Read more!

English | Telugu

సుహాసిని-మ‌ణిర‌త్నం పెళ్లి.. చాలా మందికి తెలీని ఆస‌క్తిక‌ర నిజాలు!

 

సుప్ర‌సిద్ధ న‌టి సుహాసిని, దేశం గ‌ర్వించే సినిమాలు తీసిన మ‌ణిర‌త్నం ప్రేమించి పెళ్లి చేసుకున్నారా?  లేక వారి పెళ్లిని పెద్ద‌లు కుదిర్చారా? అనే విష‌యంలో చాలామందికి సందిగ్ధ‌త ఉంది. 1988 ఆగ‌స్ట్‌లో వారి వివాహం జ‌రిగింది. వారికి నంద‌న్ అనే కొడుకు ఉన్నాడు. 1988 జూన్‌లో సుహాసిని తండ్రి చారు హాస‌న్‌కు వెన్ను స‌మ‌స్య రావ‌డంతో హాస్పిట‌ల్‌లో చేర్చారు. అక్క‌డ మాట‌ల మ‌ధ్య "డిసెంబ‌ర్ త‌ర్వాత నువ్వు కొత్త సినిమాలు ఒప్పుకోవ‌ద్దు." అని కూతురికి చెప్పారాయ‌న‌. సుహాసిని ముఖంలో క్వ‌శ్చ‌న్ మార్క్‌.

"నీ గురించి, మ‌ణిర‌త్నం గురించి వ‌దంతులు వ‌స్తున్నాయి. ఈ విష‌యం నేనూ, జి.వి. (మ‌ణిర‌త్నం సోద‌రుడు) చ‌ర్చించుకున్నాం. నువ్వు ఒక‌సారి మ‌ణిర‌త్నంను క‌లుసుకొని మాట్లాడు." అన్నారు చారు హాస‌న్‌.

సుహాసినికి ఒక‌వైపు ఆనందం, ఇంకోవైపు ఆశ్చ‌ర్యం! మ‌ణిర‌త్నం అంటే ఆమెకు ఒక విధ‌మైన అభిమానం, గౌర‌వం. ఆయ‌న పెద్ద డైరెక్ట‌ర్ అని మాత్ర‌మే కాదు, ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న‌, సింప్లిసిటీ ఆమెను బాగా ఆక‌ట్టుకున్నాయి. అయితే దాన్ని ప్రేమ‌నీ, ఇంకోట‌నీ పేరు పెట్ట‌డానికి లేదు. ఏదైతేనేం.. త‌ను మ‌ణిర‌త్నంను క‌లుసుకుని మాట్లాడాలి.. ఎలా? ఇదే విష‌యం త‌న క్లోజ్ ఫ్రెండ్ ఒకామెను అడిగారు. "ముందు ఫోన్‌లో మాట్లాడి చూడు" అని ఆమె స‌ల‌హా ఇచ్చింది. 

అంత‌కుముందు మ‌ణిర‌త్నంతో సుహాసినికి పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. జూన్ 8వ తేదీ సాయంత్రం ఆరున్న‌ర‌కు ఆమె మ‌ణిర‌త్నంకు ఫోన్ చేశారు. ఫోన్‌లో ఆప్యాయంగా, బాగా ప‌రిచితులైన‌వారితో మాట్లాడిన‌ట్లే ఆయ‌న మాట్లాడారు. "మ‌నం ఇవాళే క‌లుసుకుందాం" అని చెప్పారు. మ‌రో అర‌గంట‌లో సుహాసిని వాళ్లింట్లో ఉన్నారు. 

చాలా మామూలుగానే ఆయ‌నకు స్వాగతం చెప్పారు సుహాసిని. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా నేరుగా స‌బ్జెక్టులోకి వ‌చ్చేశారు. కొంత‌సేపు మాట‌ల‌య్యాక‌, "మ‌రోసారి మ‌నం క‌లుసుకుందాం" అన్నారు మ‌ణిర‌త్నం. ఆ తొలి స‌మావేశం చ‌ల్ల‌ని క‌బుర్ల‌తో, కూల్ డ్రింక్స్‌తో ముగిసింది. ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే వారిరువురూ పెళ్లి చేసుకోవాల‌నే నిర్ణ‌యం తీసుకున్నారు. కానీ త‌మ నిర్ణ‌యాన్ని మ‌రో ఎనిమిది రోజుల దాకా ఎవ‌రికీ చెప్ప‌లేదు. మ‌రోవైపు రెండు కుటుంబాల పెద్ద‌ల మ‌ధ్య సంప్ర‌తింపులు, పెళ్లిమాట‌లు న‌డుస్తున్నాయి. 

చారు హాస‌న్‌కు వెన్ను ఆప‌రేష‌న్ అమెరికాలోనో, ఇంగ్లండులోనో చేయించాల్సి వ‌స్తుంద‌నుకున్నారు. కానీ కూతురి పెళ్లివిష‌యం అనేస‌రికి ఆయ‌న‌కు ఎక్క‌డ‌లేని శ‌క్తి వ‌చ్చింది. లేచి తిర‌గ‌డం మొద‌లుపెట్టారు. పెళ్లి తొంద‌ర‌గా జ‌ర‌గాల‌నేది పెద్ద‌ల అభిప్రాయం. సుహాసిని, మ‌ణిర‌త్నం మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే వ‌దంతులే ఆ ఇద్ద‌రిని మ‌రింత స‌న్నిహితం చేశాయి.

1988 ఆగ‌స్ట్ 25.. సుహాసిని, మ‌ణిర‌త్నం పెళ్లిరోజు. వ‌దంతులు వ‌చ్చిన‌ట్లు వారిది ల‌వ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్‌. గ‌మ్మ‌త్తేమిటంటే.. మణిర‌త్నం వాళ్ల ఇల్లు, సుహాసిని వాళ్ల ఇంటి ప‌క్క‌వీధిలోనే ఉంటుంది. అయినా ఆ ఇద్ద‌రూ అంత‌కుముందు ఒక‌రికొక‌రు త‌ట‌స్థ‌ప‌డ‌లేదు. 

వారి ప‌రిచ‌యం మ‌ణిర‌త్నం సినిమా 'ప‌ల్ల‌వి అనుప‌ల్ల‌వి' (క‌న్న‌డం) సినిమా సంద‌ర్భంగా జ‌రిగింది. ఆ మూవీలో సుహాసినిని హీరోయిన్‌గా చేయ‌మ‌ని అడుగుదామ‌ని ఆయ‌నే స్వ‌యంగా వాళ్ల ఇంటికి వ‌చ్చారు. కానీ కాల్షీట్లు అడ్జ‌స్ట్ చేయ‌డానికి వీలుప‌డ‌లేదు సుహాసినికి. ఒక‌వేళ ఆ సినిమాలో సుహాసినికి న‌టించివుంటే.. అప్పుడే ప్రేమ‌లో ప‌డేవాళ్లేమో.. తెలీదు.

సుహాసిని సినీ న‌టుడ్ని పెళ్లి చేసుకోవాల‌ని మొద‌ట్నుంచీ అనుకోలేదు. క‌ళ‌ల‌ప‌ట్ల అభిరుచి, సంగీతంపై ఆస‌క్తి, హాస్య‌ప్రియ‌త్వం ఉన్న వ్య‌క్తిని ఆమె భ‌ర్త‌గా కోరుకున్నారు. త‌న భ‌ర్త చాక్లెట్ బేబీలా, మంద‌బుద్ధిలా ఉండ‌కూడ‌ద‌నీ, బుద్ధికుశ‌ల‌త‌తో, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌తో ఉండాల‌నీ అనుకున్నారు. హోదాలో త‌న‌తో స‌మానంగా లేదా త‌న‌కంటే కాస్త ఎక్కువ‌గా, త‌ను గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌తో చూసుకోద‌గ్గ వ్య‌క్తి అయివుండాల‌నుకున్నారు. స‌రిగ్గా అలాంటి వ్య‌క్తినే మ‌ణిర‌త్నంలో ఆమె చూశారు.