English | Telugu

ఎన్టీఆర్ 'మంచి మనసుకు మంచి రోజులు'కి 65 ఏళ్ళు.. ఆ పాపులర్ పాటని చిరంజీవి హిట్ మూవీలో భలే వాడారు!

నటరత్న నందమూరి తారక రామారావు కెరీర్ లో పలు రీమేక్ హిట్స్ ఉన్నాయి. వాటిలో 'మంచి మనసుకు మంచి రోజులు' ఒకటి. తమిళ చిత్రం 'తాయ్ పిరందాళ్ వళి పిరక్కుమ్' (ఎస్. ఎస్. రాజేంద్రన్, ఎం.ఎన్. రాజమ్, ప్రేమ్ నజీర్, రాజసులోచన) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజసులోచన, రాజనాల, రేలంగి, అల్లు రామలింగయ్య, రమణ మూర్తి, పేకేటి శివరామ్, సూర్యకాంతం, గిరిజ, జయశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. సి.ఎస్. రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, టి. అశ్వద్ధ నారాయణ నిర్మించారు. ఏకే వేలన్ కథకి సముద్రాల జూనియర్ సంభాషణలు సమకూర్చారు. 

ఘంటసాల మాస్టార్ సంగీతమందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, గిరిజపై చిత్రీకరించిన "అనుకున్నదొక్కటి అయిందొక్కటి" గీతం బాగా పాపులర్ అయింది. ఇదే పాటని మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ 'చట్టానికి కళ్ళు లేవు' (1981)లో కీలక సన్నివేశాల్లో సందర్భానుసారంగా వాడుకున్నారు. ఇక "రావే నా చెలియా", "కలవారి స్వార్థం", "హైలో హైలెస్సా", "ధరణికి గిరి భారమా", "ఓ చిన్ని బాలా", "వినవమ్మా వినవమ్మా", "భరత నారి" గీతాలు కూడా రంజింపజేశాయి. 1958 ఆగస్టు 15 జనం ముందు నిలిచిన 'మంచి మనసుకు మంచి రోజులు'.. సిల్వర్ జూబ్లీ జరుపుకుని విజయవాడలో 152 రోజులు ప్రదర్శన చూసింది. కాగా, మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 65 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.