English | Telugu
"సరోజా.. వద్దమ్మా వద్దు".. 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా' వచ్చి అప్పుడే 15 ఏళ్ళైందా!
Updated : Jul 18, 2023
ఫీల్ గుడ్ ఎంటర్టైనర్స్ కి పెట్టింది పేరు.. ఎ. కరుణాకరన్. 'తొలిప్రేమ' (1998) వంటి మెమరబుల్ మూవీతో దర్శకుడైన కరుణాకరన్.. ఆ తరువాత ఆశించిన విజయాలు అందుకోలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో తనకి మళ్ళీ సక్సెస్ ని అందించిన సినిమా 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా'. ఈ చిత్రంతోనే యశో సాగర్, స్నేహ ఉల్లాల్ తెలుగుతెరకు హీరోహీరోయిన్లుగా పరిచయమయ్యారు. బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్, సుధ, ప్రసాద్ బాబు, కవిత, సురేఖా వాణి, సత్యకృష్ణన్, సుమన్ శెట్టి, పింగ్ పాంగ్ సూర్య, శ్రీలత, ఎల్బీ ఎరామ్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, 'అల్లరి' సుభాషిణి, గౌతమ్ రాజు, అనంత్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కథ విషయానికి వస్తే.. రూ. 50 కోట్ల ఆస్తికి వారసురాలైనా సవతితల్లి కారణంగా ఇబ్బందులకి గురవుతుంటుంది ధనలక్ష్మి (స్నేహా ఉల్లాల్). తండ్రి మరణానంతరం ఆస్తిపై కన్నేసిన సవతి తల్లి.. ధన ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్ళి చేయాలనుకుంటుంది. దీంతో ఇంటి నుంచి పారిపోయి వస్తుంది ధనలక్ష్మి. ఈ క్రమంలోనే.. గ్యారేజ్ ఓనర్ కొడుకైన అరవింద్ (యశో సాగర్)తో పరిచయమవుతుంది. ధనతో మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అరవింద్. అయితే ధన మాత్రం చిన్ననాటి స్నేహితుడైన బాలాజీని తప్ప మరొకరిని ప్రేమించలేనని చెబుతుంది. ఈ నేపథ్యంలో.. అరవింద్ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నదే మిగిలిన సినిమా. కరుణాకరన్ మార్క్ తో సాగే ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలో.. "సరోజా.. వద్దమ్మా వద్దు" అంటూ సాగే హాస్య సన్నివేశం భలేగా ఎంటర్టైన్ చేసింది.
ఇక పాటల విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించిన ఈ సినిమాకి అనంత శ్రీరామ్ సాహిత్యమందించారు. "ఉల్లాసంగా", "దణ్ణాల్లే తల్లి", "నా ప్రేమ", "లాలిపాట", "ప్రియతమా", "మాట మాటికి", "చకోరి" అంటూ సాగే పాటలు యువతరాన్ని అలరించాయి. అమృత్ అమర్ నాథ్ ఆర్ట్స్ పతాకంపై జి.ఎస్. రంగనాథ్, బి.పి. సోము నిర్మించిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా'.. 'బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్' గా ఎ. కరుణాకరన్ కి 'నంది' పురస్కారాన్ని అందించింది. ఇందులో యశోసాగర్ పాత్రకి నటుడు శివాజీ డబ్బింగ్ చెప్పడం విశేషం. తొలి చిత్రంతోనే యువతరాన్ని భలేగా ఆకట్టుకున్న యశో సాగర్.. 2012 డిసెంబర్ లో ఓ కారు ప్రమాదంలో మరణించడం విషాదకరం. కాగా, 2008 జూలై 18న విడుదలై ఘనవిజయం సాధించిన 'ఉల్లాసంగా.. ఉత్సాహంగా'.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.