English | Telugu

జగపతి బాబు, సౌందర్య 'పెళ్ళి పీటలు' ఎక్కి పాతికేళ్ళు!

'కుటుంబ కథా చిత్రాల కథానాయకుడు' జగపతి బాబు సరసన కనువిందు చేసిన నాయికల్లో 'అభినేత్రి' సౌందర్య ఒకరు. వీరిద్దరి కలయికలో అరడజనుకిపైగా సినిమాలు వచ్చాయి. వాటిలో విజయం సాధించిన చిత్రాల్లో 'పెళ్ళి పీటలు' ఒకటి. 'ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్' ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా.. మలయాళ చిత్రం 'ఈ పుళయుమ్ కడన్ను' (దిలీప్, మంజు వారియర్) ఆధారంగా తెరకెక్కింది. తను ప్రేమించిన అమ్మాయి తాలూకు బాధ్యతలను నెరవేర్చే క్రమంలో జైలు పాలయి, చివరకి పెళ్ళి పీటలు ఎక్కే గోపీ అనే ఓ యువకుడి కథే.. 'పెళ్ళి పీటలు' చిత్రం. తెలుగు నేటివిటికి తగ్గట్టు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. దివారకర్ బాబు సంభాషణలు సమకూర్చారు. 

చంద్రమోహన్, సుధ, కోట శ్రీనివాసరావు, నిర్మలమ్మ, తనికెళ్ళ భరణి, సుధాకర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, ఝాన్సీ, మేఘన, మాస్టర్ ఆనంద్ వర్ధన్, శివాజీ రాజా, హేమంత్, చిత్తజల్లు లక్ష్మీపతి, సుబ్బరాయ శర్మ, చిట్టిబాబు, ఉత్తేజ్, రజిత, తెలంగాణ శకుంతల, తాతినేని రాజేశ్వరి ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు. 

ఎస్వీ కృష్ణారెడ్డి స్వరకల్పనలో రూపొందిన పాటలకు చంద్రబోస్ సాహిత్యమందించారు. టైటిల్ సాంగ్ తో పాటు "చిటపట చినుకులు పడుతూ ఉంటే" (రీమిక్స్), "జిల్ జిల్" (రెండు వెర్షన్స్), "మోహనం మోహనం", "యే చకచకా", "యమునా తరంగం", "రాజేలు వెలిగించు" (శ్లోకం).. ఇలా పాటలన్నీ ఆకట్టుకున్నాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన 'పెళ్ళి పీటలు'.. సౌందర్య పుట్టినరోజు (జూలై 18) సందర్భాన్ని పురస్కరించుకుని 1998 జూలై 16న జనం ముందు నిలిచింది. ఆదివారంతో ఈ సినిమా పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.