English | Telugu
కృష్ణ 'జమదగ్ని'కి 35 ఏళ్ళు.. భారతీరాజా చివరి తెలుగు చిత్రం!
Updated : Jul 15, 2023
తమిళనాట అగ్ర దర్శకుడిగా వెలుగొందిన భారతీరాజా.. తెలుగులోనూ నేరుగా కొన్ని సినిమాలు చేశారు. అలా భారతీరాజా తెరకెక్కించిన చివరి తెలుగు చిత్రంగా ప్రత్యేక స్థానం పొందింది 'జమదగ్ని'. సూపర్ స్టార్ కృష్ణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో గ్లామర్ క్వీన్ రాధ నాయికగా నటించింది. కైకాల సత్యనారాయణ, చారు హాసన్, సుమలత, గొల్లపూడి మారుతీరావు, కాకినాడ శ్యామల, త్యాగరాజు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. డిస్కో శాంతి ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.
సత్యమూర్తి అనే ఓ జిత్తులమారి రాజకీయ నాయకుడి దురాగతాలపై జమదగ్ని అనే ఓ జర్నలిస్ట్ ఎలా పోరాడాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భారతీరాజా ఆస్థాన సంగీత దర్శకుడైన మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "ఇది స్వాతి జల్లు", "ఏలా ఇంత దూరం", "లగి జిగి", "రాక్షస పాలన" (రెండు వెర్షన్స్).. ఇలా ఇందులోని అన్ని పాటలు ఆకట్టుకున్నాయి. పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై చుక్కపల్లి వేణుబాబు, జి. నీలకంఠ రెడ్డి నిర్మించిన 'జమదగ్ని'.. భారతీరాజా పుట్టినరోజు (జూలై 17)కి ఒక రోజు ముందు అంటే 1988 జూలై 16న విడుదలైంది. ఆదివారంతో ఈ సినిమా 35 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.