English | Telugu
ఏయన్నార్ 'పల్లెటూరి బావ'కి 50 ఏళ్ళు.. హైలైట్ గా నిలిచిన "రంగి" పాట!
Updated : Aug 14, 2023
నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కొన్ని రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 'పల్లెటూరి బావ' ఒకటి. శివాజీ గణేశన్, జయలలిత, శుభ ముఖ్య పాత్రల్లో రూపొందిన తమిళ సినిమా 'పట్టిక్కాడా పట్టణమా' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ఏయన్నార్ కి జంటగా లక్ష్మి నటించగా శుభ కీలక పాత్రలో కనిపించారు. కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాలో చంద్రమోహన్, నాగభూషణం, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు, గోకిన రామారావు, మాడా, చిట్టిబాబు, సారథి, రమా ప్రభ, సుకుమారి, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
తాతినేని చలపతిరావు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి, కొసరాజు సాహిత్యమందించారు. పాటల్లో "ఒసేయ్ వయ్యారి రంగి" (రెండు వెర్షన్స్) బాగా ప్రాచుర్యం పొందగా.. "ఏయ్ బావయ్య పిలక బావయ్య", "మురిపించే గువ్వలారా", "ఎటు చూసినా అందమే", "తెలివి ఒకడి సొమ్మంటే", "శరభ శరభ" గీతాలు కూడా రంజింపజేశాయి. 1973 ఆగస్టు 15న విడుదలైన 'పల్లెటూరి బావ'.. మంగళవారంతో 50 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.