English | Telugu

తన సినిమా ఫ్లాప్‌కి ప్రేక్షకులే కారణమంటున్న డైరెక్టర్‌.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు!

తన సినిమా ఫ్లాప్‌కి ప్రేక్షకులే కారణమంటున్న డైరెక్టర్‌.. ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు!

ఒక సినిమా హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా దానికి ఎక్కువ బాధ్యత డైరెక్టర్‌కే ఉంటుంది. ఎందుకంటే కథ ఎంపిక నుంచి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ ఎంపిక వరకు తుది నిర్ణయం దర్శకుడిదే. తను ఎంపిక చేసుకున్న కథను జనరంజకంగా తెరకెక్కించడం, ఆర్టిస్టుల నుంచి చక్కని నటనను రాబట్టుకోవడం అనేది డైరెక్టర్‌ చేతుల్లోనే ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వారి ఆలోచనా ధోరణి మారుతోంది. కాబట్టి ప్రజెంట్‌ ఉన్న ట్రెండ్‌కి అనుగుణంగా సినిమాలు తీస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఏ డైరెక్టర్‌ అయినా ముందుగా గమనించాల్సిన విషయం ఇది. కానీ, అవేవీ పట్టించుకోకుండా తనకు తోచిన విధంగా సినిమా తీసేసి ప్రేక్షకులు చూడాల్సిందే అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సినిమా ఫ్లాప్‌ అయితే ఆడియన్స్‌ తన ఆలోచనలను అర్థం చేసుకునే స్థాయిలో లేరని వారిని నిందించడం సరైంది కాదు. తాజాగా ఓ దర్శకుడు తను తీసిన సినిమా ఫ్లాప్‌ అయిందని.. ఆ క్రెడిట్‌ అంతా ప్రేక్షకులదేనని చెబుతున్నాడు. 

ప్రేక్షకులపై అంతటి అభాండాన్ని వేసిన ఆ డైరెక్టర్‌ ఎవరో తెలుసుకుందాం. 2005లో ఆషిక్‌ బనాయా ఆప్‌నే చిత్రంతో రైటర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముదస్సర్‌ అజీజ్‌ 2010లో వచ్చిన దుల్హా మిల్‌గయా చిత్రంతో డైరెక్టర్‌ అయ్యాడు. ఓ నాలుగు సినిమాలు డైరెక్ట్‌ చేశాడు. అయితే ఏ సినిమా కూడా సూపర్‌హిట్‌ అవ్వలేదు. ఏవరేజ్‌, బిలో ఏవరేజ్‌ సినిమాలే చేశాడు. తాజాగా ఖేల్‌ ఖేల్‌ మే పేరుతో ఓ కామెడీ డ్రామాను తెరకెక్కించాడు. ఆగస్ట్‌ 15న ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. 2016లో వచ్చిన ఇటాలియన్‌ మూవీ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, ప్రగ్యా జైస్వాల్‌, వాణి కపూర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో ఒక్కసారిగా ప్రేక్షకులపై విరుచుకుపడ్డాడు ముదస్సర్‌. తను ఓ గొప్ప సినిమా తీశానని, దాన్ని అర్థం చేసుకోలేని బుర్ర తక్కువ వాళ్ళు ప్రేక్షకులు అంటూ రెచ్చిపోయాడు. మానసికంగా ప్రేక్షకులు ఎదగకపోవడం వల్లే తన సినిమాను ఫ్లాప్‌ చేశారని ఆరోపిస్తున్నాడు. 

గొప్ప గొప్ప హిట్‌ సినిమాలు తీసిన డైరెక్టర్లు సైతం తమ సినిమా ఫ్లాప్‌ అయితే.. ఎందుకు ఫ్లాప్‌ అయిందనే దాని గురించి ఒకసారి పునరాలోచన చేసుకుంటారు. తాము ఆ సినిమాలో చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఈ దర్శక మహాశయుడు మాత్రం తన సినిమాను చూసేంత పరిజ్ఞానం ప్రేక్షకులకు లేదని వాదిస్తున్నాడు. ఈ దర్శకుడి తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. ముదస్సర్‌ను విపరీతంగా ట్రోల్‌ చేస్తూ అతనికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారు, ఎలాంటి సినిమాలైతే వారి ఆలోచనలకు దగ్గరగా ఉంటాయనేది ఆలోచించి సినిమాలు తియ్యాలి. అంతేతప్ప తన ఒక్కడి ఆలోచనతో అందరూ ఏకీభవించాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఎంతో తెలివిగా తన సినిమా ఫ్లాప్‌ను ప్రేక్షకులపైకి నెట్టేసానని ముదస్సర్‌ అనుకున్నాడు. కానీ, జనం నుంచి ఇలాంటి రెస్పాన్స్‌ వస్తుందని ఊహించలేదు. అనాలోచితంగా తను చేసిన కామెంట్స్‌కి కక్కలేక, మింగలేక నెటిజన్ల ట్రోలింగ్‌ను భరిస్తున్నాడు ముదస్సర్‌.