Read more!

English | Telugu

చిన్న మాటతో 20 ఏళ్ళ స్నేహం విచ్ఛిన్నమైంది.. ఎన్‌.టి.ఆర్‌, విశ్వనాథ్‌ల మధ్య దూరం పెరిగింది!

సినీ పరిశ్రమలో స్నేహాలు, మనస్పర్థలు ఏర్పడడం, అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. ఎన్నో సంవత్సరాలు స్నేహంగా ఉన్నవారు కూడా చిన్న చిన్న కారణాలకు వారి మధ్య దూరాన్ని పెంచుకుంటారు. కొందరు మాత్రం సన్నిహితుల ప్రమేయంతో దూరమైన స్నేహితులతో మళ్ళీ బంధాన్ని కొనసాగిస్తారు. అభిప్రాయ భేదాలు అనేవి హీరోల మధ్య రావచ్చు, హీరో, హీరోయిన్‌ మధ్య రావచ్చు, దర్శకులతో నటీనటులకు రావచ్చు. ఏది ఏమైనా అందరూ సినిమా కోసమే పనిచేస్తారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో మళ్ళీ కలుసుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం ఎప్పటికీ ఆ దూరాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి వారిలో ఎన్‌.టి.రామారావు, కె.విశ్వనాథ్‌ల గురించి చెప్పుకోవాలి. 

ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ల స్నేహం.. వారు సినిమా పరిశ్రమలోకి రాకముందు నుంచే ఉంది. గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు విశ్వనాథ్‌. ఆయనకు ఎన్టీఆర్‌ ఒక సంవత్సరం సీనియర్‌. విశ్వనాథ్‌ కాలేజీలో ఉండగానే ఎన్టీఆర్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌గా గుంటూరులో జాబ్‌ వచ్చింది. ఉద్యోగరీత్యా ప్రతిరోజూ విజయవాడ నుంచి గుంటూరు ట్రైన్‌లో ప్రయాణించేవారు ఎన్టీఆర్‌. విశ్వనాథ్‌ కాలేజీకి వెళ్లేందుకు అదే ట్రైన్‌ ఎక్కేవారు. తాను చదివిన కాలేజీలోనే విశ్వనాథ్‌ జూనియర్‌ కావడంతో అలా ఇద్దరికీ పరిచయమైంది. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు సినిమాల్లో అవకాశాలు రావడంతో మద్రాస్‌ వెళ్లిపోయారు ఎన్టీఆర్‌. డిగ్రీ పూర్తయిన తర్వాత విశ్వనాథ్‌ వాహినీ స్టూడియోలో సౌండ్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. షూటింగ్‌ నిమిత్తం స్టూడియోకి వచ్చే ఎన్టీఆర్‌ని అప్పుడప్పుడు కలుసుకునేవారు విశ్వనాథ్‌. అలా వారు తమ స్నేహాన్ని కొనసాగించారు. 

విశ్వనాథ్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా ఆయన రూపొందించిన తొలి చిత్రం ‘కలిసొచ్చిన అదృష్టం’. ఎస్‌.వి.ఎస్‌. ఫిలిమ్స్‌ బేనర్‌పై మిద్దె జగన్నాథరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్‌కు జగన్నాథరావు మంచి మిత్రుడు. ఆయన ఎన్టీఆర్‌తోనే వరసగా సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఇదే బేనర్‌లో ఎన్టీఆర్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో నిర్మించిన సినిమా ‘నిండు హృదయాలు’. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్‌. ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రంలో హాస్య పాత్ర పోషించిన వాణిశ్రీ తన పక్కన హీరోయిన్‌గా నటించేందుకు ఎన్టీఆర్‌ ఒప్పుకోలేదు. వేరే హీరోయిన్ల డేట్స్‌ కోసం ఎంతో ప్రయత్నించారు. కానీ, దొరకలేదు. అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటిస్తున్న ‘ఆత్మీయులు’ చిత్రంలో వాణిశ్రీ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయం ఎన్టీఆర్‌కి చెప్పి వాణిశ్రీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 1969లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఎస్‌.వి.ఎస్‌. ఫిలిమ్స్‌ బేనర్‌లో ఎన్టీఆర్‌, కె.విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో ‘నిండు దంపతులు’ మూడో సినిమాగా రూపొందింది. 1971లో విడుదలైన ఈ సినిమా అంతగా ఆడలేదు. 

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో సినిమా ‘చిన్ననాటి స్నేహితులు’. ఈ చిత్రాన్ని డి.వి.ఎస్‌.రాజు నిర్మించారు. 1971లోనే విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. సినిమాలోని ఓ సెంటిమెంట్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు విశ్వనాథ్‌. అదే సమయంలో సెట్‌కి వచ్చారు ఎన్టీఆర్‌. అయితే ఆయన కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉన్నారు. షాట్‌ చిత్రీకరిస్తున్నప్పుడు కూడా అదే కళ్ళజోడుతో ఉన్నారు. దానికి విశ్వనాథ్‌ అభ్యంతరం చెప్పారు. ‘ఇలాంటి సెంటిమెంట్‌ సీన్స్‌ చేసేటపుడు కూలింగ్ గ్లాసెస్ తో ఉంటే బాగుండదు’ అని ఎన్టీఆర్‌తో చెప్పారు. విశ్వనాథ్‌ చెప్పినదాన్ని పట్టించుకోకుండా ‘మరేం ఫర్వాలేదు. బాగానే ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు ఎన్టీఆర్‌. ఈ విషయంలో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. విశ్వనాథ్‌పై ఎన్టీఆర్‌ మండిపడ్డారు. అప్పుడు నిర్మాత డి.వి.ఎస్‌.రాజు జోక్యం చేసుకొని విశ్వనాథ్‌కి నచ్చజెప్పారు. అంత జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్‌ కూలింగ్ గ్లాసెస్ తోనే ఆ షాట్‌ నటించారు. 

ఈ సినిమా తర్వాత ఎస్‌.వి.ఎస్‌. ఫిలింస్‌ నిర్మించ తలపెట్టిన ‘డబ్బుకు లోకం దాసోహం’ చిత్రానికి కూడా విశ్వనాథే దర్శకుడు. ఈ సినిమా కథా చర్చల్లో విశ్వనాథ్‌ పాల్గొన్నారు. కథ తయారయ్యే వరకు ఆ యూనిట్‌లోనే ఉన్నారు. విశ్వనాథ్‌పై ఆగ్రహంతో ఉన్న ఎన్టీఆర్‌ ఆ సినిమా నుంచి అతన్ని తప్పించి యోగానంద్‌ని తీసుకున్నారు. ఇది జరిగిన 14 సంవత్సరాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ‘జననీ జన్మభూమి’ చిత్రాన్ని రూపొందించారు కె.విశ్వనాథ్‌. కానీ, ఈ సినిమా ఫ్లాప్‌ అయింది. 20 ఏళ్ళపాటు ఎంతో స్నేహంగా ఉండటమే కాకుండా ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలకు పనిచేశారు ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌. చిన్న అభిప్రాయ భేదం వల్ల విడిపోయిన వీరిద్దరూ కలిసి మళ్లీ సినిమా చెయ్యలేదు.