English | Telugu
10 మంది తారలు.. ఏళ్లు గడుస్తున్నా తరగని గ్లామర్!
Updated : May 15, 2021
మనసులో పుట్టిన ఆలోచన తాలూకు ఎగ్జయింట్‌మెంట్ పోకముందే ఆ పనిని పూర్తి చేసేయాలనుకునే తరమిది. వారం తిరిగేలోపు కొత్త యాప్‌లు పలకరించేస్తున్నాయ్. క్షణానికో కొత్త సదుపాయం జీహుజూర్ అంటూ ముంగిట నిలుస్తోంది. ఇలాంటి తరుణంలోనూ ఏళ్ల తరబడి వినోదాన్ని పంచే హీరోయిన్లు టాలీవుడ్‌లో మనగలుగుతున్నారు. ఎవరికీ బోరు కొట్టకుండా కొత్త ప్రయత్నాలు చేస్తూ అహర్నిశలూ శ్రమిస్తూ ఉనికిని కాపాడుకుంటున్నారు. సినిమా అంటే గ్లామర్. ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న వారు కోకొల్లలు. ఇలాంటివారి పోటీని తట్టుకుంటూ, అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం నిజంగా క్లిష్ట సాధ్యం. అతివ తలుచుకుంటే అసాధ్యం కానిదేదీ లేదంటూ కొంతమంది హీరోయిన్లు నిరూపిస్తున్నారు. కొంతమంది దశాబ్దానికి పైగా, ఇంకొంతమంది ఒకటిన్నర దశాబ్దానికి పైగా సినిమా రంగంలో తమదైన టాలెంట్‌తో ముందుకు సాగుతున్న కథానాయికలెవరో చూద్దామా...
1. అనుష్క శెట్టి
2005లో వచ్చిన 'సూపర్' సినిమాలో నాగార్జున సరసన మెరిసిన అనుష్క ఒకటిన్నర దశాబ్దం నుంచీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. 'అరుంధతి' మూవీతో సూపర్ హీరోయిన్‌గా అవతరించిన ఈమె 'బాహుబలి' సిరీస్‌లో దేవసేన పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. చివరగా 'నిశ్శబ్దం'లో కనిపించిన అనుష్క, ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది.
2. హన్సికా మొత్వాని
పదిహేనేళ్ల వయసులో 2007లో అల్లు అర్జున్ సరసన నటించిన 'దేశముదురు' సినిమాతో ఎంట్రీ ఇచ్చి, కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది హన్సిక. కందరీగ, దేనికైనా రెడీ, పవర్ లాంటి హిట్ సినిమాలు చేసిన హన్సికకు టాలీవుడ్ కంటే కోలీవుడ్ మరింత కలిసొచ్చింది. ఆమె గ్లామర్‌కు దాసోహమైన తమిళ అభిమానులు ఆమెకు గుడికట్టి పూజలు చేస్తున్నారు. తమిళంలో నటించిన తన 50వ చిత్రం 'మహా' విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది.
3. కాజల్ అగర్వాల్
2004లో 'క్యూం హోగయా' నా సినిమాతో హిందీ పరిశ్రమలో ఎంటరైన కాజల్ అగర్వాల్ నటించిన తొలి తెలుగు సినిమా 'లక్ష్మీ కల్యాణం' (2007). టాలీవుడ్ 'చందమామ'గా పేరుతెచ్చుకున్న ఆమె మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, బిజినెస్‌మ్యాన్, బాద్‌షా, ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాలతో గ్లామరస్ హీరోయిన్‌గా ఆడియెన్స్‌ను అలరిస్తూ వస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'ఆచార్య' మూవీ చేస్తోంది.
4. నయనతార
2003లో 'మనసినక్కరె' అనే మలయాళం సినిమాతో తెరంగేట్రం చేసిన నయనతార 2005లో వచ్చిన రజనీకాంత్ సినిమా 'చంద్రముఖి'తో తెలుగువారికి కూడా సుపరిచితురాలైంది. వెంకటేశ్ సరసన నటించిన 'లక్ష్మీ' ఆమె తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా. 'శ్రీరామరాజ్యం'తో నయా సీతమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. తెలుగులో చివరగా చిరంజీవి సినిమా 'సైరా నరసింహారెడ్డి'తో కనిపించింది.
5. సమంత అక్కినేని
2010లో వచ్చిన 'ఏమాయ చేశావే' సినిమాతో నాయికగా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోటే తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య తారగా అవతరించింది సమంత. ఆ తర్వాత కాలంలో ఆ సినిమాలో తనతో నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకున్న ఈ కేరళ అమ్మాయి కెరీర్‌లో దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, మనం, అ ఆ, జనతా గ్యారేజ్, రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి సూపర్‌హిట్ సినిమాలున్నాయి. ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్‌లో 'శాకుంతలం' సినిమా చేసేందుకు ప్రిపేర్ అవుతోంది.
6. శ్రియ సరన్
ప్రస్తుతం ఉన్న తారల్లో మోస్ట్ సీనియర్ గ్లామరస్ హీరోయిన్ శ్రియ. 2001లో 'ఇష్టం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమెకు సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, డాన్ శీను, మనం, గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. మధ్యమధ్యలో ఐటమ్ నంబర్స్‌తోనూ ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తోన్న ఆమె ప్రస్తుతం 'గమనం', 'ఆర్ఆర్ఆర్' సినిమాల్లో నటిస్తోంది.
7. శ్రుతి హాసన్
2009లో హిందీ మూవీ 'లక్'తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన శ్రుతి హాసన్, 2011లో సిద్ధార్థ్ జోడీగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. గబ్బర్ సింగ్, బలుపు, ఎవుడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమమ్ సినిమాలతో ప్రేక్షకుల ఆరాధ్య తారగా మారింది. ఇటీవల రవితేజతో నటించిన 'క్రాక్' సినిమాతో రి-ఎంట్రీ ఇచ్చి అలరించింది. ప్రస్తుతం ప్రభాస్ సినిమా 'సలార్'లో నాయికగా నటిస్తోంది.
8. తాప్సీ పన్ను
కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2010లో వచ్చిన 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెరంగేట్రం చేసిన తాప్సీ, మిస్టర్ పర్‌ఫెక్ట్, దరువు, గుండెల్లో గోదారి, సాహసం, ఆనందో బ్రహ్మ లాంటి చిత్రాలతో ఆకట్టుకుంది. తెలుగులో కంటే హిందీలో అర్థవంతమైన అవకాశాలు వస్తుండటంతో ప్రస్తుతం అక్కడే వరుస సినిమాలతో బిజీగా ఉంది.
9. తమన్నా భాటియా
2005లో హిందీలో 'చాంద్ సా రోషన్ చెహ్‌రా', తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన తమన్నాకు ఆ వెంటనే 'హ్యాపీ డేస్' వచ్చేశాయి. 100% లవ్, రచ్చ, తడాఖా, బాహుబలి, ఊపిరి లాంటి హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. టాప్ స్టార్స్ సరసన చేసిన కొన్ని సినిమాలు ఆడకపోయినా 'ఎఫ్ 2' హిట్టవడం ఆమె కెరీర్‌కు బూస్ట్‌నిచ్చింది. ప్రస్తుతం సీటీమార్, గుర్తుందా శీతాకాలం, ఎఫ్ 3, మేస్ట్రో లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోందీ మిల్కీ బ్యూటీ.
10. త్రిష కృష్ణన్
2003లో తరుణ్‌తో నటించిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో పరిచయమైన త్రిషకు 2004లో ప్రభాస్ సరసన నటించిన 'వర్షం' చిత్రం అభిమాన వర్షాన్ని కురిపించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బాడీగార్డ్ లాంటి సినిమాలు ఆమెను ప్రేక్షకులకు మరింత సన్నిహితం చేశాయి. 'ఆచార్య'లో చిరంజీవితో నటించే అవకాశాన్ని వద్దనుకున్న త్రిష తమిళంలో యమబిజీగా ఉంది.
- యజ్ఞమూర్తి