Read more!

English | Telugu

'య‌మ‌లీల‌'కు నందులు రాక‌పోవ‌డంపై ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో అలీ!

 

అలీని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'య‌మ‌లీల' (1994) సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపి, బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. చిన్న సినిమాల్లో ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమా అదే. త‌ల్లి ఆయుష్షు తీరిపోతోంద‌ని తెలిసి, ఆమెను బ‌తికించుకోడానికి ఓ కొడుకు ఏం చేశాడ‌నేది ప్ర‌ధానాంశంగా రూపొందిన ఆ సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించిన తీరు అపూర్వం. 'అలీ లాంటి క‌మెడియ‌న్‌ను హీరోగా పెట్టి సినిమా తీయ‌డ‌మేంటి.. అది ఆడుద్దా, పెట్టుద్దా..' అని ఈస‌డింపుగా మాట్లాడిన వారి నోళ్లు ఆశ్చ‌ర్యంతో తెరుచుకొనేంత హిట్ట‌యింది ఆ సినిమా.

అయితే ఆ ఏడాది నంది అవార్డుల్లో ఆ సినిమాకు కంటితుడుపు అన్న‌ట్లు ఒకే ఒక్క అవార్డు ద‌క్కింది.. అదీ బెస్ట్ కొరియోగ్రాఫ‌ర్‌గా సుచిత్ర‌కు. నిజానికి ఆ సినిమాకు బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ మ్యూజిక్‌, బెస్ట్ యాక్ట‌ర్‌/ యాక్ట్రెస్‌, బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌/ యాక్ట్రెస్ లాంటి ప్ర‌ధాన కేట‌గిరీల్లో ఒక్క అవార్డూ రాలేదు. దీనిపై అలీ ఇప్ప‌టికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

"'య‌మ‌లీల‌'కు బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్‌, బెస్ట్ డైరెక్ట‌ర్‌, బెస్ట్ స్టోరీ, బెస్ట్ మ్యూజిక్ అన్నీ ఇవ్వాలి. ఒక్క‌టి కూడా రాలేదు. 1994లో ఆ సినిమా ఒక థియేట‌ర్‌లో సంవ‌త్స‌రం ఆడింది. బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇచ్చుంటే మ‌న‌సులో కాస్త‌యినా తృప్తి ఉండేది. అప్ప‌ట్నుంచీ అవార్డుల మీద ఆస‌క్తి పోయింది. అవార్డులు వాళ్లివ్వ‌క్క‌ర్లేదు, ప్రేక్ష‌కులు ఇస్తే చాలు" అని 'య‌మ‌లీల' హీరోయిన్ ఇంద్ర‌జ‌ను ఇంట‌ర్వ్యూ చేసిన‌ప్పుడు అలీ చెప్పారు. 

ఇంద్ర‌జ కూడా "'య‌మ‌లీల‌'కు ఒక్క అవార్డు కూడా రాలేదా?  బెస్ట్ మ్యూజిక్ అవార్డ్ అయితే రావాల్సింది" అని అన్నారు. ఆ మూవీలోని "నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మో", "సిరులొలికించే చిన్నిన‌వ్వులే", "జుంబారే జూజుంబ‌రే" పాట‌లు సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాయి మ‌రి! ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చింది స్వ‌యానా ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డే!