English | Telugu
'పంతాలు పట్టింపులు'కి 55 ఏళ్ళు.. కృష్ణ మిస్ శోభన్ బాబు ఎస్!
Updated : Jul 19, 2023
నట భూషణ్ శోభన్ బాబుకి అచ్చొచ్చిన కథానాయికల్లో కళాభినేత్రి వాణిశ్రీ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు సినిమాలు.. అప్పటి జనాల్ని ఆకట్టుకున్నాయి. అలాంటి చిత్రాల్లో 'పంతాలు పట్టింపులు' ఒకటి. ఓ మరాఠి మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ సంగీత, నృత్య ప్రధాన చిత్రాన్ని తిలక్ డైరెక్ట్ చేశారు. గీతాంజలి, లీలా గాంధీ, గుమ్మడి, రమణారెడ్డి, రమాప్రభ, మాలతి, ఛాయాదేవి ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పినిశెట్టి మాటలు అందించగా.. శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు పాటలు రాశారు.
కథ విషయానికి వస్తే.. మురళి (శోభన్ బాబు) ఎంతో కష్టపడి కళారంజని (లీలా గాంధీ)కి నాట్యం నేర్పిస్తాడు. ఆ నాట్యంతో ఆమెకి మంచి పేరు వస్తుంది కూడా. కానీ ఒక నాట్య ప్రదర్శనలో అతని వాయిద్యానికి తగిన అడుగులు వేయలేక మురళిదే తప్పు అంటుంది కళారంజని. పైగా లయ తప్పింది అంటుంది. అంతేకాదు.. తనలాంటి మరో నాట్యగత్తెను తయారుచేయలేవని సవాలు చేస్తుంది. మరో మంచి నాట్యగత్తెను సృష్టించి ఆమెని ఓడిస్తానని సవాలు పై సవాలు చేస్తాడు. ఈ క్రమంలోనే.. ప్రతిభావంతులైన అక్కాచెల్లెళ్ళు జిమ్మి (వాణిశ్రీ), సోనీ (గీతాంజలి)కి నృత్యం నేర్పిస్తాడు. అయితే ఇద్దరు కూడా మురళిని ప్రేమిస్తారు. ఈ నేపథ్యంలో.. మురళి పంతం నెరవేరిందా? లేదా? అన్నది మిగిలిన సినిమా. శోభన్ బాబు, వాణిశ్రీ, గీతాంజలి నటన ఈ సినిమాకి ప్రధాన బలం. మరీముఖ్యంగా.. వాణిశ్రీ, గీతాంజలి నృత్యాలు కనువిందుగా ఉంటాయి. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. తొలుత ఈ సినిమాలోని మురళి పాత్రకి సూపర్ స్టార్ కృష్ణ ని ఎంచుకున్నారట. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల శోభన్ బాబు ఆ పాత్రని ధరించారు.
పెండ్యాల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలో భాగమైన `తమాషా` నృత్యం తాలూకు పాటలకు ఆయన అందించిన మ్యూజిక్ గుర్తుండిపోయేలా ఉంటుంది. శ్రీ శంభూ ఫిల్మ్స్ పతాకంపై దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి నిర్మించిన 'పంతాలు పట్టింపులు'.. 1968 జూలై 19న విడుదలైంది. నేటితో ఈ సినిమా 55 ఏళ్ళు పూర్తిచేసుకుంది.