English | Telugu

కృష్ణ, కృష్ణంరాజు, సత్యనారాయణ 'స్నేహబంధం'కి 50 ఏళ్ళు!

తెలుగునాట స్నేహితుల కథలతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో 'స్నేహబంధం'కి ప్రత్యేక స్థానం ఉంది. రక్త సంబంధం కన్న స్నేహబంధం పటిష్టమైనదని నిరూపించే ఈ కుటుంబ గాథలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మిత్రులుగా కనిపించారు. జమున, లీలారాణి, శ్రీరంజని, గుమ్మడి, రాజబాబు, రమాప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణరావు సంభాషణలు సమకూర్చారు. చిత్ర నిర్మాత యన్.వి. సుబ్బరాజు స్వయంగా కథను అందించడం విశేషం. 

సత్యం సంగీతమందించిన ఈ సినిమాకి ఆత్రేయ, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని "స్నేహబంధం ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము" (ఎస్పీ బాలు, సుశీల, జి. ఆనంద్), "స్నేహబంధం ఎంత మధురము అది చెరిగిపోయి చేదైతే బ్రతుకు శూన్యము" (సుశీల, బాలు), "మోమాటపడకండి మొగుడుగారు" (ఘంటసాల, సుశీల), "ఇద్దరమూ గదిలో" (బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి), "షి ఉంటేనే షికారు కారుంటేనే హుషారు" (రామకృష్ణ, సుశీల), "ఎవడమ్మా వాడెవడమ్మా" (సుశీల) అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. బి. అచ్యుతరామరాజు సమర్పణలో శ్రీ వాణీ కంబైన్స్ పతాకంపై యన్.వి. సుబ్బరాజు నిర్మించిన 'స్నేహబంధం'.. 1973 జూలై 20న విడుదలై ప్రజాదరణ పొందింది. నేటితో ఈ చిత్రం 50 వసంతాలు పూర్తిచేసుకుంది.