English | Telugu

'స్వర్ణకమలం'కి 35 ఏళ్ళు.. "అర్థం చేసుకోరూ.." అంటూ అలరించిన భానుప్రియ!

సంగీత‌, నృత్య సంబంధిత చిత్రాలకు పెట్టింది పేరు.. కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన రూపొందించిన సినిమాల్లో కొన్ని.. 'ఉత్తమ చిత్రం' విభాగంలో 'నంది' పురస్కారం అందుకున్నాయి. వాటిలో `స్వ‌ర్ణ‌క‌మ‌లం`(1988)కి ప్ర‌త్యేక స్థానం ఉంది. అభినేత్రి భానుప్రియ‌లోని న‌ర్త‌కిని, న‌టీమ‌ణిని పూర్తి స్థాయిలో ఆవిష్క‌రించిన ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేశ్ కథానాయకుడిగా అలరించారు. సంగీత‌, నృత్య ప్ర‌ధానంగా తెరకెక్కిన ఈ సినిమాకి కె. విశ్వ‌నాథ్ ర‌చ‌న చేయ‌గా, సాయినాథ్ సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఇందులో "అర్థం చేసుకోరూ.." అంటూ మీనాక్షి పాత్రలో భానుప్రియ క‌న‌బరిచిన అభినయం, పలికించిన హావభావాలు, పాటల్లో కనువిందైన నృత్యాలు తనకి 'ఉత్త‌మ న‌టి'గా ఇటు 'నంది', అటు 'ఫిల్మ్ ఫేర్'అవార్డులు అందించాయి. అలాగే చందు పాత్రలో ఆకట్టుకున్న వెంక‌టేశ్ సైతం 'నంది'స్పెష‌ల్ జ్యూరీని సొంతం చేసుకున్నారు. కేవలం పురస్కారాలకే పరిమితం కాకుండా ప‌లు చిత్రోత్స‌వాల్లోనూ 'స్వర్ణకమలం' ప్ర‌ద‌ర్శిత‌మై అప్పట్లో వార్తల్లో నిలిచింది.

కథ విషయానికి వస్తే.. మీనాక్షి (భానుప్రియ) సంప్రదాయ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి. తండ్రి నుంచి తనకి వారసత్వంగా వచ్చిన సంప్రదాయ నృత్యం తాలూకు విలువను గుర్తించక.. బాగా డబ్బు సంపాదించి జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటుంది. అలాంటి మీనాక్షిని పెయింటర్ అయిన చంద్రశేఖర్ అలియాస్ చందు (వెంకటేశ్) ఎలా సరైన దిశలో నడిపించాడు? అనేదే 'స్వర్ణకమలం' సినిమా.ఈ కథని కె. విశ్వనాథ్ తెరకెక్కించిన విధానంతో పాటు నటీనటుల అభినయం, లోక్ సింగ్ ఛాయాగ్రహణం, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం, 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సాహిత్యం.. 'స్వర్ణకమలం'ని క్లాసిక్ గా నిలిపాయి.

పాటల విషయానికి వస్తే.. "ఆకాశంలో ఆశ‌ల హ‌రివిల్లు", "కొత్త‌గా రెక్క‌లొచ్చెనా"విశేషాదరణ పొందగా.. "ఘ‌ల్లు ఘ‌ల్లు", "శివ‌పూజ‌కు", "అందెల‌ర‌వ‌మిది"కూడా అటు వీనుల‌విందుగానూ, ఇటు క‌నువిందుగానూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పాట‌ల‌న్నింటిలోనూ భానుప్రియ నృత్యాలు ఎస్సెట్ అనే చెప్పాలి. ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమ‌ర్ప‌ణ‌లో భాను ఆర్ట్ క్రియేష‌న్స్ ప‌తాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించిన 'స్వ‌ర్ణ‌క‌మ‌లం'.. 1988 జూలై 15న విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందింది. కాగా, శనివారంతో ఈ మ్యూజిక‌ల్ హిట్ 35 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.