవరూ హాజరు కాలేదు. మద్రాస్‌లోని ఎవిఎం స్టూడియోలో సినిమా ప్రారంభమైంది. మొదట ఈ సినిమాకి కన్నడ దర్శకుడు రాజేంద్రసింగ్‌బాబును దర్శకుడిగా నియమించారు. విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ ఔట్‌పుట్ ఆశించిన స్థాయిలో రావడం లేదని భావించిన కృష్ణ.. దర్శకుడిగా అతన్ని తొలగించి, ఆ బాధ్యతను వి.మధుసూదనరావుకు అప్పగించారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నందమూరి బాలకృష్ణ, విజయశాంతి జంటగా కె.రాఘవేంద్రరావు దర్శత్వంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాకి కూడా ‘సామ్రాట్’ అనే పేరునే పెట్టారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య టైటిల్ వివాదం మొదలైంది. ఆ టైటిల్ తమదేనంటూ రెండు సినిమాల నిర్మాతలూ వాదించారు. ఈ వివాదం కోర్టు వరకు వెళ్ళింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఆ టైటిల్ హక్కులు సూపర్‌స్టార్ కృష్ణకే చెందుతాయని తీర్పునిచ్చారు. అప్పుడు బాలకృష్ణ సినిమా టైటిల్‌ను ‘సాహస సామ్రాట్’గా మార్చుకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఈ వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ‘సాహస సామ్రాట్’ 1987 ఏప్రిల్ 13న రిలీజ్ అవ్వగా, ‘సామ్రాట్’ అదే ఏడాది అక్టోబర్ 2న విడుదలైంది.
‘సామ్రాట్’ సూపర్‌హిట్ అయి రమేష్‌కి హీరోగా మంచి పేరు తెచ్చింది. అయితే ఆ తర్వాత అతను చేసిన సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం, కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. మరో పది సంవత్సరాలు హీరోగా కొనసాగి ఓ 15 సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ అతనికి మంచి పేరు తేలేదు. ఆ తర్వాత మహేష్ హీరోగా కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఏ హీరోకైనా సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే సరిపోదని, టాలెంట్ ఉంటేనే వృద్ధిలోకి రాగలరని చెప్పడానికి రమేష్‌బాబు ఒక మంచి ఉదాహరణ.