English | Telugu
బయోగ్రఫీ: వెండితెర నవ్వుల జల్లు.. మన అల్లు రామలింగయ్య!
Updated : Jul 31, 2023
స్వరాజ్య పోరాటంలో భాగంగా జైలు శిక్ష అనుభవించిన ఆయన.. వెండితెరపై మాత్రం నవ్వుల జల్లు కురిపించారు. తన కుటుంబంలో తనతోనే మొదలైన ఆ వినోద సేవ.. తరతరాల పాటు కొనసాగేలా బాట వేశారు. వేయికి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించి.. తెలుగువారి మదిలో అల్లుకుపోయిన ఆ నటుడే అల్లు రామలింగయ్య. జూలై 31 అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు బయోగ్రఫీ రూపంలో మీ కోసం..
అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. చదువుకొనే రోజుల్లో నటన మీద ఆసక్తితో.. పలు నాటకాల్లో వేషాలు వేసేవారాయన. చిరుప్రాయంలోనే వినోదం పంచడంలో ఆరితేరిన అల్లు.. హోమియోపతి వైద్యం నేర్చుకుని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి తగువైద్యం అందించేవారు. అంతేకాదు.. స్వరాజ్య పోరాట సమయంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి, కొన్నాళ్ళు జైలు పాలయ్యారు. తదనంతర కాలంలో అల్లు రామలింగయ్యలోని మంచి నటుడ్ని గుర్తించిన ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, నాటకరంగ ప్రముఖుడు గరికపాటి రాజారావు.. తను ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'పుట్టిల్లు'లో తొలి అవకాశాన్నిచ్చారు. ఇందులో జమున కథానాయికగా నటించగా.. అల్లు రామలింగయ్య మరో ముఖ్య పాత్రలో కనిపించారు.
'పుట్టిల్లు' ఆర్థికంగా విజయం సాధించకపోయినా.. అల్లు రామలింగయ్యకి అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. మరీముఖ్యంగా.. అప్పట్లో అగ్ర కథానాయకులుగా దూసుకుపోతున్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లో అల్లు భలేగా సందడి చేశారు. 'పరివర్తన', 'చక్రపాణి', 'వద్దంటే డబ్బు', 'దొంగ రాముడు', 'సంతానం', 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'భాగ్యరేఖ', 'తోడికోడళ్ళు', 'పెళ్ళినాటి ప్రమాణాలు', 'ఆడపెత్తనం', 'అప్పు చేసి పప్పు కూడు', 'మంచి మనసుకు మంచి రోజులు', 'ఇల్లరికం'.. ఇలా 1950ల్లో పలు విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు. ఆపై మరో నాలుగు దశాబ్దాలకి పైగా ఎన్నో వైవిధ్యభరితమైన వేషాల్లో ఎంటర్టైన్ చేశారు. వీటిలో ఎక్కువగా హాస్యపూరిత పాత్రలే చేసి.. ఇంటిల్లపాది అలరించారు అల్లు రామలింగయ్య. అలాగే 1974లో విడుదలైన 'బంట్రోతు భార్య'తో తన తనయుడు అల్లు అరవింద్ ని నిర్మాతగా ప్రోత్సహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై తన సమర్ఫణలో పలు విజయవంతమైన చిత్రాల నిర్మాణానికి దారి చూపారు. తన చిన్న కుమార్తె సురేఖని అప్పుడప్పుడే చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణతో ఎదుగుతున్న చిరంజీవికి కన్యాదానం చేశారు. అల్లు వారింటికి అల్లుడిగా వెళ్ళకముందు వర్థమాన నటుడుగా స్వయంకృషితో ముందుకు సాగుతున్న చిరంజీవి.. ఆపై మెగాస్టార్ గా పేరుపొందారు. మామఅల్లులిద్దరూ కలిసి పలు చిత్రాల్లో వినోదమూ పంచారు. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి పలు అగ్ర కథానాయకుల చిత్రాల్లో కనిపించి తన అభినయంతో మురిపించారు అల్లు. 50 ఏళ్ళ పాటు తన నటప్రస్థానాన్ని కొనసాగించిన అల్లు రామలింగయ్య.. 2004లో విడుదలైన 'జై'లో చివరిసారిగా వెండితెరపై కనిపించారు. అయితే మనవలు అల్లు అర్జున్, రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ముచ్చట మాత్రం నెరవేరలేదనే చెప్పాలి.
ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న అల్లు రామలింగయ్య.. 1990లో భారత ప్రభుత్వం తరపున 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు. అలాగే 1998లో 'ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ అవార్డు'ని, 2001లో రాష్ట్ర ప్రభుత్వం తరపున 'రఘుపతి వెంకయ్య' పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. వెండితెరపై వినోదజల్లు కురిపించిన అల్లు.. తన 82వ ఏట అంటే 2004 జూలై 31న కన్నుమూశారు. భౌతికంగా అల్లు రామలింగయ్య మనకు దూరమైనా.. తన పాత్రలతో మాత్రం జనుల మదిలో నిలిచే ఉంటారు.
(జూలై 31.. అల్లు రామలింగయ్య వర్థంతి సందర్భంగా)