English | Telugu

అభిషేక్‌ బచ్చన్‌తో తలపడనున్న సూర్య.. ‘ధూమ్‌ 4’లో విలన్‌గా కోలీవుడ్‌ స్టార్‌!

బాలీవుడ్‌లో రూపొందిన ‘ధూమ్‌’ సిరీస్‌ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రిలీజ్‌ అయిన మూడు భాగాలు ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 2004లో ‘ధూమ్‌’ రిలీజ్‌ అయి సంచలన విజయం సాధించింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కార్‌ ఛేజ్‌లు, బైక్‌ రేసింగ్‌లు ఆడియన్స్‌ని బాగా థ్రిల్‌ చేశాయి. అప్పట్లో రూ.11 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.72 కోట్లు కలెక్ట్‌ చేసింది. దీంతో ధూమ్‌ సిరీస్‌ ప్రారంభమైంది. 2006లో ‘ధూమ్‌2’ విడుదలైంది. రూ.35 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.162 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ సిరీస్‌లో మూడో భాగంగా 2013లో వచ్చిన ‘ధూమ్‌3’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా, రూ.589 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సిరీస్‌ని యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించింది. మొదటి రెండు భాగాలకు సంజయ్‌ గాధ్వి దర్శకత్వం వహించగా, మూడో భాగాన్ని విజయ్‌ కృష్ణ ఆచార్య డైరెక్ట్‌ చేశారు. ఈ మూడు భాగాలకు నిర్మాత ఆదిత్య చోప్రా కథను అందించడం విశేషం. ‘ధూమ్‌’ సిరీస్‌కి ఇంత క్రేజ్‌ ఉన్నప్పటికీ ‘ధూమ్‌4’ కోసం ఇప్పటివరకు ప్లానింగ్‌ లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ధూమ్‌ 3 రిలీజ్‌ అయి 11 సంవత్సరాలవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ధూమ్‌ 4 కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇంత గ్యాప్‌ రావడంతో ధూమ్‌ ఫ్రాంచైజీలో ఇక సినిమాలు రాకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా ‘ధూమ్‌4’కి సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తున్నాయి.

యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆదిత్య చోప్రా, విజయ్‌ కృష్ణ ఆచార్య, అయాన్‌ ముఖర్జీ, శ్రీధర్‌ రాఘవన్‌ సంయుక్తంగా ‘ధూమ్‌4’కి సంబంధించిన ప్లానింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. గత చిత్రాల కంటే భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే ధూమ్‌ 3 వచ్చిన టైమ్‌కి, ఇప్పుడు నడుస్తున్న సినిమా ట్రెండ్‌కి చాలా డిఫరెన్స్‌ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో కేర్‌ఫుల్‌గా ధూమ్‌ 4ని ప్లాన్‌ చేస్తున్నారు. ధూమ్‌ 3 రిలీజ్‌ అయి ఇన్ని సంవత్సరాలవుతున్నా ఇప్పటివరకు నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌పై ప్లానింగ్‌ చేయకపోవడానికి మరో కారణం కూడా ఉందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అదేమిటంటే.. అప్పటికి ఇంకా బాహబలి రిలీజ్‌ అవ్వలేదు. 2013 వరకు ఇండియాలో బాలీవుడ్‌దే పైచేయిగా ఉండేది. బాహుబలి సిరీస్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, కల్కి చిత్రాల తర్వాత ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీని శాసించే స్థాయికి టాలీవుడ్‌ చేరుకుంది. టాలీవుడ్‌ ధాటికి తట్టుకోవాలంటే ధూమ్‌ సిరీస్‌లో వచ్చే సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండాలి.. అందుకే 11 సంవత్సరాల గ్యాప్‌ తీసుకున్నారని తెలుస్తోంది.

నిర్మాత ఆదిత్య చోప్రా ధూమ్‌ సిరీస్‌ను ఎంతో పకడ్బందీగా ప్లాన్‌ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ప్రధానంగా కనిపించే హీరో అభిషేక్‌ బచ్చన్‌. రెండో భాగంలో హృతిక్‌ రోషన్‌ చేశారు. మూడో భాగంలో ఆమిర్‌ ఖాన్‌ డూయల్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధూమ్‌ 4 కోసం సౌత్‌ స్టార్‌ కోసం చూస్తోంది యశ్‌రాజ్‌ ఫిలింస్‌. మొదటి మూడు భాగాల్లో సౌత్‌ స్టార్‌ ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు సినిమాల లెక్కలు పూర్తిగా మారిపోవడంతో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చెయ్యాలంటే వివిధ భాషల ఆర్టిస్టులు సినిమాలో ఉండడం తప్పనిసరిగా మారింది. అందులో భాగంగానే ధూమ్‌ 4లో విలన్‌గా తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య నటించబోతున్నారనే వార్త కోలీవుడ్‌లో సందడి చేస్తోంది. ఇప్పటికే యశ్‌రాజ్‌ ఫిలింస్‌కి చెందినవారు సూర్యను సంప్రదించి ఈ సినిమా ప్రపోజల్‌ను ఆయన ముందుంచారని సమాచారం. సూర్య కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ధూమ్‌ 4కి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని, 2027లో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తారని యశ్‌రాజ్‌ ఫిలింస్‌ నుంచి సమాచారం అందుతోంది.