English | Telugu

'పిచ్చి పుల్లయ్య'గా ఎన్టీఆర్ అలరించి 70 ఏళ్ళు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'పిచ్చి పుల్లయ్య' ఒకటి. ఇందులో అమాయకుడైన పల్లెటూరి యువకుడు పుల్లయ్య పాత్రలో టైటిల్ రోల్ చేసి అలరించారు ఎన్టీఆర్. తమ సొంత సంస్థ నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్.ఎ.టి) నుంచి మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. వాణిజ్యపరంగా ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. తదనంతర కాలంలో సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక విభాగాల్లో చిత్రాలు నిర్మించిన అరుదైన సంస్థగా ఎన్.ఎ.టి వార్తల్లో నిలిచింది. అలాగే పలు విజయవంతమైన సినిమాలకు చిరునామాగా నిలిచింది నేషనల్ ఆర్ట్ థియేటర్స్. ఈ చిత్రానికి టి. ప్రకాశరావు దర్శకత్వం వహించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే సమాకూర్చారు. ఎన్టీఆర్ సోదరుడు ఎన్. త్రివిక్రమరావు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 

ఎన్టీఆర్ సరసన కృష్ణ కుమారి నటించిన ఈ సినిమాలో 'షావుకారు' జానకి, గుమ్మడి, అమర్ నాథ్, ఛాయాదేవి, రమణారెడ్డి, హేమలత, మోహన, మహంకాళి వెంకయ్య, కోడూరు అచ్చయ్య ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు. నిజజీవితంలో అక్కాచెల్లెళ్ళు అయిన కృష్ణ కుమారి, షావుకారు జానకి ఇందులో కలిసి నటించడం ఓ విశేషమనే చెప్పాలి. అలాగే ఎన్టీఆర్ కి జంటగా కృష్ణ కుమారి నటించిన తొలి చిత్రమిదే కావడం మరో విశేషం.

అనిసెట్టి సుబ్బారావు మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతమందించారు. "బస్తీకి పోయేటి", "ఆలపించనా", "ఆనందమే", "ఎల్ల వేళలందు", "శోకపు", "అవమానాలకు బలి అవుతున్న", "మనసారా ఒకసారి", "ఏలనోయ్", "రారారా" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. 1953 జూలై 17న జనం ముందు నిలిచిన 'పిచ్చి పుల్లయ్య'.. నేటితో 70 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.