English | Telugu
"ధనమేరా అన్నింటికి మూలం".. 'లక్ష్మీ నివాసం'కి 55 ఏళ్ళు
Updated : Jul 19, 2023
'శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం' అనే పాయింట్ తో రూపొందిన సినిమా 'లక్ష్మీ నివాసం'. విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయనకి జంటగా అంజలీ దేవి కనిపించగా.. సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు, కళాభినేత్రి వాణిశ్రీ, భారతి, పద్మనాభం, విజయలలిత, రామ్మోహన్, చిత్తూరు వి. నాగయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆరుద్ర రచన చేశారు. 'దుడ్డే దొడ్డప్ప' అనే కన్నడ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
కథ విషయానికి వస్తే.. స్వయంకృషితో శ్రీమంతుడైన సుబ్బయ్య (ఎస్వీఆర్)కి భార్య శారద (అంజలీదేవి), ముగ్గురు పిల్లలు చంద్రం (కృష్ణ), రాజు (పద్మనాభం), కల్పన (భారతి) ఉంటారు. అయితే వీరెవరికి డబ్బు విలువ తెలియదు. వృథా ఖర్చులు చేసేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. భార్యాబిడ్డల ప్రవర్తనలో మార్పు కోసం గోపాల్ (చిత్తూరు వి. నాగయ్య), అతని పిల్లలు ఆనంద్ (శోభన్ బాబు), ఆశ (వాణిశ్రీ) సహాయం తీసుకుంటాడు సుబ్బయ్య. చివరికి అందరిలోనూ మార్పు రావడంతో.. కథ సుఖాంతమవుతుంది. పాయింట్ సింపుల్ గా ఉన్నా.. సినిమాని తీర్చిదిద్దిన విధానం బాగుంటుంది. అలాగే.. చిత్రం ప్రారంభంలో ఎస్వీఆర్ కాలం, ధనం విలువ గురించి చెప్పే మాటలతో పాటు "పేదరికమే పెద్ద గురువు" వంటి సంభాషణలు ఆలోచింపజేసేలా ఉంటాయి.
ఇక స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ అందించిన పాటల విషయానికి వస్తే.. "ధనమేరా అన్నింటికి మూలం" ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే "నవ్వు నవ్వించు", "గువ్వలాంటి చిన్నది", "చేయి చేయి కలుపు", "ఓహో ఊరించే అమ్మాయి", "ఇల్లే కోవెల చల్లని వలపే దేవత", "సోడా సోడా ఆంధ్రా సోడా" అంటూ మొదలయ్యే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వీనస్ - పద్మిని కంబైన్స్ పతాకంపై టి. గోవింద రాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1968 జూలై 19న విడుదలై మంచి విజయం సాధించిన 'లక్ష్మీ నివాసం'.. నేటితో 55 వసంతాలు పూర్తిచేసుకుంది.