English | Telugu
రాజశేఖర్ 'ఆగ్రహం'కి 30 ఏళ్ళు.. దేశం కోసమే బతకాలనుకునే సోల్జర్ కథ!
Updated : Jul 18, 2023
ఆవేశపూరిత పాత్రలకు పెట్టింది పేరు.. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్. 'అంకుశం' వంటి సంచలన చిత్రం తరువాత ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ బేనర్ లో ఆయన నటించిన 'ఆగ్రహం' కూడా ఈ తరహా పాత్రతో రూపొందిన సినిమానే. కె.యస్. హరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజశేఖర్ సరసన అమల నటించింది. కథానాయికగా ఇదే ఆమె చివరి చిత్రం కావడం విశేషం. పధిరె కృష్ణారెడ్డి, బాబూ మోహన్, బెంగుళూరు పద్మ, రామ్ గోపాల్, రమేశ్, ఎన్. వీరాస్వామి, గాదిరాజు సుబ్బారావు, సుందర రామకృష్ణ, శ్రీధర్ రెడ్డి, సంధ్య, సంధ్యశ్రీ, బేబి శ్రేష్ఠ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
కథ విషయానికి వస్తే.. తన ఊపిరి ఉన్నంత కాలం దేశం కోసమే బతకాలనుకునే ఓ సోల్జర్.. రౌడీ రాజకీయ నాయకుల నుంచి దేశాన్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు? ఈ క్రమంలో ఏం కొల్పోయాడు? అన్నది 'ఆగ్రహం' సినిమా. ఎమ్మెస్ ఆర్ట్ మూవీస్ యూనిట్ కథ, స్క్రీన్ ప్లే ను అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు సమకూర్చారు. రాజ్ - కోటి బాణీలు కట్టిన ఈ సినిమాకి మల్లెమాల, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహితి పదరచన చేశారు. పాటల్లో "నిన్ను కోరి వచ్చా రాజశేఖరా" అమితంగా ఆకట్టుకుంది. యం. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో 1993 జూలై 19న జనం ముందు నిలిచిన 'ఆగ్రహం'.. బుధవారంతో 30 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.