English | Telugu

బర్త్ డే స్పెషల్: భారతీరాజా నేరుగా తీసిన తెలుగు చిత్రాలివే.. కామన్ పాయింట్ ఏంటో తెలుసా!

 

గ్రామీణ నేపథ్య చిత్రాలకు పెట్టింది పేరు.. దర్శకదిగ్గజం భారతీరాజా. ప్రధానంగా తమిళంలో సినిమాలు తీస్తూ వచ్చిన భారతీరాజా.. అడపాదడపా హిందీ, తెలుగు భాషల్లోనూ కొన్ని చిత్రాలు చేశారు. మరీముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే.. భారతీరాజా నుంచి మొత్తంగా 4 ప్రాజెక్ట్స్ వచ్చాయి. వీటిలో స్టార్ హీరోల మూవీస్ కూడా ఉండడం విశేషం.

నేడు (జూలై 17) భారతీరాజా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన డైరెక్ట్ చేసిన తెలుగు చిత్రాలకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పరిశీలిద్దాం.

కొత్త జీవితాలు (1981): భారతీరాజా డైరెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా ఇది. 1979 నాటి తన కోలీవుడ్ మూవీ 'పుదియ వార్పుగళ్' (కె. భాగ్యరాజ్, రతి అగ్నిహోత్రి) ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీరాజా. ఇందులో సుహాసిని, హరిప్రసాద్, గుమ్మడి ముఖ్య పాత్రల్లో కనిపించగా.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు కట్టారు. 

సీతాకోక చిలక (1981): అప్పట్లో యువతరాన్ని విశేషంగా అలరించిన  ప్రేమకథా చిత్రమిది. తమిళంలో 'అలైగళ్ ఓయ్ వదిల్లై' (కార్తిక్, రాధ) పేరుతోనూ, తెలుగులో 'సీతాకోక చిలక'  (మురళి అలియాస్ కార్తిక్, ముచ్చర్ల అరుణ) పేరుతోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న ఈ బైలింగ్వల్ మూవీ.. కోలీవుడ్ లో ముందుగా రిలీజైంది. తెలుగులో నెల రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఈ సినిమాకీ ఇళయరాజానే ట్యూన్స్ ఇచ్చారు.

ఆరాధన (1987): మెగాస్టార్ చిరంజీవి, సుహాసిని, రాధిక ముఖ్య పాత్రల్లో భారతీరాజా రూపొందించిన ఈ సినిమా.. 1986 నాటి తమిళ చిత్రం 'కడలోర కవితైగళ్' (సత్యరాజ్, రేఖ, రంజిని)కి రీమేక్ వెర్షన్. ఈ మూవీకి కూడా ఇళయరాజా స్వరాలు సమకూర్చారు.

జమదగ్ని (1988): భారతీరాజా దర్శకత్వం వహించిన చివరి తెలుగు సినిమా ఇది. అంతేకాదు.. భారతీరాజా తెలుగులో చేసిన సినిమాల్లో నాన్ - రీమేక్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.  సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ డ్రామాలో రాధ నాయిక. ఈ ఫిల్మ్ కి కూడా ఇళయరాజానే మ్యూజిక్ కంపోజర్.

మొత్తంగా చూస్తే.. భారతీరాజా తెలుగులో నాలుగు డైరెక్ట్ మూవీస్ చేయగా.. అన్నింటికీ కూడా ఇళయరాజానే స్వరకర్త. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. భారతీరాజా తెరకెక్కించిన సినిమాల్లో ఎక్కువగా ఇళయరాజా మ్యూజికల్సే. ఇంకా చెప్పాలంటే.. భారతీరాజా పేరు చెప్పగానే ఠక్కున ఇళయరాజా కాంబోనే గుర్తుకు వస్తుంది కూడా. అయితే భారతీరాజా తమిళ చిత్రాలలో కొన్నింటికి ఇళయరాజా కాకుండా ఎ.ఆర్. రెహమాన్, దేవా తదితరులు మ్యూజిక్ ఇచ్చారు. ఇక భారతీరాజా హిందీ మూవీస్ కి ఇళయరాజా స్వరాలు అందించిన వైనం లేదనే చెప్పాలి. సో.. ఒక్క తెలుగులో మాత్రమే భారతీరాజా సినిమాలన్నింటికీ ఇళయరాజా సంగీత దర్శకుడు అన్నమాట.