English | Telugu
శంకర్ తొలి చిత్రం 'జెంటిల్ మేన్'కి 30 ఏళ్ళు.. కమల్, రాజశేఖర్ వదులుకున్న సినిమా!
Updated : Jul 29, 2023
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో శంకర్ ఒకరు. సామాజిక సమస్యలకు సాంకేతిక హంగులు జోడించి సినిమాలను రూపొందించడం.. ఈ దిగ్గజ దర్శకుడి శైలి. తొలి చిత్రం 'జెంటిల్ మేన్' నుంచి శంకర్ తన మార్క్ ను చూపిస్తూ వచ్చారు. విద్యావ్యవస్థలోని లొసుగులను లక్ష్యంగా చేసుకుని తన డెబ్యూ మూవీ 'జెంటిల్ మేన్'ని తెరకెక్కించారాయన. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమా.. అనువాద రూపంలో తెలుగువారిని కూడా విశేషంగా అలరించింది. శంకర్ కి శుభారంభాన్నివ్వడమే కాకుండా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రంతో.. యాక్షన్ కింగ్ అర్జున్ తమిళనాట టాప్ స్టార్స్ లో ఒకరిగా నిలిచారు.
వాస్తవానికి ఈ సినిమాని కమల్ హాసన్ తో చేయాలనుకున్నారు శంకర్. అయితే, కథలో ఉన్న రాజకీయాంశాల కారణంగా కమల్ వదులుకున్నారు. దీంతో రాజశేఖర్ ని సంప్రదించినా.. కొన్ని కారణాల వల్ల అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలోనే అర్జున్ వద్దకు వెళ్ళారు శంకర్, చిత్ర నిర్మాత కేటీ కుంజుమెన్. అయితే, కథ వినకుండానే నో చెప్పిన అర్జున్.. చివరికి శంకర్ పట్టుదలకి ముగ్థుడై స్టోరీ విని వెంటనే కనెక్ట్ అయ్యారు. అలా.. ఎట్టకేలకు 'జెంటిల్ మేన్' పట్టాలెక్కింది. కానీ నిర్మాణం పూర్తయ్యాక ఏ పంపిణీదారుడు కొనడానికి ముందుకు రాలేదు. చూడడానికి ఏదో డబ్బింగ్ సినిమాలా ఉందంటూ వెనక్కు వెళ్ళిపోయారు. కట్ చేస్తే.. కుంజుమెన్ తనే స్వయంగా పంపిణీ చేసి.. సంచలన విజయం అందుకున్నారు. 175 రోజుల పాటు ప్రదర్శితమైన ఈ సినిమా ఫలితం చూసి.. సదరు పంపిణీదారుల నోట మాట రాలేదు. తమిళ, తెలుగు భాషల్లో అఖండ విజయం సాధించడంతో.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ముచ్చటపడి హిందీలో రీమేక్ చేశారు. 'ది జెంటిల్ మేన్' పేరుతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేశ్ భట్ తెరకెక్కించిన సదరు రీమేక్ డిజప్పాయింట్ చేసింది. మాతృకలోని ఆత్మని పట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.
పాటల విషయానికి వస్తే.. ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన గీతాలన్నీ అప్పట్లో ఉర్రూతలూగించాయి. ప్రభుదేవా, గౌతమిపై చిత్రీకరించిన స్పెషల్ సాంగ్ "చికుబుకు చికుబుకు రైలే" అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. అలాగే "కొంటెగాడ్ని కట్టుకో", "నా ఇంటిముందున్న", "ముదినేపల్లి", "మావేలే మావేలే".. గీతాలు కూడా భలేగా రంజింపజేశాయి. ఇందులో అర్జున్ కి జంటగా మధుబాల నటించగా వినీత్, శుభశ్రీ, నంబియార్, మనోరమ, గౌండమణి, సెంథిల్, చరణ్ రాజ్, రాజన్ పి. దేవ్, అజయ్ రత్నం ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
'బెస్ట్ ఫిల్మ్', 'బెస్ట్ డైరెక్టర్', 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్' విభాగంలో 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను అందుకున్న 'జెంటిల్ మేన్'.. 'బెస్ట్ యాక్టర్', 'బెస్ట్ డైరెక్టర్', 'బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్', 'బెస్ట్ ఫిమేల్ సింగర్' విభాగాల్లో తమిళ నాడు రాష్ట్ర పురస్కారాలను సొంతం చేసుకుంది. 1993 జూలై 30న విడుదలై ఘనవిజయం సాధించిన 'జెంటిల్ మేన్'.. ఆదివారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. అంటే.. దర్శకుడిగా శంకర్ 30 ఏళ్ళ కెరీర్ పూర్తిచేసుకుంటున్నారన్నమాట.