English | Telugu
'సీతామాలక్ష్మి'కి 45 వసంతాలు.. హీరోయిన్ అయ్యే ఓ పల్లెటూరి అమ్మాయి కథ!
Updated : Jul 26, 2023
కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన సినిమాల్లో.. చాలామటుకు మ్యూజికల్ ఎంటర్టైనర్స్ గా మెప్పించాయి. వాటిలో 'సీతామాలక్ష్మి' చిత్రం ఒకటి. చంద్రమోహన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ రోల్ లో అలరించింది. రామేశ్వరికి ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో శ్రీధర్, వంకాయల సత్యనారాయణ, డబ్బింగ్ జానకి, ఈశ్వరరావు, మాస్టర్ తులసీ రామ్, మాస్టర్ హరి, పల్లవి, పి.ఎల్. నారాయణ, సాక్షి రంగారావు దర్శనమిచ్చారు. అల్లు రామలింగయ్య, దేవదాస్ అతిథి పాత్రల్లో కనిపించారు. కె. విశ్వనాథ్ కథను అందించిన ఈ సినిమాకి జంధ్యాల సంభాషణలు సమకూర్చారు. కె. విశ్వనాథ్, జంధ్యాల, కె. మురారి స్క్రీన్ ప్లే అందించారు.
కొండయ్య (చంద్రమోహన్), సీతామాలక్ష్మి అలియాస్ సీతాలు (తాళ్ళూరి రామేశ్వరి) పల్లెటూరులోని ఓ టూరింగ్ టాకీస్ లో పనిచేస్తుంటారు. ఇద్దరూ ప్రేమలో ఉంటారు. నిరక్షరాస్యులే అయినప్పటికీ సినిమాలు చూస్తూ.. వాటిలోని డైలాగులు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ గడిపేస్తుంటారు కొండయ్య, సీతాలు. ఇదిలా ఉంటే, ఓ సారి ఆ ఊరికి షూటింగ్ నిమిత్తం ఓ సినిమా యూనిట్ వస్తుంది. సీతాలుని హీరోయిన్ చేస్తానంటూ ఆ చిత్ర నిర్మాత తప్పుడు వాగ్దానం చేస్తాడు. ఈ క్రమంలో.. కొండయ్య, సీతాలు హైదరాబాద్ వెళతారు. అక్కడికి వెళ్ళాక వారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. అయితే, చిత్రకారుడు రవి (శ్రీధర్) సహాయంతో సీతాలు కాస్త సరితా దేవిగా మారి హీరోయిన్ అవుతుంది. ఆమె విజయం, డబ్బు చూసి దూరపు చుట్టాలు కూడా దగ్గరకు చేరుకుంటారు. మరోవైపు.. అక్కడి వాతావరణానికి ఇమడలేక కొండయ్య తిరిగి గ్రామానికి వస్తాడు. చివరికి సీతాలు, కొండయ్య మళ్ళీ ఎలా ఒక్కటయ్యారు అన్నదే మిగిలిన కథ.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతమందించిన ఈ చిత్రానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు. ఇందులోని "మావిచిగురు తినగానే", "సీతాలు సింగారం", "నువ్విట్టా నేనిట్టా", "ఏ పాట నే పాడను", "పదే పదే పాడుతున్నా", "చాలు చాలు", "కొక్కరొక్కో" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. యువ చిత్ర పతాకంపై మురారి - నాయుడు నిర్మించిన 'సీతామాలక్ష్మి'.. తమిళంలో 'ఎనిప్పడిగళ్', హిందీలో 'సితార' పేర్లతో రీమేక్ అయింది. 1978 జూలై 27న విడుదలై మంచి విజయం సాధించిన 'సీతామాలక్ష్మి'.. గురువారంతో 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.