English | Telugu
కాస్ట్యూమ్ విషయంలో హీరోయిన్‌ని బండబూతులు తిట్టిన డైరెక్టర్.. ఆ తర్వాత ఏమైంది?
Updated : Sep 3, 2024
ఒక సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కావాలంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, నిర్మాతల మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉండాలి. యూనిట్‌లోని ఏ ఒక్కరు తప్పు చేసినా దాని ప్రభావం సినిమాపై పడుతుంది. తద్వారా నష్టపోయేది నిర్మాతే. ఒక సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్‌తో ఇబ్బందులు ఎదురైనా, ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి వారు తప్పుకున్నా మరొకరితో ఆ వర్క్ చేయించుకోవచ్చు. కానీ, తెరపై కనిపించే నటీనటుల వల్ల ఇబ్బందులు ఎదురై సినిమా నుంచి వాళ్ళు తప్పుకుంటే ఆ సినిమాను పూర్తి చేయడం చాలా కష్టమవుతుంది. సినిమా రంగం పుట్టిన నాటి నుంచి చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. నటీనటుల వల్ల కలిగిన ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆపేసిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఈ సమస్య చిన్న దర్శకనిర్మాతలకే కాదు, పెద్దవారికి కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితిని దర్శకుడు సాగర్ ఎదుర్కొన్నారు.
సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో ‘భారత సింహం’ అనే సినిమాను మొదలు పెట్టారు. సినిమాలో హీరోయిన్ అనగానే ముంబై నుంచి దిగుమతి చేసేసుకోవడం తెలుగు వారికి అలవాటే కాబట్టి. ఎంతో మంది హీరోయిన్లను పరిశీలించారు. అప్పటికే డైరెక్టర్ సాగర్.. సౌందర్య, ఆమని వంటి హీరోయిన్లతో చాలా సూపర్‌హిట్ సినిమాలు తీశారు. షూటింగ్ సమయంలో ఆ హీరోయిన్లు ఎంతో సహకరించేవారని చెబుతారు సాగర్. అలాంటి హీరోయిన్స్ ఉంటే చూద్దామని సాగర్ చెప్పారు. కానీ, నిర్మాత మాత్రం హీరోయిన్ ముంబై నుంచి వచ్చిన అమ్మాయి అయితేనే బాగుంటుందని చెప్పడంతో అతని ఇష్ట ప్రకారమే హీరోయిన్‌గా నగ్మాను సెలెక్ట్ చేసుకున్నారు. అప్పటికే నగ్మా తెలుగులో 20 సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. షూటింగ్ స్టార్ట్ చేశారు. మొదటి నుంచీ ఆమెతో దర్శకనిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఒక దశలో కాస్ట్యూమ్స్ విషయంలో నగ్మా చేసిన పని సాగర్‌కు కోపం తెప్పించింది. ఆమె వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్‌ని కుట్టించాలని నిర్మాత అనుకున్నారు. సెపరేట్‌గా కుట్టించడం దేనికి, కావాల్సిన డ్రెస్ ఆమే తెచ్చుకుంటుంది, తర్వాత మనం బిల్ పే చేద్దామని సాగర్ చెప్పారు. ఆ విధంగానే నగ్మా ఒక కాస్ట్యూమ్ తీసుకొచ్చింది. అది టూ పీస్ డ్రస్‌లా ఉంది. దానికి 60 వేలు బిల్ ఇచ్చింది. దాంతో నిర్మాతకు చిర్రెత్తుకొచ్చింది. నేను ఆ బిల్ ఇవ్వను అని మొండికేశాడు. ఆ 60 వేలు నేను ఇస్తానంటూ సాగర్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, నగ్మా మాత్రం ఆ డబ్బు నిర్మాతే ఇవ్వాలంటూ పట్టుబట్టింది. అప్పటివరకు ఓపికగా ఉన్న సాగర్ ఆమెను బండబూతులు తిట్టారు. దాంతో ఆ సినిమా చెయ్యను అంటూ ముంబై చెక్కేసింది నగ్మా.
ఆమెతో చెయ్యాల్సిన సీన్స్ చాలా ఉన్నాయని, కాబట్టి ఆమెను ఒప్పించి తీసుకు రమ్మని నిర్మాతకు చెప్పారు సాగర్. కానీ, నిర్మాత ఒప్పుకోకుండా అతనూ వెళ్లిపోయాడు. నిర్మాతల శ్రేయస్సునే కోరే కృష్ణ ఎలాగోలా సినిమాని పూర్తి చేయమని సాగర్‌ను రిక్వెస్ట్ చేశారు. మధ్యవర్తిగా ఉన్న భరద్వాజ కూడా సాగర్‌కు చెప్పారు. ఆ తర్వాత నగ్మా కోసం ట్రై చేశారు. కానీ, మళ్ళీ ఆమె హైదరాబాద్ రాలేదు. చివరికి కథలో చాలా మార్పులు చేసి షూటింగ్ పూర్తి చేశారు. మొదట అనుకున్న కథకు భిన్నంగా సినిమా రావడంతో సాగర్ శాటిస్ ఫై అవ్వలేదు. ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేశారు. కానీ, అది ఫ్లాప్ అయింది. అలా హీరోయిన్ కారణంగా ఒక సినిమాను అస్తవ్యస్తంగా పూర్తి చెయ్యాల్సి వచ్చింది. దాని వల్ల నిర్మాత బాగా నష్టపోయారు. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో తరచూ జరుగుతూనే ఉంటాయి.