English | Telugu

రూ. 6580 కోట్లు వ‌సూలుచేసిన‌ 'స్పైడ‌ర్‌మ్యాన్: హోమ్‌క‌మింగ్' విడుద‌లై నాలుగేళ్లు!

టామ్ హాలండ్ టైటిల్ రోల్ పోషించిన 'స్పైడ‌ర్‌మ్యాన్‌: హోమ్‌క‌మింగ్' 2017లో ఇదే రోజు విడుద‌లై, ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించి, బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. మార్వెల్ కామిక్స్ క్యారెక్ట‌ర్ స్పైడ‌ర్‌మ్యాన్ ఆధారంగా ఈ సూప‌ర్‌హీరో మూవీని కొలంబియా మూవీస్‌, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించ‌గా, సోనీ పిక్చ‌ర్స్ రిలీజ్ చేసింది. జాన్ వాట్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మైఖెల్ కీట‌న్ (వ‌ల్చ‌ర్‌), జాన్ ఫ‌వ‌రూ, గ్వెనిత్ పాల్‌ట్రో, డోనాల్డ్ గ్రోవ‌ర్‌, జాక‌బ్ బాల‌లాన్‌, లారా హారియ‌ర్ కీల‌క పాత్ర‌లు చేశారు. జెందాయా నాయిక‌గా న‌టించ‌గా రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ స్పెష‌ల్ అప్పీరెన్స్ ఇచ్చాడు.

ఈ మూవీలో హైస్కూల్ లైఫ్‌, స్పైడ‌ర్‌మ్యాన్‌గా వ‌ల్చ‌ర్‌ను ఎదుర్కోవ‌డానికీ మ‌ధ్య బ్యాలెన్స్ చేసుకోవ‌డానికి పీట‌ర్ పార్క‌ర్ ఎలా ప్ర‌య‌త్నించాడో ఈ సినిమాలో మ‌నం చూశాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 'స్పైడ‌ర్‌మ్యాన్‌: హోమ్‌క‌మింగ్' 880 మిలియ‌న్ డాల‌ర్ల‌ను (రూ. 6,581 కోట్లు) వ‌సూలు చేసింది. స్పైడ‌ర్‌మ్యాన్ ఫిలిమ్స్‌లో సెకండ్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా, 2017లో సిక్స్త్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది.

ఇండియాలో ఈ సినిమా రూ. 72 కోట్ల‌ను వ‌సూలు చేయ‌డం గ‌మ‌నార్హం. ఓవ‌ర్సీస్ విష‌యానికి వ‌స్తే.. చైనా, సౌత్ కొరియా, యు.కె.లో భారీ వ‌సూళ్ల‌ను ఈ సినిమా సాధించింది.