English | Telugu

30 ఏళ్ళ 'ప్రేమపుస్తకం'.. అజిత్ కి ఫస్ట్ ఛాన్సిచ్చిన ఎస్పీబీ సలహా.. గొల్లపూడిని విషాదంలో ముంచిన ఘటన!

ప్రతి సినిమా నిర్మాణం వెనుక కొన్ని మరపురాని ఘటనలు ఉంటాయి. సరిగ్గా 30 ఏళ్ళ క్రితం విడుదలైన 'ప్రేమ పుస్తకం' కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ చిత్రం ఓ స్టార్ కి కథానాయకుడిగా తొలి అవకాశమిస్తే.. ఓ సినీ ప్రముఖుడికి మాత్రం పుత్రవియోగాన్నిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

తమిళనాట స్టార్ హీరోగా రాణిస్తున్న అజిత్ కుమార్.. కథానాయకుడిగా తన మొదటి సినిమాని తెలుగులోనే చేశారని మీకు తెలుసా? అది కూడా 'గానగంధర్వుడు' ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇచ్చిన ఓ సలహా కారణంగానే.. తనకి ఆ అవకాశం దొరికింది. ఎలాగంటే.. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు తన తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. 'ప్రేమ పుస్తకం' పేరుతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా.. కథానాయకుడి పాత్రకై ఓ కొత్త ముఖం కోసం చూస్తున్నారు. ఓసారి ఎస్పీబీని ఇదే విషయమై.. "చూడడానికి బాగుండాలి. మ్యాన్లీగా ఉండాలి. అలాగని చాక్లెట్ బాయ్ లా ఉండకూడదు.. మీకు తెలిసి అలాంటి కుర్రాడి ఉంటే చెప్పండి" అని తమ కథకి సరిపడ యువకుడి గురించి చెప్పుకొచ్చారు గొల్లపూడి. ఈ మాట వినగానే.. బాలుకి తన కొడుకు చరణ్ క్లాస్ మేట్ అయిన అజిత్ కుమార్ వెంటనే గుర్తుకువచ్చి.. తను బాగా కుదురుతాడని సలహా ఇచ్చారు. అలా అజిత్ కి 'ప్రేమ పుస్తకం'లో నటించే అవకాశం దక్కింది. అయితే, ఓ విషాదం కారణంగా సినిమా కాస్త ఆలస్యమై సెకండ్ ఫిల్మ్ గా చేసిన తమిళ చిత్రం 'అమరావతి' ముందుగా రిలీజైంది. ఆపై చేసిన కొన్ని తమిళ చిత్రాలతో అజిత్ స్టార్ గా ఎదిగారు.

ఇంతకీ 'ప్రేమ పుస్తకం' సమయంలో చోటుచేసుకున్న ఆ విషాదం ఏమిటంటే.. గొల్లపూడికి ముగ్గురు కొడుకులు. వారిలో చిన్నవాడైన శ్రీనివాస్ కి మాత్రమే సినిమా రంగం అంటే ఆసక్తి. ఒకవైపు రచయితగా రాణిస్తూ.. మరోవైపు ప్రముఖ దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేస్తుండేవాడు శ్రీనివాస్. ఈ అనుభవంతోనే 'ప్రేమ పుస్తకం' కథ తయారుచేసుకున్నాడు శ్రీనివాస్. హీరోగా అజిత్, హీరోయిన్ గా అప్పటికే కొన్ని హిందీ, మలయాళం చిత్రాలు చేసిన కంచన్ ని ఎంచుకున్నాడు. తొలి ఎనిమిది రోజులు సినిమా షూటింగ్ చాలా అంటే చాలా సాఫీగా సాగింది. కానీ.. తొమ్మిదో రోజు (1992 ఆగస్టు 12) ఏదైతే ఉందో ఆ రోజు మాత్రం ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదే  శ్రీనివాస్ జీవితంలో చివరి రోజు అవుతుందని ఎవరూ అనుకోలేదు.  ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే.. వైజాగ్ బీచ్ లోని ఒక బండమీద హీరోయిన్ కంచన్ పై ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సిద్ధమయ్యాడు శ్రీనివాస్. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద అల వచ్చి శ్రీనివాస్ ని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయింది. కొంతసేపు గడిచాక తను శవమై కనిపించాడు. అంతే.. యూనిట్ అంతా షాక్ లో ఉండిపోయింది. అయితే.. ఆ సమయంలో గొల్లపూడి మారుతీరావు అక్కడ లేరు. యూనిట్ కూడా శ్రీనివాస్ మరణం గురించి గొల్లపూడికి చెప్పలేదు. తరువాత ప్రమాదం గురించి తెలిసి ఆసుపత్రికి వెళ్ళిన గొల్లపూడికి.. ఒక వ్యక్తి పోస్ట్ మార్టమ్ అయిపోయిందని చెప్పగానే షాకయ్యారు. కొన్నాళ్ళపాటు ఆ బాధలోనే ఉండిపోయారు గొల్లపూడి. ఎట్టకేలకు కొడుకు కలని నెరవేర్చడానికి అన్నట్లుగా సినిమాని తన దర్శకత్వంలోనే పూర్తిచేశారు. అంతేకాదు.. కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ పేరిట ఫౌండేషన్ స్థాపించి నూతన దర్శకులను ప్రోత్సహించేందుకు అవార్డ్స్ అందిస్తూ వచ్చారు. అలా.. 'ప్రేమ పుస్తకం' నిర్మాణం వెనుక ఓ తీరని విషాదం ఉంది.

ఇక 'ప్రేమ పుస్తకం' చిత్రం విషయానికి వస్తే.. టైటిల్ కి తగ్గట్టే ఇదో ప్రేమకథా చిత్రం. శ్రీకర్ (అజిత్), చరిత్ర (కంచన్) అనే ఓ జంట మధ్య పుట్టిన ప్రేమ.. చివరికి ఏ తీరాలకి చేరిందన్నదే సినిమా. దేవేంద్రన్ సంగీతమందించిన ఈ చిత్రంలో పాటలన్నీ బాలు, చిత్ర ఆలపించారు. "విశాఖ బీచ్ లో", "అనుకున్నది", "గెలుచుకో", "కలికి సీతమ్మకు", "మొదలైనది మన", "మూడు నెలలేగా", "పూర్ణమధం".. అంటూ సాగే గీతాలు ఆకట్టుకున్నాయి. కమర్షియల్ గా సినిమా అనుకున్నంతగా రాణించకపోయినా.. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ (గొల్లపూడి మారుతీరావు), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ (మనోహర్ రెడ్డి), స్పెషల్ జ్యూరీ (కంచన్) విభాగాల్లో 'నంది' పురస్కారాలు వరించాయి. సత్యనారాయణ నిర్మాణంలో 1993 జూలై 16న జనం ముందు నిలిచిన 'ప్రేమ పుస్తకం'.. ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.