English | Telugu
నగ్నంగా రోడ్డుమీద నడిచిన శ్రీకాంత్! గుర్తుపట్టని జనం!!
Updated : Sep 7, 2021
పోసాని కృష్ణమురళి డైరెక్షన్‌లో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా 'ఆపరేషన్ దుర్యోధన' (2007). బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా మంచి విజయం సాధించింది. నిజాయితీపరుడైన ఓ పోలీస్ ఆఫీసర్ కొంతమంది రాజకీయ నాయకుల కారణంగా భార్యాపిల్లలను కోల్పోయి, తన వేషం మార్చుకొని రాజకీయాల్లో చేరి, ఏం చేశాడనేది ఆ సినిమా ఇతివృత్తం. ఆ సినిమాలో శ్రీకాంత్ నగ్నంగా మెయిన్ రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లే సీన్ ఒకటుంది. నిజంగానే అలా నడచుకుంటూ శ్రీకాంత్ ఆ సీన్ చేశాడా? ఎవరినైనా డూప్‌తో చేయించారా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
అయితే.. ఆ సీన్ స్వయంగా చేశాడు శ్రీకాంత్. అయితే అది సినిమా షూటింగ్ అనీ, యాక్ట్ చేస్తోంది శ్రీకాంత్ అనీ జనానికి తెలీదు. తెలిస్తే.. ఎలా ఉండేదో తెలీదు. స్క్రిప్టు వినిపించేటప్పుడే పోసాని ఈ సీన్ గురించి శ్రీకాంత్‌కు చెప్పారు. "రాజా.. ఈ సీన్ ఇలా ఉంటుంది. నువ్వెలా చేస్తావనేది నాకు తెలీదు. కథకు ఈ సీన్ చాలా కీలకం. చేస్తావా?" అనడిగారు.
"చేసేద్దాం.. యాక్టింగే కదా" అన్నాడు శ్రీకాంత్. అమ్మాయిలెవరూ ఉండరు, సోలోగా నడుచుకుంటూ వెళ్లే సీన్ కదా.. ఇబ్బందేమీ ఉండదులే అని ముందుగానే అనుకున్నాడు. ఆ సీన్ ఎక్కడ తీశారో తెలుసా? జనంతో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట సెంటర్లో, చార్మినార్ దగ్గర, బేగంపేట మహారాణి కాలేజీ దగ్గర ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడు పోసాని.
శ్రీకాంత్‌ను ఒక చోట దింపేసి, కాస్త దూరంలో ఎదురుగా కారునుపెట్టి, కెమెరా అరేంజ్ చేసి, నడుచుకుంటూ వచ్చేయమని చెప్పేవారు. శ్రీకాంత్ అదృష్టం కొద్దీ రోడ్డునపోయే వారిలో ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. కంటికి ఒకవేపు పొడవాటి గాటు, చిన్న హెయిర్‌తో ఉన్న ఆయనను చూసి ఎవరో పిచ్చాడు నడుచుకుంటూ వెళ్తున్నాడని అనుకున్నారు. మొదట చార్మినార్ దగ్గర ఆ సీన్ చేశారు. ఎవరూ గుర్తుపట్టలేదు.
దాంతో ఇలా ఉండటం వల్ల నన్నెవరూ గుర్తుపట్టడం లేదనే కాన్ఫిడెన్స్‌తో అమీర్‌పేటలో ఆ సీన్ చేశాడు. అక్కడ జనం మరీ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరైనా గుర్తుపడతారేమోనని అనుకున్నాడు కానీ, అలా ఏమీ జరగలేదు. అప్పుడు ఆయన వేషమే ఆయనను జనం గుర్తుపట్టకుండా చేసింది. సినిమా చూసేదాకా అప్పుడు ఆ రోజు రోడ్డుమీద బట్టల్లేకుండా నడిచింది శ్రీకాంత్ అనే విషయం ఆ సినిమా యూనిట్ మెంబర్స్‌కు తప్ప ఇంకెవరికీ తెలీదు. అలా ధైర్యంగా నగ్నంగా ఆ సీన్ చేశాడు శ్రీకాంత్. నిజంగానే ఆ సన్నివేశం సినిమాకు హైలైట్‌గా నిలిచింది.