English | Telugu
జగ్గయ్య, కృష్ణకుమారి 'అనుబంధాలు'కి 60 ఏళ్ళు.. వీనుల విందైన పాటలు ఎస్సెట్!
Updated : Jul 19, 2023
విలక్షణ అభినయానికి చిరునామాగా నిలిచారు ప్రముఖ నటులు కొంగర జగ్గయ్య. కథానాయకుడిగానూ ఆయన కొన్ని చిత్రాల్లో అలరించారు. వాటిలో 'అనుబంధాలు' ఒకటి. ఇందులో జగ్గయ్యకి జంటగా కృష్ణకుమారి నటించారు. పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, రమణారెడ్డి, పద్మనాభం, బేబి పద్మిని, పేకేటి, స్వర్ణ, చదలవాడ, కేవీఎస్ శర్మ, ఏవీ సుబ్బారావు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. పిచ్చేశ్వరరావు సంభాషణలు సమకూర్చారు.
ఎం.బీ. శ్రీనివాస్ సంగీతమందించగా.. దాశరథి, కొసరాజు రాఘవయ్య, సముద్రాల, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. "ఇద్దరు అనుకొని ప్రేమించడమే" (పీబీ శ్రీనివాస్, జమునా రాణి), "నా పేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు" (ఎల్. ఆర్. ఈశ్వరి), "ఒకరొకరు చేయి కలుపుదాం" (మాధవపెద్ది బృందం), "తీవెకు పూవే అందం" (పి. సుశీల), "చల్లని తల్లి ఇల్లాలే" (ఘంటసాల), "ఈ రేయి కరిగిపోనున్నది" (జమునా రాణి), "చిన్న చిన్న పిల్లలము" (ఎల్. ఆర్. ఈశ్వరి, కె. రాణి) అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. వాసవి ఫిలిమ్స్ పతాకంపై కె. వెంకటేశ్వరరావు, కేయస్ మార్కండేయులు నిర్మించిన 'అనుబంధాలు'.. 1963 జూలై 19న జనం ముందు నిలిచింది. నేటితో ఈ చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంది.