Read more!

English | Telugu

ఏఎన్నార్ ముందే కాలేజీ కుర్రోడిని చిత‌క్కొట్టిన డిస్కో శాంతి! షాకైన అక్కినేని!!

 

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు టైటిల్ రోల్ చేసిన ఫిల్మ్ 'కాలేజీ బుల్లోడు' (1992). ఆ సినిమాలో డిస్కో శాంతి ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. కాలేజీలో అక్కినేని, శాంతి, స్టూడెంట్స్ మ‌ధ్య "రాగింగ్ ఆటా.. రాగాలాటా.." అంటూ ఆ సాంగ్ సాగుతుంది. ఆ పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శాంతి ఓ స్టూడెంట్‌ను అక్కినేని ముందే చిత‌క్కొట్టేసింది. ఆమె ఎందుక‌లా చేసిందో అర్థంకాక ఏఎన్నార్ స‌హా అక్క‌డున్న వాళ్లంద‌రూ షాకై పోయారు. ఆ క‌థేమిటంటే...

సాంగ్ తీస్తున్న‌ప్పుడు శాంతి కెమెరాను చూస్తూ ఎక్స్‌ప్రెష‌న్స్ ఇస్తూ డాన్స్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ వై. మ‌హీధ‌ర్ చిత్రీక‌రిస్తున్నారు. అంత‌లో ఓ కుర్రాడు కెమెరా ప‌క్క‌కు వ‌చ్చి నిల్చొని, ఆమెను చూస్తూ న‌వ్వాడు. దాంతో కెమెరా నుంచి ఆమె చూపు అత‌డి వైపు మ‌ళ్లింది. 'ఎవ‌రితను, న‌న్ను చూస్తూ న‌వ్వుతున్నాడు?' అనుకున్నారు శాంతి. ఆ త‌ర్వాత అత‌ను మితిమీరి ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు. అసహ్య‌క‌రంగా, అభ్యంత‌ర‌క‌రంగా సైగ‌లు చేశాడు. ఆ రోజు మ‌ధ్యాహ్నం నుంచీ ఇదే తంతు. శాంతి ఓర్పు వ‌హిస్తూ వ‌చ్చారు.

సాయంత్ర‌మైంది. ఓ షాట్‌లో అక్కినేని ఆమె డ్ర‌స్సును క‌త్తెర‌తో క‌ట్ చేసి టాప్‌ను లాగేస్తారు. అది చేస్తున్న‌ప్పుడు మ‌ధ్యాహ్నం నుంచీ శాంతిని ఇబ్బందికి గురిచేస్తున్న ఆ కాలేజీ కుర్రోడు మ‌రీ అసహ్యంగా సైగ‌లు చేశాడు.

షాట్ అవుతుండంగా, ఆ కుర్రోడిని ద‌గ్గ‌ర‌కు ర‌మ్మ‌ని పిలిచారు శాంతి. ఆ అబ్బాయి వ‌చ్చాడు. అత‌ను ద‌గ్గ‌ర‌కు వ‌చ్చీ రాగానే కాలితో ఒక్క త‌న్ను త‌న్నారు శాంతి. అక్కినేని గారికి ఏమీ అర్థంకాక అలానే చూస్తుండిపోయారు. నోటికి వ‌చ్చిన బూతులు తిడుతూ, ఆ అబ్బాయిని కొడుతూనే ఉన్నారు శాంతి. ఆ త‌ర్వాత అక్కినేని "ఈ అమ్మాయి ఇట్లా కొడుతుందేంటి?" అంటూ అక్క‌డ్నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు.

యూనిట్ మెంబ‌ర్స్ అంతా గ‌బ‌గ‌బా అక్క‌డ‌కు వ‌చ్చి, శాంతిని ప‌ట్టుకొని ఆపారు. ఆ అబ్బాయి 'బ‌తికాంరా బాబూ' అనుకుంటూ, గ‌బ‌గ‌బా లేచి దొరికితే మ‌ళ్లీ ఏం చేస్తారోన‌నే భ‌యంతో చాలా ఎత్తున్న గోడ‌ను కూడా ఎక్కేసి, పారిపోయాడు.

మ‌రుస‌టి రోజు ఆ సాంగ్ లీడ్ సీన్ అక్క‌డే తియ్యాలి. షాట్ తియ్య‌డానికి ముందు, త‌న‌కు కాస్త దూరంలో చైర్‌లో కూర్చొనివున్న శాంతిని "ఇలా రామ్మా" అని పిలిచారు ఏన్నార్‌. శాంతి వ‌చ్చాక‌, "ఎందుక‌మ్మా వాటిన‌ట్లా కొట్టావ్‌?" అన‌డిగారు. ఆ అబ్బాయి త‌న‌తో ఎలా ప్ర‌వ‌ర్తించిందీ చెప్పారు శాంతి. "ఏమైనా అలా కొట్టొచ్చా అమ్మా. త‌గ‌ల‌రాని చోట త‌గిలి వాడు చ‌చ్చిపోతే నువ్వు జైలుకు పోతావ్ క‌ద‌మ్మా" అని చెప్పారు అక్కినేని. "స‌రే సార్" అని త‌ల‌వూపారు శాంతి. అలాంటి ఫైర్ బ్రాండ్ ఆమె!